
హైదరాబాద్, వెలుగు: గొర్రెల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తేనుంది. అందుకు టీసీఎస్‌తో అధికారులు చర్చలు జరుపుతున్నారు. సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తే గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలను అరికట్టవచ్చని పశు సంవర్ధక శాఖ ఎండీ రాంచందర్ తెలిపారు. జిల్లాల వారీగా ఉన్న లబ్ధిదారుల సంఖ్య, చెల్లించిన డీడీలు, పంపిణీకి అవసరమయ్యే గొర్రెలు, తదితర వివరాలు అందుబాటులోకి వస్తాయన్నారు. అంతేగాక.. ఏ జిల్లాకు ఎన్ని నిధులు విడుదలయ్యాయి, అయిన ఖర్చు, పంపిణీ చేసిన యూనిట్లు వంటి వివరాలు పక్కగా నమోదవుతాయని వివరించారు. గొర్రెల కొనుగోలు మొదలుకుని లబ్ధిదారునికి చేరేవరకు ప్రతిది సాఫ్ట్‌వేర్ ద్వారా ట్రాకింగ్ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.