కేంద్రం, ఏపీలో కాంగ్రెస్​ వస్తే ప్రత్యేక హోదా ఇస్తం : మంత్రి పొన్నం ప్రభాకర్

కేంద్రం, ఏపీలో కాంగ్రెస్​ వస్తే  ప్రత్యేక హోదా ఇస్తం :  మంత్రి పొన్నం ప్రభాకర్

         కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి దర్శనం 

హైదరాబాద్, వెలుగు :  కేంద్రం, ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విభజన హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో కొత్త ఓట్లు వస్తాయా.. వైసీపీ, టీడీపీ ఓట్లు చీలుతాయా అన్నది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అభివృద్ధి జరగలేదన్నారు. మంగళవారం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కోరిన కోర్కెలను శ్రీవారు తీర్చారన్నారు‌‌. తెలంగాణ వచ్చిన పదేండ్ల తర్వాత ప్రజాపాలన ఏర్పడిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా స్వామి చల్లని చూపు ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు.

హుస్నాబాద్‌‌లో టీటీడీ గుడి కట్టండి

తన నియోజకవర్గం హుస్నాబాద్‌‌లో టీటీడీ తరఫున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. అందుకోసం రూ.25 కోట్లు కేటాయించాలన్నారు. దర్శనం అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిని పొన్నం కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నంను టీటీడీ చైర్మన్ సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. టీటీడీ గుడి కడితే అందుకు సరిపడా స్థలాన్ని కూడా సమకూరుస్తామని పేర్కొన్నారు.