ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకం..టీఎన్జీవో ప్రతినిధులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

ప్రభుత్వానికి ఉద్యోగులే కీలకం..టీఎన్జీవో ప్రతినిధులతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి ఉద్యోగులు గుండెకాయలాంటి వారని, పథకాలను వారు సమర్థంగా అమలుచేయడం వల్లే రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ చట్టాలు చేసినా, క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేసేది ఉద్యోగులే అని ఆయన అన్నారు. శనివారం తెలంగాణ నాన్‌‌‌‌ గెజిటెడ్‌‌‌‌ అధికారుల సంఘం(టీఎన్జీవో) ప్రతినిధులు మంత్రి  శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌తో కలిసి అసెంబ్లీ కమిటీ హాల్ లో స్పీకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

వీరిలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్‌‌‌‌, మారం జగదీశ్వర్‌‌‌‌తో పాటు, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, ఉద్యోగాలను పణంగా పెట్టి 42 రోజులు సమ్మె చేశారని ఈ సందర్భంగా స్పీకర్ కొనియాడారు. 

కామారెడ్డిలో టీఎన్జీవో భవన నిర్మాణానికి రూ. 30 లక్షలు మంజూరు చేశానని ఈ భవనం త్వరలోనే ప్రారంభం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌ అన్ని వర్గాలకు సమానంగా మేలు చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ను టీఎన్జీవో నేతలు ఘనంగా సన్మానించారు.