అరుణాచలానికి ప్రతి జిల్లా నుంచి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేక బస్సులు

అరుణాచలానికి ప్రతి జిల్లా నుంచి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేక బస్సులు

హైదరాబాద్, వెలుగు: తమిళనాడులోని అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల కోసం ప్రతి పౌర్ణమికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది.  గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల  3న గిరి ప్రదక్షిణకు తొలిసారిగా నడిపిన సూపర్ లగ్జరీ బస్సులకు భక్తుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి పౌర్ణమికి రద్దీని బట్టి హైదరాబాద్ తో సహా అన్ని జిల్లా కేంద్రాల నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపేలా ఏర్పాట్లు చేసింది. అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ ప్రారంభమయ్యే 4 గంటల ముందుగానే భక్తులను అక్కడికి చేర్చనుంది. ఈ ఏడాది  ఆగస్టు 30,  సెప్టెంబర్ 28, అక్టోబర్ 28,  నవంబర్ 26, డిసెంబర్ 26న బస్సులు ఉంటాయని ఆర్టీసీ పేర్కొంది.  ప్రతి పౌర్ణమికి 10 రోజుల ముందుగా ఆన్ లైన్ లో బస్సు టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని మంగళవారం ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ తో పాటు జిల్లా కేంద్రాల నుంచి బస్సులు బయలుదేరి, ఆంధ్రప్రదేశ్ కాణిపాకంలోని విఘ్నేశ్వరుని దర్శనానంతరం అరుణాచలానికి చేరుకుంటాయని వెల్లడించింది. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత అదే రోజు సాయంత్రం వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్ కు వెళ్లి, అక్కడ దర్శనానంతరం తిరిగి ఆయా గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించింది. ఈనెల 3న 32 బస్సుల్లో 1,100 మంది అరుణాచలం వెళ్లారని తెలిపింది.