కొడుకు చూపు కోసం సైంటిస్టులైన అమ్మానాన్న

కొడుకు చూపు కోసం సైంటిస్టులైన అమ్మానాన్న

బార్సెలోనా (స్పెయిన్): 44 ఏండ్ల వయసులో పుట్టిన కొడుకు పుడితే.. ఆ పసివాడు ఎదుగుతున్న కొద్దీ చూపు మాత్రం సరిగా రాకుంటే ఆ తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఆప్టిక్ నర్వ్ సమస్యతో రెండేండ్ల వయసు వచ్చినా చూపు నార్మల్ కన్నా చాలా తక్కువగా (లో విజన్) ఉండడంతో ఆడుకునేటప్పుడు, నడిచేటప్పుడు ఏదైనా అడ్డం వస్తే పదేపదే పడిపోతుంటే మనసు ఎంత చివుక్కుమంటుందో కదా! ఇలాంటి పరిస్థితినే స్పెయిన్‌లోని బార్సెలోనాకు చెందిన  జౌమ్ పైగ్, కాన్‌స్టాంజా లాసెరో దంపతులకు ఎదురైంది.  అనేక మంది డాక్టర్లను కలిసిన తర్వాత కూడా ప్రయోజనం లేకపోవడంతో తమ బిడ్డతో పాటు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న పిల్లల కష్టాన్ని తీర్చాలని డిసైడ్ అయ్యారు. ఆ ఇద్దరు సైంటిస్టులుగా మారి, మరికొందరు డాక్టర్లు, ఇంజనీర్ల టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ఒక అధునాతన డివైజ్‌ను రూపొందించారు. దానికి సుమారుగా ఏడున్నర కోట్ల రూపాయలు ఖర్చయింది. అయితే ఆ దంపతుల దగ్గర కేవలం రూ.55 లక్షలు మాత్రమే ఉండడంతో మిగిలిన సొమ్మును క్రౌడ్ ఫండింగ్‌ ద్వారా దాతల సహకారంతో సేకరించారు.
బార్సిలోనాలోని ఓ కంపెనీలో జౌమ్ పైగ్ (52) ఎలక్ట్రికల్ ఇంజనీర్‌‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య కాన్‌స్టాంజా లాసెరో ఒక డాక్టర్. ఆ దంపతులకు 2013లో కొడుకు (బైల్) పుట్టాడు. ఆ పిల్లాడికి రెండేళ్ల వయసు వచ్చినా కంటి చూపు సరిగా రాలేదు. దీంతో అడ్డంగా ఉన్న వస్తువులు కనిపించక ఆ పసివాడు ఊరికే పడిపోతుండడంతో అనేక మంది స్పెషలిస్ట్ డాక్టర్లకు చూపించారు. బైల్‌కు లో విజన్ డిజార్డర్ ఉందని డాక్టర్లు తేల్చారు. స్పెక్ట్స్ లేదా ఎటువంటి సర్జరీల ద్వారా కూడా ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదు. కేవలం చదువుకోవడం లాంటి అవసరాలకు మ్యాగ్నిఫైయర్‌‌ సాయంతో కొంత పని నడుస్తుంది. కానీ చిన్న పిల్లల కోసం ఇప్పటి వరకు ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. దీంతో తమ కొడుకు సమస్యను ఎలాగైనా పరిష్కరించాలని రీసెర్చ్‌లోకి దిగారు జౌమ్, లాసెరో. 2017లో తమ కొడుకు పేరుతో బైల్ గ్లాసెస్ అనే కంపెనీని ప్రారంభించి, కొంత మంది డాక్టర్లు, కంప్యూటర్ ఇంజనీర్లతో కలిసి డిజిటల్ డివైజ్ తయారీకి రీసెర్చ్ షురూ చేశారు. ఎట్టకేలకు త్రీడీ ఇమేజింగ్ గ్లాసెస్ డెవలప్ చేశారు. ఇది పెట్టుకుంటే దానికి ఉండే కెమెరా ఎదురుగా ఉండే అడ్డంకులను గుర్తించి, సెన్సర్  సాయంతో పిల్లలను అలర్ట్ చేస్తుంది. అలాగే స్ట్రీట్ సైన్స్ సహా ఇతర వస్తువులను ఈ త్రీడీ గ్లాసెస్ ముందు ఉండే స్రీన్‌పై బాగా జూమ్ చేసి చూపిస్తుంది. అలాగే వాయిస్ సపోర్ట్, నావిగేషన్ సిస్టమ్స్ కూడా దీనిలో ఉన్నట్లు జౌమ్ తెలిపారు. ప్రస్తుతం 8 ఏండ్ల వయసున్న బైల్‌కు ఇది ఎంతగానో సాయపడుతోందని చెప్పారు. ఇలాంటి పిల్లలకు అందుబాటులోకి ఉంచేలా ఈ ఏడాది చివరిలో మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీని రేటు సుమారు రూ.4 లక్షల వరకు ఉంటుందన్నారు. కాగా, ఈ డివైజ్‌ డెమోను బార్సిలోనాలో ఇటీవలే జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆయన ప్రదర్శించారు.