ఆడబిడ్డల ఆత్మబంధువు రేవంతన్న

ఆడబిడ్డల ఆత్మబంధువు రేవంతన్న

తెలంగాణలో కాంగ్రెస్‌‌ ప్రభుత్వం రాకతో ఇందిరమ్మ రాజ్యం కొలువుదీరింది. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ పాలన తెస్తామని రేవంత్‌‌రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఇచ్చినవిధంగానే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలలో, పాలనలోనూ మహిళలకు పెద్దపీట వేశారు.  100 రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు.. సంక్షేమ పథకాలన్నింటా సింహభాగం మహిళలకే. తెలంగాణ మహిళలకు పెద్దన్నగా, పేద కుటుంబాల పెన్నిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేనున్నానంటూ.. మహిళల సాధికారత దిశగా కొత్త మార్పునకు నాంది పలికారు. ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు అన్నింటిలోనూ స్త్రీ, పురుషులకు సమానతను భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. దానికనుగుణంగా కొత్త ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగురాలైన మహిళ తుమ్మరి రజనీకి ఉద్యోగమిచ్చే దస్త్రంపై ముఖ్యమంత్రి రెండవ సంతకం చేశారు. అదే వేదికపై నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు.  ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్‌‌ కుట్టే బాధ్యత రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళలకు ప్రభుత్వం అప్పగించింది. ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరిట మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ పని చేస్తాయి. 

ఐదేండ్లలో మహిళలు కోటీశ్వరులు

స్వయం సహాయక సంఘాల మహిళలతో మహాలక్ష్మి స్వశక్తి సదస్సును ఇటీవల పరేడ్‌‌ గ్రౌండ్​లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ సభలో సీఎం రేవంత్​ మాట్లాడుతూ తమ బలం, తమ బలగం, సైన్యం అంతా ఆడబిడ్డలేనన్నారు. 63 లక్షల మంది ఉన్న స్వయం సహాయక మహిళలు కోటికి చేరాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 63 లక్షల మంది స్వయం సహాయక సంఘం సభ్యులకు ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల రుణాలిప్పిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో సున్నా వడ్డీ రుణాల పథకాన్ని సైతం ప్రారంభించింది. గత ప్రభుత్వం డ్వాక్రా మహిళా సంఘాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీలు  చెల్లించకుండా రూ.3,750 కోట్లు బకాయిలు ఎగ్గొట్టింది. ఇకపై అటువంటి పరిస్థితి తలెత్తకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా సంఘాలకు ప్రభుత్వం వడ్డీని చెల్లిస్తుందని తెలిపారు. మహిళా సంఘాల్లోని మహిళల కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్‌‌ పథకాలను, బ్యాంకు లింకేజీ కింద పొందిన రుణాలపై రూ.10 లక్షల ప్రమాద బీమాను స్త్రీనిధి ద్వారా అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో భోజనాల క్యాటరింగ్‌‌ బాధ్యతలను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

పథకాల బాధ్యతలు మహిళలకే

పశుసంవర్ధకశాఖ అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ పథకంలో కొనుగోళ్లు, పంపిణీ బాధ్యతలు కూడా మహిళా సంఘాలకే అప్పగించాలని నిర్దేశించింది. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తారు. సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించడంతోపాటు ఆర్థికంగా బలోపేతమయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తారు. జిల్లా కేంద్రాల్లో మహిళలకు కుట్టుమిషన్లపై శిక్షణ ఇచ్చి ఉపాధికి తోడ్పాటు అందిస్తారు. గోల్కొండ, లేపాక్షి తరహాలో స్వయం సహాయక సంఘాలు తయారుచేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్‌‌ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు శిల్పారామంలో  వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌‌ సదుపాయం కల్పించేందుకు నైట్‌‌ బజార్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఔటర్‌‌ రింగ్‌‌ రోడ్డు వెలుపల ఏర్పాటు చేస్తున్న వ్యాపార సముదాయాల్లో మహిళలకు స్థానం కల్పించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉచిత ప్రయాణం, రూ.500లకే గ్యాస్​

కాంగ్రెస్‌‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో మొదటి హామీగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసిన మహిళల సంఖ్య 26.45 కోట్లకు చేరింది. అదేవిధంగా ఒక్కో సిలిండర్‌‌ను రూ.500కు అందించటంతో కట్టెల పొయ్యితో వంట చేసే బాధ మహిళలకు తప్పిపోయింది. ప్రతి కుటుంబానికి రూ.400 భారం తప్పిపోయింది. ఈ పథకం ద్వారా సుమారుగా 40 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవటానికి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం చేస్తున్న సహాయం మహిళల పేరుమీదే ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.  మహిళా దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి రాష్ట్ర  ప్రభుత్వం వివిధ రంగాలలోని 17మంది మహిళలకు అవార్డులు ప్రకటించింది. 

జీడీపీలో మహిళల భాగస్వామ్యం

ఇండియా జీడీపీలో మహిళల భాగస్వామ్యం 17శాతమేనని ప్రపంచ బ్యాంకు తెలిపింది. భారతీయ స్త్రీలలో 50శాతం దాకా కార్మిక శ్రేణిలో భాగస్వామ్యమైతే 9శాతం వృద్ధిరేటు సాధ్యమవుతుందని అంచనాలున్నాయి. దీనిని అనుసరించి రాష్ట్ర కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అన్నింటిలోనూ మహిళలను భాగస్వామ్యం చేయటానికి నిర్ణయించటం ఆహ్వానించదగ్గ విషయం. 2014లో ఏర్పడిన బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదంటే వారికి మహిళల పట్ల ఎంత చులకన భావన ఉన్నదో అర్థం చేసుకోవాలి. మహిళలనే విచక్షణకు అంతం పలికి పురోగతి పథంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలన్న ఆకాంక్షతో కాంగ్రెస్‌‌  ప్రభుత్వం పనిచేయటం ప్రశంసనీయం.

ట్రావెల్​ సేఫ్​ యాప్​

ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. అన్ని రంగాలలో మహిళలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. చెప్పిన మాటలు మర్చిపోకుండా 3 రోజులకే మహిళల ప్రయాణ భద్రత పర్యవేక్షణకు ప్రత్యేకంగా రూపొందించిన టీ-సేఫ్‌‌ (ట్రావేల్‌‌ సేఫ్‌‌) యాప్‌‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ యాప్‌‌ను తమ ఫోన్లలో ఇన్‌‌స్టాల్‌‌ చేసుకున్న మహిళలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా ఆపదకు గురైతే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని వారిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. 

- బండ్రు శోభారాణి, ఉపాధ్యక్షులు, తెలంగాణ ప్రదేశ్‌‌ కాంగ్రెస్‌‌ కమిటీ