మాస్క్ పెట్టుకోలేదని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ

మాస్క్ పెట్టుకోలేదని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ

దేశంలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పుడొచ్చిన సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా కొత్త కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాయి. కొన్నిచోట్ల లాక్ డౌన్ విధించగా.. మరికొన్నిచోట్ల నైట్ కర్ఫ్యూ విధించారు. ఇకపోతే మాస్క్ అయితే కంపల్సరీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. 

అయితే కరోనా జాగ్రత్తల గురించి ప్రభుత్వాలు ఎంత చెప్పినా.. ప్రజలు చెవిన పెట్టడంలేదు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్, కోవిడ్ నిబంధనలు ఏవీ పాటించకుండా అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. ఇటువంటి వాళ్లందరినీ దారిలోకి తేవాల్సిన పోలీసులు కూడా మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. అటువంటి పోలీసుకు మరో పోలీసు ఉన్నతాధికారి మాస్కు పెట్టుకోలేదని ఫైన్ వేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి ఆదివారం ఎంటీబీ జంక్షన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు పెట్టుకోకుండా వెళ్లడం ఎస్పీ గమనించారు. వెంటనే సీఐని ఆపి.. మాస్కు గురించి అడిగారు. మాస్క్ పెట్టుకోనందుకు సీఐకి ఫైన్ విధించారు. అంతేకాకుండా వెంటనే ఒక మాస్కు తెప్పించి ఆయనే స్వయంగా సీఐకి తొడిగారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో పోలీసులు సైతం కరోనా నిబంధనలను పాటించాలని ఎస్పీ సూచించారు. మాస్కు ధరించని వాహనదారులను ఆపి, మాస్క్ లేకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. అదేవిధంగా మాస్కులు ధరించిన వారిని మాత్రమే షాపులలోకి అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు.