​పాలనా దక్షతను చాటిన వందరోజుల పాలన

​పాలనా దక్షతను చాటిన  వందరోజుల పాలన

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుంది. ఏర్పడిన వెంటనే..కూలి పోతుందనే కారు కూతలు కూసిన  వారి గురించి  కొత్తగా చెప్పాల్సిన పని లేదు.  ఓ వైపు ఎల్బీ స్టేడియంలో  సీఎంగా రేవంత్ రెడ్డి  ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే  ప్రగతి భవన్ ముందున్న ఉక్కు కంచెలు బద్దలయ్యాయి. ఆ నిర్ణయంతోనే స్వయం పాలనకు అసలు సిసలు నిర్వచనం  దొరికిందని యావత్ తెలంగాణ సమాజం గుండెల మీద చేయి వేసుకుని పిడికిలి బిగించి జై రేవంతన్నా అని నినదించింది.  ఈ విషయాలన్నీ  ప్రపంచానికి    తెలుసు.    మాటిచ్చినట్లుగానే          హామీలు      అమలు  చేస్తున్నారు. నాడు సోనియాగాంధీ తన పార్టీ భవిష్యత్తును కూడా పట్టించుకోకుండా ఇచ్చినమాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల కోసం ఓ అడుగు ముందుకే తప్ప  వెనక్కు వేసేది లేదని చెప్పారు. ఆమె  అడుగుజాడల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి కూడా అంతే.  ఇదంతా  ఈ వంద రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు అనుభవంలోకి వచ్చిన విషయమే.

ప్రజల ముందు శ్వేతపత్రాలు 

 కాంగ్రెస్  ప్రభుత్వాన్ని ప్రజలు  ఎన్నుకున్న తర్వాత గత పాలకుల  వైఫల్యాలను, నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టినట్లు  ప్రజల ముందు శ్వేతపత్రాలను ఈ ప్రభుత్వం ప్రజల ముందుంచింది. అంతేకాదు ఎలాంటి దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్లుగా  రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి సమగ్ర సమాచారాన్ని తెలంగాణ సమాజం ముందు పెట్టిందీ ప్రజా ప్రభుత్వం.  గత ప్రభుత్వానికి, నేటి ప్రభుత్వానికి ఉన్న మౌలికమైన తేడాను కేవలం  అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే నిరూపించింది.  డిసెంబర్ తొమ్మిదో తేదీన సోనియాగాంధీ   పుట్టిన రోజు. అది తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన రోజు కూడా. అదే రోజున తెలంగాణ ఆడ  బిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.  

అవినీతిపై దర్యాప్తులు

గత ప్రభుత్వం చేసిన పలు నిర్వాకాల గురించిన నివేదికలను  అసెంబ్లీగా సాక్షిగా ప్రజల ముందు పెట్టింది.  రీ ఇంజనీరింగ్, రీ డీజైన్ల అసలు  రూపాన్ని బట్టబయలు  చేసింది. అంతే కాదు అవుటర్ రింగ్  రోడ్డు టెండర్ల గోల్​మాల్​​ వ్యవహారాన్ని బయటకు తీసింది. ప్రభుత్వ ఖజానాకు  రావాల్సిన  నిధులు ఎట్లా పక్కకు మళ్లాయో చూపించింది.  అంతేకాదు  విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తికమక లెక్కల చిక్కు ముడులు విప్పేసింది.  మరింత పారదర్శకత కోసం  కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంట్  కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మణాలకు సంబంధించిన  కుంభకోణాలపై   జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. ఇదంతా కేవలం  మూడు నెలల కాలంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ముందు ఉంచిన వాస్తవాలు. 

ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లు

కేవలం గత ప్రభుత్వపు నిర్ణయాలను తప్పుబడుతూ కూర్చోలేదు.  నిరుద్యోగుల ఆశలు  నెరవేర్చేలా ఏడాదిలోనే  రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ  చేస్తామని చెప్పినట్లుగానే  వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది.  నీళ్లు. నిధులు. నియామకాలు అనే నాటి తెలంగాణ ఉద్యమ ట్యాగ్  లైన్​కు  సార్ధకత చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నది. గ్రూప్ వన్ నుంచి మొదలు టీచర్ల ఉద్యోగాల భర్తీ వరకు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆర్టీసీలోని ఖాళీలను భర్తీ చేస్తున్నది. సమాజంలోని అత్యంత వెనుకబడిన,  నిమ్న కులాల్లోని ఉప కులాల వారి కోసం కూడా ప్రత్యేక కార్పొ రేషన్లు  ఏర్పాటు చేసి తమ పాలనకున్న సామాజిక సమానత్వపు కోణాన్ని రుజువు చేసుకున్నదీ ప్రభుత్వం. 

