- వీకెండ్ లో లేక్ క్లీనప్ డ్రైవ్స్ నిర్వహణ
- మూడేండ్లుగా చెత్త, ప్లాస్టిక్ సేకరణలో ఎన్జీవో సంస్థ
- ఎర్త్ నీడ్స్ యూ పేరుతో విశ్వ సస్టైనబుల్’ కృషి
హైదరాబాద్, వెలుగు: సిటీ శివారులోని అమీన్ పూర్, నల్లగండ్ల, ఖాజాగూడ, గండి లేక్ వంటి చెరువులు వీకెండ్ టూరిస్ట్ స్పాట్స్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఫంక్షన్లు, పార్టీలు చేసుకుంటుంటారు. స్థానికులు కూడా ఏదో ఒక చెత్తను చెరువుల్లో వేస్తుంటారు. ప్లాస్టిక్ బాటిల్స్, పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, పాత బట్టలు.. ఇలా రకరకాల చెత్త చెరువుల వద్ద కనిపిస్తుంటుంది. ముఖ్యంగా ప్లాస్టిక్ తో చెరువులు కలుషితం అవుతాయి. దీంతో చేపలు, పక్షులు, పలు రకాల జంతువుల మనుగడకు ముప్పుగా మారుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని సిటీకి చెందిన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్లాస్టిక్ ఫ్రీ లేక్స్ కోసం వీకెండ్ లో లేక్ క్లీనప్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. ఎర్త్ నీడ్స్ యూ పేరుతో ప్రతి సండే ఫౌండేషన్ వలంటీర్లు సిటీ శివారులోని చెరువుల వద్ద ఉదయం 6 గంటల నుంచి క్లీనప్ డ్రైవ్స్ చేపడతారు. స్థానికులకు, టూరిస్ట్ లకు అవేర్ నెస్ క్లాసులు కూడా చెబుతారు. ఇలా పర్యావరణ పరిరక్షణకు తమ వంతుగా విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ కృషి చేస్తోంది.
501కు పైగా క్లీనప్ డ్రైవ్స్
సిటీకి చెందిన అర్కిటెక్చర్ వినయ్ మంచాల ప్రకృతి ప్రేమికుడు కూడా. తన వంతుగా చెరువుల వద్ద చెత్తను, ప్లాస్టిక్ ను క్లీన్ చేసేందుకు నిర్ణయించుకుని.. మరో నలుగురు ఫ్రెండ్స్ తో కలిసి 2021లో విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ స్థాపించారు. సిటీ శివారులోని చెరువుల వద్ద క్లీనప్ డ్రైవ్స్ మొదలు పెట్టారు. ఫౌండేషన్ లో ప్రస్తుతం 500 పైగా వలంటీర్లు ఉండగా.. స్కూల్ పిల్లల నుంచి ఐటీ ఎంప్లాయీస్ లేక్ క్లీనింగ్ డ్రైవ్స్ లో పాల్గొంటారు. మూడున్నరేండ్లలో సిటీతో పాటు విజయవాడ, వైజాగ్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లోని చెరువుల్లో 500లకు పైగా క్లీనప్ డ్రైవ్స్ చేశారు. ఇందులో 200 డ్రైవ్స్ అమీన్ పూర్ లేక్ వద్దనే చేశారు. అక్కడ 12 టన్నుల చెత్తను తొలగించారు. మొత్తంగా 25 టన్నులకు పైగా చెత్తను సేకరించారు. అందులో 35 శాతం చెత్తను రీసైక్లింగ్ కు చేశారు. అంతేకాకుండా అవేర్ నెస్ క్యాంపులను కూడా నిర్వహించారు.
మమ్మల్ని చూసి మారితే చాలు
ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను వాడకుండా ప్రతిజ్ఞ చేయాలి. మనం తీసుకునే చిన్న నిర్ణయాలే పెద్ద మార్పును తీసుకొస్తాయి. లైఫ్ స్టైట్ లో ప్లాస్టిక్ వాడకం తగ్గించుకునేలా చూసుకోవాలి. చెరువుల వద్ద క్లీనింగ్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నా.. కానీ.. మళ్లీ చెత్త, ప్లాస్టిక్ పడేస్తుంటారు. కొన్ని లేక్స్ వద్ద డస్ట్ బిన్స్ ఉన్నా వాడరు. దీంతో అవేర్ నెస్ కల్పిస్తున్నాం. మేం క్లీన్ చేసేటప్పుడు చాలా మంది మున్సిపల్ సిబ్బంది అనుకుంటారు. మరికొందరు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. అలా అడిగినవారైనా మమ్మల్ని చూసి మారకపోతారా అనేది మా చిన్న ఆశ.
వినయ్ మంచాల, విశ్వ సస్టైనబుల్ ఫౌండర్
