మంచి గాలి కోసం హరితహారం, మంచినీటి కోసం మిషన్ భగీరథ

మంచి గాలి కోసం హరితహారం, మంచినీటి కోసం మిషన్ భగీరథ

మ‌నిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు త‌న మనుగడ చెట్లతోనే అని, ఆ చెట్ల ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి స్పీకర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా పోచారం మాట్లాడుతూ.. పవిత్ర హృదయంతో చేసే పనిని యజ్ఞం అంటారని, హరితహారం యజ్ఞంలాంటి కార్యక్రమమేన‌ని అన్నారు.అనేక మంది రకరకాల రోగాల బారిన పడడానికి కారణం గాలి, నీరు కలుషితం కావడమేన‌ని, ఆ రోగాల బారి నుంచి ప్రజలను కాపాడేందుకే సీఎం కేసీఆర్… మంచి గాలి కోసం హరితహారం, మంచినీటి కోసం మిషన్ భగీరథ తెచ్చారన్నారు.

మనిషికి జీవితాంతం స్వ‌చ్ఛ‌మైన ప్రాణవాయువుని ఇచ్చే చెట్ల‌ను నాటేందుకు ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి హరితహారం నిర్వహిస్తోందన్నారు స్పీక‌ర్. ఈ ఆర‌వ విడ‌త హ‌రిత‌హారంలో 230 కోట్ల మొక్కలు నాటాలన్నది సీఎం కేసీఆర్ లక్ష్యమ‌ని, ఇప్పటికే ప్రజలు, అధికారుల సహకారంతో 172 కోట్ల మొక్కలు నాటుకున్నామ‌ని చెప్పారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకోవడం అంతే ముఖ్యమ‌న్నారు. మొక్కలు నాటి ఫోటోలు దిగి పోవడం కాదని.. వాటిని కాపాడాల‌ని అన్నారు.

హ‌రిత‌హారం, మిష‌న్ భ‌గీర‌థ లాగే మంచి ఆహారం కోసం రసాయనాలు లేని పంటలు పండించాలన్న లక్ష్యంతో వ్యవసాయ విధానంలో మార్పు తెచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని స్పీక‌ర్ తెలిపారు. గాలి, నీరు, ఆహారం స్వచ్ఛంగా ఉంటే సగం దవాఖానాలు మూతపడుతాయని అన్నారు.

65 ఏళ్లు దాటిన వాళ్లను కరోనా ప‌ట్టుకుంటుందని అందరూ బయపెట్టినా… మంచి కార్యక్రమం కాబట్టే తాను ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ట్టు స్పీక‌ర్ చెప్పారు. చాలా రాష్ట్రాల్లో కరోనా కష్టకాలంలో గుప్పెడు బియ్యం ఇవ్వకపోయినా.. మన రాష్ట్రంలో మనిషికి 12 కిలోల బియ్యం, 15 వందల రూపాయలను ప్ర‌భుత్వం అందించింద‌న్నారు .తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు అంతర్జాతీయ సమాజం నుంచి ప్రశంసలందుకుందని, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రైతు బీమా ఉపయోగపడుతోందని ఈ సంద‌ర్భంగా తెలిపారు‌. పరిపాలించే వ్యక్తి ధర్మాత్ముడైతే ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు సాధ్యమవుతాయని సీఎం కేసీఆర్ ని కొనియాడారు పోచారం . నెంబరు వన్ ముఖ్యమంత్రిగా సీఎంకు దేశంలో గుర్తింపు ఉందని, కానీ కొంతమంది రాజకీయంగా విమర్శలు చేస్తున్నారని విమ‌ర్శించారు.