
- రోజూ ఉదయం, సాయంత్రం ఒక్కో గంట చొప్పున క్లాస్‌ల నిర్వహణ
- వెనుకబడిన స్టూడెంట్లను సానబెట్టేందుకు సబ్జెక్టు టీచర్ల కృషి
- స్టూడెంట్స్‌కు స్నాక్స్ అందించేందుకు సన్నాహాలు
భద్రాచలం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ పై కలెక్టర్లు, విద్యాధికారుల చొరవతో ఇప్పటి నుంచే దృష్టిసారించారు. ఎప్పుడూ జనవరి నెలలో నిర్వహించే స్పెషల్ క్లాసులను ఈసారి ముందుగానే షురూ చేశారు. గత రెండేండ్లలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మేల్కొన్న విద్యాధికారులు ఉదయం, సాయంత్రం స్టూడెంట్లకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల ముందే అన్ని సబ్జెక్టులపై బోధన జరుగుతోంది.
గతంలో పరిస్థితి ఇదీ.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2024 విద్యా సంవత్సరాలలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎక్కువ మంది గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడ్డారు. ఖమ్మం జిల్లాలో తెలుగులో 98.29, హిందీలో 99.68, ఇంగ్లీషులో 98.55, సోషల్‌లో 98.95 శాతం స్టూడెంట్లు పాసైతే గణితంలో 94.50, సైన్స్ లో 92.47 శాతం మంది మాత్రమే పాసయ్యారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో తెలుగులో 96.28, హిందీలో 99.27, ఇంగ్లీషులో 97.86, సోషల్‌లో 93.26శాతం మంది పాస్‌కాగా సైన్స్ లో 90.97, గణితంలో 85.87 శాతం మంది మాత్రమే పాసయ్యారు. 2025లో కూడా ఖమ్మం జిల్లాలో సైన్స్ లో 3.80, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3.95,గణితంలో 5.88శాతం స్టూడెంట్లు ఫెయిలయ్యారు.
ఈసారి మార్పు కోసం..
ఈ సారి ఖమ్మం జిల్లాలో 227 హైస్కూళ్లలో 12,310 మంది, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 124 హైస్కూళ్లలో 9,702 మంది స్టూడెంట్లు టెన్త్ చదువుతున్నారు. అన్ని హైస్కూళ్లలో టెన్త్ రిజల్ట్స్ మెరుగ్గా రావాలనే ఉద్దేశ్యంతో ఇరు జిల్లాల్లో విద్యాశాఖాధికారులు సెప్టెంబరు నెల నుంచే స్పెషల్ క్లాసులు ప్రారంభించారు. ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట రోజూ టెన్త్ స్టూడెంట్లకు అన్ని సబ్జెక్టులు చెబుతున్నారు. దీనివల్ల వెనుకబడిన స్టూడెంట్లను సానబెట్టేందుకు సబ్జెక్టు టీచర్లు కృషి చేస్తున్నారు.
స్నాక్స్ అందించేందుకు సన్నాహాలు
టెన్త్ పిల్లలకు స్నాక్స్ అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ ఎన్జీవోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘హరేరామ’ ఎన్జీవో సహకారంతో ఉదయం, సాయంత్రం పిల్లలకు టీ, స్నాక్స్ ఇప్పించాలని ప్రయత్నిస్తున్నారు. అన్ని హైస్కూళ్లలో హెడ్మాస్టర్లు స్టూడెంట్లు ఈ క్లాసులకు మిస్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా విద్యాశాఖ ద్వారా మ్యాథ్స్, సైన్స్ టీచర్లకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. బిస్కెట్లు, రాగి జావ, టీ లాంటి అల్పాహారం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని మండలాల్లో ఎంఈవోలు ఈ స్పెషల్ క్లాసులను పర్యవేక్షిస్తున్నారు.
ఉదయం, సాయంత్రం క్లాస్లు
టెన్త్ స్టూడెంట్లకు ఉదయం, సాయంత్రం క్లాస్లు నిర్వహిస్తున్నాం. సబ్జెక్టుల్లో ఏమైనా డౌట్స్ ఉంటే పిల్లలు అడిగి తెలుసుకుంటున్నారు. గంట సేపు జరిగే ఈ క్లాసుల్లో చదువులో వెనుకబడిన స్టూడెంట్లను గుర్తించి వారిపై దృష్టి పెడుతున్నాం. ఈసారి ముందుగానే ఈ క్లాసులు నిర్వహణ వల్ల స్టూడెంట్లకు మేలు జరుగుతుంది. - రమా, ఎంఈవో, భద్రాచలం