వేగంగా హామీల అమలు

ఈ ప్రభుత్వం ఏర్పడగానే కొత్త బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి వచ్చింది.  ఈ రాష్ట్ర ప్రజల ముందు వాస్తవ ఆర్థిక స్థితిని చూపిస్తూ  గత ప్రభుత్వపు డాంబీకపు  లెక్కలను పక్కన పెడుతూ  వాస్తవ ఆర్థిక స్థితిగతుల ఆధారంగా బడ్జెట్​నుప్రవేశపెట్టింది. ఆరు గ్యారెంటీల అమలు విషయంలోనూ, లబ్ధిదారుల ఎంపిక విషయంలోనూ  ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది.  ఉచిత విద్యుత్,  రాయితీ  సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ  కూడా పేదల కుటుంబాల జీవితాలకు అతి పెద్ద ఆలంబన. ఓ  సోదరునిగా తాను హామీనిస్తున్నానంటూ లక్షలాది  మంది మహిళలకు భరోసానిచ్చారు రేవంత్ రెడ్డి. 

స్వయాన సీఎం కరువు జిల్లా వాసి 

వ్యవసాయ రంగం నుంచి వచ్చిన కుటుంబం కావడం మాత్రమే కాదు, వెనుకబడిన కరువు జిల్లా  ఉమ్మడి పాలమూరు జిల్లా నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా సీఎంకు పేద ప్రజల జీవితాల గురించి బాగా తెలుసు. 
వారి జీవితాలు ఎట్లా బాగుపడ్తాయో కూడా తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఓ అడుగు ముందే ఉన్నారు. తాను పుట్టిన పెరిగిన జిల్లా కరువుకు పెట్టింది పేరు కావొచ్చు. ఆకలి కేకలకు నెలవు కావొచ్చు.  ఆ జిల్లానే ఆత్మగౌరవానికీ పెట్టింది పేరు. అందుకే ఆ జిల్లాకు చెందిన బిడ్డగా  యావత్ తెలంగాణ  ప్రజల ఆత్మగౌరవాన్ని  ఈ ప్రపంచానికి చాటేలా తనదైన పాలన సాగిస్తున్నారు. దానికి ఈ వంద రోజులే  ఓ  ఉదాహరణ.

పాలనాదక్షుడికి ముగింపు ఉండదు

‘ దక్షిణాఫ్రికా  మాజీ క్రికెటర్  ఏబీ డివిలియర్స్  ధోని గురించి ఓ మాట చెప్పాడు. ధోని డీజిల్ ఇంజిన్ లాంటోడు.. ముగింపు ఉండదు’ అని.  ఆయన  అద్భుతమైన కెప్టెన్ అని డివిలియర్స్ చెప్పిన మాట వాస్తవం.  
 రేవంత్ రెడ్డి కూడా రాజకీయ  జీవితంలో చాలా ఎత్తు పల్లాలు చూశారు. జిల్లా పరిషత్ మెంబర్  నుంచి ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా నేడు  రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగారు.  తెలంగాణ రాజకీయాల్లోనే కాదు యావత్ భారత  రాజకీయాల్లోనూ రేవంత్ రెడ్డి  డీజిల్ ఇంజిన్ లాంటోడే. ఆయన రాజకీయ జీవితానికి ముగింపు ఉండదు. ఆర్నెల్లు.. ఏడాది.. అంటూ ఆయన  ముఖ్యమంత్రి  పదవి గురించి  కొందరు చేస్తున్న వ్యాఖ్యలకు  క్రికెటర్ డివిలియర్స్ మాటలు చెంపపెట్టు లాంటివని ప్రత్యేకంగా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు.

- బోదనపల్లి. వేణుగోపాల్ రెడ్డి టీ సాట్ సీఈఓ