మనిషి, కోతి కలగలిసిన రూపం. పురాణాలకే పరిమితం. ఇలాంటి జీవులు మన కళ్లముందుకు వస్తే ఎలా ఉంటుంది? అద్భుతం కదూ! కానీ ఈ అద్భుతాన్ని కళ్లారా చూసే అదృష్టం జస్ట్ మిస్సయింది. చైనాలో ఒక స్పానిష్ సైంటిస్టు ఈ మనిషి కోతి హైబ్రిడ్పిండాన్ని సృష్టించాడు. కానీ 14 రోజులకే దీనిని నాశనం చేశాడు. లేకపోతే ప్రపంచంలోనే తొలి మనిషికోతి పుట్టుకకు అతడు సృష్టికర్తగా నిలిచేవాడు. ఇంతకూ.. ఆయన దీనిని ఎందుకు? ఎలా? సృష్టించాడు? కొన్ని రోజులకే ఎందుకు నాశనం చేశాడు?
జంతువుల్లో మనిషి అవయవాలు పెంచేందుకే..
గుండె, కాలేయం, మూత్రపిండం, క్లోమం వంటి కీలక అవయవాలు ఫెయిలై ఎంతో మంది మనుషులు చనిపోతున్నారు. పాడైన అవయవాల స్థానంలో కొత్తవాటిని మార్పిడి చేసి, వారిని బతికించే నైపుణ్యం డాక్టర్లకు ఉన్నా, అవయవాలు దొరకడం అంత ఈజీ కాదు. అందుకే.. జంతువుల్లో మానవ అవయవాలను పెంచితే.. అవసరాలు తీరుతాయన్నది సైంటిస్టుల ఆలోచన. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా చైనాలో ప్రొఫెసర్ జువాన్ చేసింది కూడా అలాంటి ఓ ప్రయోగమే. కొన్ని రోజులకే నిలిపివేసినప్పటికీ, ఈ ప్రయోగం సక్సెస్అయినట్టేనని సైంటిస్టులు చెబుతున్నారు. జంతువుల్లో మనిషి అవయవాలను పెంచే దిశగా మరో ముందడుగు పడినట్టేనని భావిస్తున్నారు.
హైబ్రిడ్పిండం సృష్టి ఇలా..
చైనాలోని ఓ ప్రయోగశాలలో స్పానిష్ జంతు శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జువాన్ కార్లోస్ బోల్మోంటే ఆధ్వర్యంలో ఈ ప్రయోగం ఇటీవల జరిగింది. ప్రయోగంలో భాగంగా, మొదటగా కొన్ని కోతుల నుంచి పిండాలను తీసుకున్నారు. వాటికి ప్రయోగశాలలో జన్యు మార్పిడి చేశారు. అంటే ఆ పిండాలలో అవయవాలు ఎదిగేందుకు అవసరమైన అన్ని జీన్స్ నాశనమయ్యేలా మార్పులు చేశారు. . దీంతో ఆ పిండంలో కోతికి సంబంధించిన ఎలాంటి అవయవాలు ఎదిగేందుకు అవకాశం ఉండదు. ఆ తర్వాత ఒక పిండాన్ని తీసుకుని అందులోకి మనిషి నుంచి తీసిన ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్స్ (ఐపీఎస్ సెల్స్)ను పంపించారు. ఐపీఎస్ సెల్స్‌కు శరీరంలోని వివిధ అవయవాలను ఉత్పత్తి చేసే శక్తి ఉంటుంది. ఈ మూలకణాలు విభజన చెందుతూ అన్ని రకాల అవయవాలను ఏర్పర్చే శక్తిని కలిగి ఉంటాయి. అలా మనిషి మూలకణాలతో కూడిన పిండాన్ని మరో కోతి గర్భాశయంలోకి ప్రవేశపెట్టారు.
14 రోజులకే అంతం..
ఆ పిండం.. 14 రోజుల పాటు క్రమంగా ఎదిగింది. దానిని అలాగే పెరగనిచ్చి ఉంటే.. ప్రపంచంలోనే మొదటి మనిషి కోతి ప్రాణం పోసుకునేదేమో! మనిషి అవయవాలతో పుట్టిన ఒక సరికొత్త కోతిగా మన ముందుకు వచ్చేదేమో. కానీ.. 14 రోజులు కాగానే జువాన్ కార్లోస్ బృందం దానిని నాశనం చేసేసింది. ఎందుకంటే.. అంతకుమించి పెరిగితే ఆ పిండంలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏర్పడుతుంది. అలా నరాల వ్యవస్థ ఏర్పడే వరకు హైబ్రిడ్ పిండాలను పెంచడం చైనాలో చట్ట విరుద్ధం కాబట్టి, ఈ ప్రయోగాన్ని అంతటితోనే ఆపేశామని జువాన్టీం వెల్లడించింది.
2017లో హ్యూమన్–పిగ్పిండం సృష్టి
ప్రొఫెసర్ జువాన్ తొలిసారిగా 2017లో ఇలాంటి ప్రయోగం ఒకటి చేశారు. ఆ ప్రయోగంలో ప్రపంచంలోనే తొలి మనిషి-పంది హైబ్రిడ్ పిండాన్ని సృష్టించారు. కానీ, అది పెద్దగా సక్సెస్ కాలేదు. తాజా ప్రయోగం సక్సెస్ అయినందున మరిన్ని ప్రయోగాలకు ఆయన సిద్ధమవుతున్నారు. మనిషి మూలకణాలను ఎలుకలు, పందులు, పక్షుల పిండాల్లోకి ప్రవేశపెట్టి, మనిషి గుండె, కండ్లు, క్లోమం వంటి అవయవాలను పెంచాలని భావిస్తున్నారు.
జపాన్‌లో ‘ఎలుక మనిషి’
మనుషుల మూలకణాలను జంతువుల పిండాల్లోకి పంపించి హైబ్రిడ్ జంతువులను సృష్టించేందుకు జపాన్ ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. దీంతో అక్కడి సైంటిస్టులు ఎలుకమనిషి హైబ్రిడ్ పిండాల సృష్టికి కొత్త ప్రయోగాలకు రెడీ అయిపోయారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీల్లో స్టెమ్‌సెల్ బయాలజిస్ట్ హిరోమిత్సు నకౌషి ఎలుకల్లో మనిషి క్లోమం (పాంక్రియాస్) ఉత్పత్తికి సిద్ధమయ్యారు. ఎలుకల పిండాల్లో క్లోమం మాత్రమే పెరగకుండా ఉండేలా, దానికి సంబంధించిన జీన్‌ను పనిచేయకుండా చేస్తారు. తర్వాత మనిషిలో క్లోమం పెరిగేందుకు కారణమయ్యే ఐపీఎస్సెల్స్ను ఆ పిండంలోకి పంపిస్తారు. ఆ పిండాన్ని ఎలుక గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. దీంతో ఆ ఎలుక నుంచి పుట్టే ఎలుక పిల్లలో మనిషి క్లోమం పెరుగుతుంది. అలా రెండేళ్లు పెంచిన తర్వాత ఆ ఎలుక పిల్ల నుంచి క్లోమం సేకరించి, పరీక్షిస్తారు. ఈ ప్రయోగానికి తుది అనుమతి రావాల్సి ఉంది. అయితే, ఈ మొత్తం ప్రయోగంలో ఎలుక మెదడులో 30% కి మించి మానవ కణాలు ఉండకూడదని జపాన్ ప్రభుత్వం షరతు విధించింది. అలా జరిగితే ఎలుకల మెదడు శక్తిమంతం అవుతుందని చెబుతున్నారు.
