
- సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ
- నీటిలో ఈదుతూ వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ చేపట్టిన లైన్ మెన్
హైదరాబాద్, వెలుగు: నీటిలో ఈదుతూ వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టిన సిబ్బందిని సదరన్ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ అభినందించారు. భారీ వర్షం, ఈదురు గాలులతో సదరన్ డిస్కం పరిధిలోని సిద్దిపేట జిల్లా బస్వాపూర్ సెక్షన్ లోని నాగసముద్రాల చెరువు వద్ద లక్ష్మీపూర్11 కేవీ ఫీడర్ కండక్టర్ తెగడంతో మూడు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫిర్యాదు అందిన వెంటనే లైన్మెన్ హైమొద్దీన్, తన సహాయకులు రాజేందర్, హరీశ్తో కలిసి చెరువులో ఈదుతూ వెళ్లి, విద్యుత్ స్తంభం ఎక్కి సరఫరాను పునరుద్ధరించారు.
బుధవారం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ విద్యుత్ పునరుద్ధరణ చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లైన్మెన్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం విద్యుత్ సరఫరా సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. డైరెక్టర్ ఆపరేషన్స్ నర్సింహులు గ్రేటర్ హైదరాబాద్లో, డైరెక్టర్ శివాజీ నల్గొండ జిల్లాలో, డైరెక్టర్ చక్రపాణి మహబూబ్నగర్ జిల్లాలో, డైరెక్టర్ కృష్ణారెడ్డి మెదక్ జిల్లాలో పర్యటిస్తూ సరఫరా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.