డయాబెటిస్ పై నివేదిక, పరిష్కారాలు...క్వాలిటీ ఫుడ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

డయాబెటిస్ పై  నివేదిక, పరిష్కారాలు...క్వాలిటీ ఫుడ్ కు   ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రపంచ మధుమేహ రాజధాని (డయాబెటిస్‌‌‌‌ క్యాపిటల్ ఆఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌)‌‌‌‌గా భారత్‌‌‌‌ అవతరిస్తున్నది. భారతీయులు నిత్యం తీసుకునే భోజనంలో అధిక కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు), అతి తక్కువ ప్రోటీన్లు (మాంసకృత్తులు) ఉండడంతో  మధుమేహం (డయాబెటిస్‌‌‌‌), స్థూలకాయం (ఒబెసిటీ) బారిన పడుతున్నట్లు  ‘ఐసిఎంఆర్‌‌‌‌ -ఇండియా డయాబెటిస్‌‌‌‌’ తాజా నివేదిక గురించి తెలుసుకుందాం. .! 

నేడు  దేశవ్యాప్తంగా 101 మిలియన్ల ప్రజలు మధుమేహ రుగ్మతతో, 136 మిలియన్ల  ప్రజలు మధుమేహానికి దగ్గరగా (ప్రీ డయాబెటిస్‌‌‌‌) ఉన్నట్లు తేల్చారు.  భారతీయుల్లో 11.4 శాతం ప్రజలు మధుమేహం గుప్పిట్లో, 15 శాతం మధుమేహానికి దగ్గరగా, 28.6 శాతం మంది స్థూలకాయ రుగ్మతలతో బాధపడడంతోపాటు  బీపీ,  జీవనశైలి రుగ్మతల బారిన పడుతున్నట్లు స్పష్టమైంది. 

భారతీయుల్లో 62శాతం మంది  పూర్‌‌‌‌- క్వాలిటీ (నాణ్యత కొరవడిన) కార్బోహైడ్రేట్‌‌‌‌ ఆహారాలను అధికంగా తీసుకుంటూ అతి తక్కువ మాంసకృత్తులను తీసుకోవడంతో రానున్న రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎదుర్కోనున్నారని నివేదిక హెచ్చరిచ్చింది.

పిండి పదార్థాలు ఎక్కువ,మాంసకృత్తులు తక్కువ 

భారతీయుల  భోజనంలో షుగర్స్‌‌‌‌,  సంతృప్త  కొవ్వులు, అత్యల్ప ప్రోటీన్లు ఉంటున్నాయని తెలుపుతూ, దీని ఫలితంగా  ప్రజలు  పలు అసాంక్రమిక వ్యాధుల (నాన్‌‌‌‌- కమ్యూనికెబుల్‌‌‌‌ డిసీజెస్‌‌‌‌) వలయంలో చిక్కుకోనున్నట్లు నివేదిక వివరిస్తున్నది.  

మనం నిత్యం తీసుకునే భోజనంలో  బియ్యం,  గోధుమలు,  షుగర్స్‌‌‌‌,  కొవ్వులు, ఉప్పు అధికంగా ఉంటున్నదని, పప్పులు లేదా ప్రోటీన్లు అతి తక్కువగా ఉంటున్నాయని నిపుణులు గుర్తించారు. కార్బోహైడ్రేట్ల పరిమాణం పెరగడంతో మరో 30 శాతం మందికి  టైప్‌‌‌‌-2 మధుమేహం, 20 శాతం వరకు ప్రీ -డయాబెటిస్‌‌‌‌ బారిన, 22 శాతం స్థూలకాయ ఊబిలో పడవచ్చని అంచనా వేశారు. 

మన భోజనంలో ఏమి ఉండాలంటే..

మనం  తీసుకుంటున్న భోజనంలో  కార్బోహైడ్రేట్లను చాలావరకు తగ్గించడంతోపాటు బియ్యం లేదా గోధుమల స్థానంలో ప్రోటీన్లు అధికంగా ఉన్న పప్పులు, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, చికెన్‌‌‌‌ లాంటివి పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెడ్‌‌‌‌ మీట్‌‌‌‌ (మాంసం)ను పూర్తిగా తగ్గించాలి. సాధారణంగా 15 నుంచి 20 శాతం వరకు తీసుకోవలసిన ప్రోటీన్లకు బదులుగా భారతీయులు కేవలం 12 శాతం వరకు మాత్రమే ప్రోటీన్‌‌‌‌ ఆహార పదార్థాలను తీసుకుంటున్నారని తేలింది. 

పప్పులు, చిక్కుళ్లు,  గుడ్లు,  పాల ఉత్పత్తులు, చేపల్లో  పీచు పదార్థాలు, సూక్ష్మపోషకాలు, తక్కువ గ్లైసెమిక్‌‌‌‌ సూచికలు ఉండడంతో జీవనశైలి రుగ్మతలు తగ్గుతాయని సూచిస్తున్నారు. ప్రతి రోజు అధికసార్లు తినడం మంచిది కాదని,  రెండుసార్లు పోషకాహారం తీసుకుంటే సరిపోతుందని తెలుపుతున్నారు.  పప్పు, చిక్కుళ్లను పెంచుకోవాలి. తెల్లటి ఆహారాన్ని  (బియ్యం, తెల్లటి పిండి, గోధుమ పిండి) తగ్గించుకుంటూ మన భోజన ప్లేట్‌‌‌‌లో   (ఆకు కూరలు, క్యారెట్లు, బీట్‌‌‌‌రూట్‌‌‌‌, కూరగాయలు, పప్పు, చిక్కుళ్లు, చేపలు, పాలు/పెరుగు లాంటివి)  కలిగిన ఆహార పదార్థాలు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. 

క్వాలిటీ ఫుడ్​కు  ప్రాధాన్యతివ్వాలి

మనం తీసుకునే భోజనం  క్వాంటిటీ  కంటే  క్వాలిటీ ఫుడ్‌‌‌‌గా ఉండేవిధంగా చూసుకోవాలి.  కార్బోహైడ్రేట్లను తగ్గించడం,  ప్రోటీన్లను పెంచడం నేటి నుంచే ప్రారంభిద్దాం. ఉప్పు,  చక్కెర,  కొవ్వులను తగ్గిద్దాం. వివిధ రకాల సీజనల్‌‌‌‌ పండ్లను తినడం అలవాటు చేసుకుందాం.  మన  భోజనంలో  తెల్లటి  ఆహార పదార్థాలను తక్కువగా,  ఇంద్రధనుస్సు రంగులు పళ్లెంలో ఉండేవిధంగా చూసుకుందాం. 

 బీపీ,  షుగర్‌‌‌‌,  ఒబెసిటీలకు దూరంగా జరుగుదాం. ఆరోగ్యం కోసం  సమతుల పోషకాహారాన్ని తీసుకోవడాన్ని అలవాటుగా చేసుకుందాం.  మనం తీసుకునే భోజనమే మన ఆరోగ్యాన్ని శాసిస్తుంది.  అదుపు తప్పితే  ఆధునిక జీవనశైలి రుగ్మతల విష వలయంలోకి నెట్టేస్తుంది. అన్నం తక్కువ కూరలు ఎక్కువ తిందాం,  మన  ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. 

- బుర్ర మధుసూదన్ రెడ్డి–