- సంస్థకు అందిన ప్రశంసాపత్రాలు
- సీఎండీ జితేశ్ వి పాటిల్కు అందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా సదరన్ డిస్కమ్కు అరుదైన గుర్తింపు లభించింది. బుధవారం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) నుంచి నాలుగు విభాగాల్లో ప్రశంసాపత్రాలు అందాయి. నాణ్యతా నిర్వహణకు సంబంధించి ఐఎస్వో 9001, సమాచార భద్రతకు ఐఎస్వో 27001, స్టోర్స్ నిర్వహణలో ‘జపనీస్ 5 ఎస్ విధానం’, వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నందుకు ‘క్వాలిటీ మార్క్’లాంటి నాలుగు గుర్తింపులు దక్కాయి. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా సీఎండీ జితేశ్ వి పాటిల్ ఈ పత్రాలను స్వీకరించారు. ఐఎస్వో ఇండియా ఆడిటర్ శివయ్య సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఆ నాలుగు గుర్తింపులు ఇవే..
- డిస్కమ్ పరిధిలోని కార్యాలయాలు, వివిధ విభాగాల్లో నాణ్యతా నిర్వహణ విధానాలను సమర్థంగా అమలు చేయడం, రికార్డుల నిర్వహణ, అంతర్గత నియంత్రణ, పర్యవేక్షణ, కార్యాచరణ ప్రక్రియలను మెరుగుపరచడం, నిరంతర అభివృద్ధికి కృషి చేయడంలాంటి అంశాలకు సంబంధించి ఐఎస్వో 9001 గుర్తింపు లభించింది.
- విద్యుత్ పంపిణీ వ్యవస్థకు సంబంధించిన ఐటీ నెట్వర్క్లు, కీలక సమాచారం, డేటా పరిరక్షణ, సమాచార లభ్యతపై నియంత్రణ, సైబర్ ముప్పుల నిర్వహణలాంటి అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఐఎస్వో 27001 గుర్తింపు దక్కింది.
- విద్యుత్ పంపిణీ వ్యవస్థకు అవసరమైన పరికరాలు, సామగ్రి నిల్వ, వాటి నిర్వహణలో క్రమశిక్షణను పెంపొందించేందుకు జపాన్లో అభివృద్ధి చేసిన 5ఎస్ విధానాన్ని అమలు చేయడం ద్వారా మరో గుర్తింపు లభించింది.
- వినియోగదారులకు నాణ్యమైన, విశ్వసనీయమైన విద్యుత్ సేవలు అందించేందుకు గత ఐదేండ్లుగా టీజీఎస్పీడీసీఎల్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘క్వాలిటీ మార్క్’దక్కింది.
అధికారులు, ఉద్యోగులతోనే సాధ్యం: డిప్యూటీ సీఎం భట్టి
సంస్థలోని అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం వల్లే డిస్కమ్కు నాలుగు ఐఎస్వో గుర్తింపులు వచ్చాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఉన్నతాధికారుల మార్గదర్శకత్వం, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల అంకితభావం, సమష్టి కృషితోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. సదరన్ డిస్కమ్ సీఎండీ జితేష్ వీ పాటిల్ మాట్లాడుతూ.. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని అన్నారు. ఈ నాలుగు నాణ్యతా గుర్తింపులు సంస్థకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు స్ఫూర్తినిస్తున్నాయనిని పేర్కొన్నారు.
