ప్రపంచ స్థాయికి తెలంగాణ ఆహార సంపద : స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్

ప్రపంచ స్థాయికి  తెలంగాణ ఆహార సంపద : స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్
  • హైదరాబాద్​లో తొలి కలినరీ ఎక్స్‌‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్ కార్యక్రమం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆహార సంపదను ప్రపంచస్థాయికి తీసుకెళ్లాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్పెషల్​ చీఫ్​ సెక్రటరీ జయేశ్ రంజన్​ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్​లోని వీ–హబ్​లో ‘కలినరీ ఎక్స్​పీరియెన్షియల్​ టూరిజం యాక్సిలరేటర్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ కలినరీ బ్రాండ్ ఐడెంటిటీ టు ది వరల్డ్’ అనే ప్యానల్ లో చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రత్యేక వంటకాలతో కూడిన టేస్టింగ్ సెషన్ ను కూడా నిర్వహించారు.

 ది కలినరీ లౌంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, నెదర్లాండ్స్ ఎకోసిస్టమ్, రాష్ట్ర టూరిజం డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్, పెట్టుబడిదారులు, చెఫ్స్ తో కలిసి తెలంగాణను ప్రపంచ కలినరీ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తున్నాయి. ఈ సందర్భంగా జయశ్ రంజన్​ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించిన ‘కలినరీ ఎక్స్‌‌పీరియెన్షియల్ టూరిజం యాక్సిలరేటర్’ (టీసీఈటీఏ) దేశంలో తొలి ప్రయత్నమని పేర్కొన్నారు. ఇది సంప్రదాయాన్ని, ఆవిష్కరణ, వ్యాపారాన్ని కలిపి ఆహార పర్యాటకాన్ని ఆర్థిక అవకాశంగా మలిచే మైలురాయిగా నిలుస్తుందన్నారు.

 నెదర్లాండ్స్ ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడ్ చైర్‌‌ పర్సన్ డాక్టర్ ఎడిత్ నార్డ్‌‌మాన్ మాట్లాడుతూ.. కలినరీ టూరిజం అనేది పర్యాటక అనుభవం మాత్రమే కాదని.. ఇది వ్యవసాయం, ఆవిష్కరణ, వ్యాపారం, సంస్కృతి అన్ని కలగలిపిన ఆర్థిక ఇంధనమని పేర్కొన్నారు. ది కలినరీ లౌంజ్ ఫౌండర్ గోపీ బైలుప్పల మాట్లాడుతూ.. హైదరాబాద్ యునెస్కో సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తింపు పొందిన దేశంలో తొలి నగరమని పేర్కొన్నారు. 

టీసీఈటీఏ దేశంలో తొలి కలినరీ టూరిజం యాక్సిలరేటర్‌‌గా, మహిళా, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో టూరిజం ఎండీ  క్రాంతి, బాహుబలి సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ, యునెస్కో ఎంజీఐఈపీ బిరాద్ రాజారాం, ఇండికా స్థాపకుడు వడ్లమాని హరి, ఎన్​ఐసీఈఆర్​జీ సహ వ్యవస్థాపకుడు సంజయ్ ఆనందరాం, వీ-హబ్​ సీఈవో సీత పాల్గొన్నారు.