ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేత వైఎస్సార్

ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేత వైఎస్సార్

దేశ రాజకీయాల్లో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించిన అతి కొద్ది మంది నాయకుల్లో డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి(వైఎస్సార్) ఒకరు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజాలు ఓటమి పాలైనా రాజశేఖర్ రెడ్డి విజయం సాధించి ప్రజలకు తన పట్ల ఉన్న విశ్వాసాన్ని, అభిమానాన్ని నిరూపించుకున్నారు. తొలి ప్రధాని నెహ్రు తన దూర దృష్టితో దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసం హరిత విప్లవం, ఐఐటీ లాంటి ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, శాస్త్ర సాంకేతిక రంగాల సంస్థలు, ప్రభుత్వ రంగంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు లాంటి అనేక నిర్ణయాల ద్వారా ఆధునిక భారతావనికి గట్టి పునాదులు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతటి దార్శనికత, చిత్తశుద్ధి, అంకితభావం చూపిన వ్యక్తి వైఎస్సార్. 

ఎన్నోపథకాల రూపకల్పన

రాష్ట్రంలో  సీఎం పదవి చేపట్టిన వెంటనే వైఎస్సార్​అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. తనకంటే ముందు పాలించిన సీఎంల హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏపీ గ్రామీణ పేదలు, రైతాంగం, నిరుద్యోగులు, చేనేత కార్మికులు నిరాశ, నిస్పృహల్లో ఉన్న అంశం గమనించి వారికి న్యాయం జరగాలని పోరాడారు. 2003లో మండు వేసవిలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి తాను చిత్తశుద్ధితో కృషి చేస్తాననే విశ్వాసాన్ని కల్పించారు. అప్పటికి పదేండ్లుగా అధికారం కోల్పోయి నిరాశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చిన నేత వైఎస్సారే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పై మొదటి సంతకం మొదలు రైతాంగ రుణమాఫీ, పేదలకు పింఛన్లు, పక్కా ఇండ్లు, మహిళలకు పావలా వడ్డీపై రుణాలు, ఆరోగ్యశ్రీ, అంబులెన్స్ పథకాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్​మెంట్ పథకం, మైనార్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు, హైదరాబాద్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్డు రూపకల్పన, కొత్త విమానాశ్రయానికి పీవీఆర్ ఎక్స్​ప్రెస్ వే, హైదరాబాద్​తాగునీటి అవసరాలకు కృష్ణా, గోదావరి జలాల తరలింపు లాంటి అనేక పథకాల రూపకల్పన చేసిన దార్శనికుడు ఆయన. రెండోసారి ఎన్నికలకు వెళ్లినప్పుడు కొత్త వాగ్దానాలు ఏమీ చేయకుండా తాను గతంలో చేసిన కార్యక్రమాల ఆధారంగా ప్రజా తీర్పును కోరిన ప్రజాస్వామ్యవాది. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడి అనేక ఎన్నికల వాగ్దానాలు చేసినా కూడా వైఎస్సార్​గత పాలనను బట్టే ప్రజలు రెండోసారి అధికారం ఇచ్చారు. అలా అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆయన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తెలుగు ప్రజలకు తీరని లోటు. ఆ విషాద సమయంలో తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది తమ గుండె ఆగి మరణించిన విషయం తెలిసిందే‌‌‌‌.

శాంతి భద్రతల విషయంలో..

శాంతి భద్రతలు లేకుండా అభివృద్ధి సాధించలేమనే విషయాన్ని గమనించి నక్సలైట్ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించి రాష్ట్రంలో శాంతి నెలకొల్పిన నాయకుడు ఆయన. సాక్షాత్తు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులపై దాడి చేసి ప్రాణాలు హరించే స్థాయిలో ఉన్న శాంతి భద్రతల సమస్యను ఆయన పరిష్కరించగలిగారు. నక్సలైట్లు ఆయుధాలు విడిచిపెట్టి చర్చలకు వచ్చే విధంగా ఒప్పించడం చిత్తశుద్ధి గల, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే నాయకులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పటి పాలకులు తెలంగాణ అంశాన్ని ఎత్తుకోకముందే తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రజల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆకాంక్షను గుర్తించిన నిజమైన ప్రజాస్వామ్యవాది రాజశేఖర్ రెడ్డి.  ప్రతిపక్ష నేతగా, సీఎల్పీ నేతగా తెలంగాణ ప్రజాప్రతినిధులను కేంద్రానికి పంపించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తొలి అడుగులు వేయించారాయన. సొంత పార్టీ వారైనా, ప్రతిపక్షనేతలకైనా వైఎస్సార్​ను కలుసుకోవడం చాలా సులువుగా జరిగేది. ఆయన హయాంలో ప్రజా సంఘాలు స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు చేపట్టేవారు. అనేక అఖిలపక్ష సమావేశాల్లో,  ప్రజా సంఘ సమావేశాల్లో రాజశేఖర్ రెడ్డి ప్రజాస్వామ్య పాలనను తరచూ గుర్తు చేసుకోవడం గమనించదగిన విషయం. వైఎస్సార్ తన ఐదేండ్ల పదవీ కాలంలో చాలా సంక్షేమ పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు సమకూర్చి అమలు చేశారు. కానీ పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణలో 8 సంవత్సరాల తర్వాత కూడా అనేక పథకాలు సరిపడా నిధులు లేక అర్హులకు అందడం లేదు. 

ప్రజలకు అందుబాటులో ఉన్న నేత..

వైఎస్సార్​ ఇప్పటి ముఖ్యమంత్రుల లాగా ఎన్నికల వాగ్దానాలను ఏండ్ల కొద్దీ సాగదీస్తూ.. ప్రజలను మోసం చేసిన నాయకుడు కాదు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన నేత ఆయన. తాము నివాసం ఉంటున్న విలాసవంతమైన అధికార భవనాలకు కిలోమీటర్ల దూరంలో సామాన్యులను నిలిపివేసి, ప్రజలను కనీసం కలుసుకోవటానికి కూడా అవకాశం కల్పించని పాలకులకు వైఎస్సార్​భిన్నంగా ఉండేవారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో తన అధికార నివాస గృహంలో ప్రతిరోజు ఉదయం తనను కలుసుకోవడానికి వచ్చిన సామాన్య ప్రజలందరినీ కలిసేవారు. ప్రజా దర్బార్ లాగ వారి విజ్ఞాపనలను స్వీకరించి చర్యలు తీసుకునేవారు. 

బడుగు బలహీన వర్గాల గొంతుకు..

వైఎస్​రాజశేఖర్​రెడ్డి స్ఫూర్తితో ఆయన కుమార్తె షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు. వైఎస్సార్ పాలన నాటి సంక్షేమం, సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పార్టీ ఏర్పాటై సంవత్సరం పూర్తయింది. రాజశేఖర్ రెడ్డి బాటలోనే షర్మిల తెలంగాణలో 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఇప్పటికే1,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర పూర్తి చేసిన ఆమె.. తెలంగాణ ప్రజలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురుగా ప్రజల కష్టనష్టాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం ఆలోచిస్తూ.. ముందుకు సాగుతున్నారు. పార్టీకి అధ్యక్షురాలుగా ఉంటూ దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తూ.. వారి విశ్వాసాన్ని కోరుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ.. బడుగు ప్రజల గొంతుకగా మారి కొట్లాడుతున్నారు. 

- తూడి దేవేందర్ రెడ్డి
 ప్రధాన కార్యదర్శి 
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