గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దెబ్బతిన్నదన్నారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. జూన్ 16వ తేదీ ఆదివారం హైదరాబాద్ లక్డికపుల్ లో ఎమ్.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు స్పీకర్ చెక్కులను అందజేశారు. 90 శాతం పైగా మార్కులు సాధించిన 100 మంది టెన్త్ , ఇంటర్ , డిగ్రీ విద్యార్థులకు రూ.10 వేల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు.
ఆనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ఈ తోడ్పాటు వల్ల విద్యార్థులు ఉన్నత చదువులో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం.. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందన్నారు.
ప్రభుత్వం తరపున కూడా విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. బడి బాట కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవసరమైన బుక్స్, యూనిఫామ్ లతో పాటు పాఠశాలలో కూడా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.