- 3,053 కోట్లు కేటాయింపు, ట్రిపుల్ ఆర్కు 1,525 కోట్లు..
- ఆర్అండ్ బీ శాఖకు ఈసారి రూ.8,298 కోట్ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఈసారి రోడ్లు భవనాల శాఖకు రూ.8,298 కోట్ల భారీ నిధులు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే ఏకంగా రూ.2,391 కోట్లను పెంచింది. ప్రధానంగా హ్యామ్ రోడ్ల కోసం రూ.3,053 కోట్లు, ట్రిపుల్ ఆర్కు రూ.1,525 కోట్లు కేటాయించింది. ఈసారి అత్యధికంగా స్టేట్ హైవే ఈఎన్సీ విభాగానికే పెద్దమొత్తంలో నిధులు ఇవ్వగా, స్టేట్ నేషనల్ హైవే విభాగానికి పైసా కూడా ఇవ్వలేదు.
ఇకపోతే బిల్డింగ్స్ విభాగానికి గతేడాది లాగే సేమ్ టూ సేమ్ నిధులు కేటాయించారు. ప్రభుత్వం ఈసారి హ్యామ్ రోడ్ల నిర్మాణాన్ని చాలెంజింగ్‌గా తీసుకుంది. 40 శాతం నిధులు వర్క్ పీరియడ్‌లో ఇస్తూ మిగతా 60 శాతం నిధులను బ్యాంకు గ్యారంటీ ఆధారంగా చెల్లిస్తామని ప్రకటించింది. ఇప్పటికే టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావట్లేదు.
దీంతో కాంట్రాక్టర్లకు ఆర్బీఐ గ్యారంటీ ఇప్పించేందుకు సిద్ధమైంది. తాజా బడ్జెట్లో హ్యామ్ రోడ్ల కోసం భారీగా నిధులు కేటాయించింది. తద్వారా కాంట్రాక్టర్లలో విశ్వాసం నింపే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది మొదలుకానున్న ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం రూ.1,525 కోట్లు కేటాయించడం గమనార్హం.
స్టేట్ రోడ్స్ ఈఎన్సీ విభాగానికే భారీగా నిధులు..
రాష్ట్ర బడ్జెట్ వివరాలను పరిశీలిస్తే ఆర్అండ్బీ శాఖకు సంబంధించిన నిధుల్లో రూ.3,455 కోట్లను కేవలం ఒక్క స్టేట్ రోడ్స్ ఈఎన్సీ విభాగానికే కేటాయించారు. గతేడాది ఈ విభాగానికి కేవలం రూ.818 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ మంత్రిత్వ శాఖలో మొత్తం 7 విభాగాలు ఉండగా రూరల్ రోడ్స్ విభాగానికి కూడా సుమారు రూ.292 కోట్లు తగ్గించారు. బిల్డింగ్స్ విభాగానికి గతంలో మాదిరిగానే రూ.1,768 కోట్లు కేటాయించారు.
ఆర్అండ్ బీ శాఖ తరఫున వివిధ స్కీమ్‌ల కోసం కేటాయించిన నిధులు (రూ.కోట్లలో)
- హ్యామ్ రోడ్స్ 3,053
- ట్రిపుల్ ఆర్ రోడ్డు 1,525
- రోడ్ల మెయింటనెన్స్ 828
- కొత్త రోడ్ల నిర్మాణం 450
- సీఆర్ఐఎఫ్ స్కీమ్ 243
- ఆర్వోబీ, ఆర్యూబీ 216
- సెక్రటరియేట్లో బిల్డింగ్ నిర్మాణాలకు 100
- మొత్తం 6,415 కోట్లు
