బడిలోనే ‘ఆధార్’ బయోమెట్రిక్ : డైరెక్టర్ నవీన్ నికోలస్

బడిలోనే ‘ఆధార్’ బయోమెట్రిక్ : డైరెక్టర్ నవీన్ నికోలస్
  •     స్కూళ్లలో స్పెషల్ మొబైల్ క్యాంపులు
  •     ప్రైవేట్, సర్కారు బడుల పిల్లలందరికీ చాన్స్
  •     ఫిబ్రవరి ఆఖరుకల్లా పూర్తి చేయాలి: డైరెక్టర్ నవీన్ నికోలస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్టూడెంట్ల ఆధార్‌ నమోదు, సవరణల కోసం పేరెంట్స్ మీసేవ, ఆధార్‌ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసే అవస్థలకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెక్ పెట్టారు. పిల్లల ఆధార్ అప్‌డేట్ల కోసం మీసేవ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేకుండా స్కూళ్లలోనే ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. శుక్రవారం ఆయన యూఐడీఏఐ డైరెక్టర్ భారతితో సమావేశమై, బడుల్లో బయోమెట్రిక్ సేవలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్, బయోమెట్రిక్ అప్‌డేట్ల కోసం మొబైల్ క్యాంపులను ఏర్పాటు చేశామన్నారు. 

ఒక ఏరియాలోని స్కూల్ నుంచి మరో స్కూల్‌కు ఈ క్యాంపులు మారుతుంటాయని, లోకల్ అవసరాలను బట్టి వీటిని పంపిస్తామని చెప్పారు. ఈ మొబైల్ సెంటర్లలో సర్కారు బడి పిల్లలే కాదు.. ప్రైవేటు స్కూల్ స్టూడెంట్లు కూడా సేవలు పొందొచ్చని స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో ఈ సెంటర్లు ఎప్పుడు, ఏ స్కూల్‌లో ఉంటాయో తెలుసుకునేందుకు డీఈవోలు, ఎంఈవోలను సంప్రదించాలని సూచించారు.

ఐదేండ్లు నిండితే వేలిముద్రలు మస్ట్

ఐదేండ్ల వయసులోపు ఆధార్ కార్డు తీసుకున్న పిల్లలు.. ఐదేండ్లు నిండాక కచ్చితంగా బయోమెట్రిక్ (వేలిముద్రలు, ఐరిష్) అప్‌డేట్ చేసుకోవాలని నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. 5 నుంచి 15 ఏండ్లు, 15 నుంచి 17 ఏండ్ల వయసున్న స్టూడెంట్లకు మొదటిసారి చేసే బయోమెట్రిక్ అప్‌డేట్ పూర్తిగా ఉచితమని వివరించారు. రెండోసారి అప్‌డేట్ చేయాలంటే మాత్రం రూ.125 ఫీజ కట్టాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక పేరు, అడ్రస్ వంటి డెమోగ్రాఫిక్ మార్పులకు రూ.75 చార్జ్ చేస్తారని పేర్కొన్నారు. 

కాగా, ఎంతమంది స్టూడెంట్లు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందనే వివరాలు ఎంఈవోల దగ్గర, అలాగే.. యూడైస్ ప్లస్ పోర్టల్‌లో స్కూల్ లాగిన్‌లలో అందుబాటులో ఉంచినట్టే వివరించారు. పేరెంట్స్, టీచర్లు వెంటనే ఆ లిస్టులు చెక్ చేసుకుని, 2026.. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, లేదంటే భవిష్యత్తులో ఆధార్ సేవలకు ఇబ్బందులు తప్పవని నవీన్ నికోలస్ హెచ్చరించారు.