వర్షంతో 270 ఫీడర్ల పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయం

వర్షంతో 270 ఫీడర్ల పరిధిలో కరెంటు సరఫరాలో అంతరాయం
  • ఫీడర్లను వేగవంతంగా పునరుద్ధరిస్తున్నం: సదరన్​ డిస్కం సీఎండీ ఫరూఖీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా సుమారు 270 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో 200 ఫీడర్ల పరిధిలో కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో సరఫరాను పునరుద్ధరించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో చెట్లకొమ్మలు విరిగిపడటం వల్ల పునరుద్ధరణ పనులకు అదనపు సమయం పట్టింది. మెహదీపట్నం, అమీర్‌‌‌‌పేట్, మలక్‌‌‌‌పేట్, హబ్సిగూడ, రామ్‌‌‌‌నగర్ వంటి ప్రాంతాల్లో ట్రాన్స్‌‌‌‌ఫార్మర్లలో సాంకేతిక లోపాల కారణంగా విద్యుత్ సరఫరాకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుతం అన్ని ఫీడర్లలో విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరినట్టు అధికారులు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌‌‌‌ఫార్మర్ స్థాయిలో నమోదైన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్  ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సిబ్బంది చేపట్టిన వేగవంతమైన చర్యలతో పునరుద్ధరణ పనులు సకాలంలో పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు.