
నేరాలు .. శిక్షలు.. దొంగతనాలు.. నమ్మకద్రోహం.. హత్యలు ఇలాంటి ఘటనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రాజ్యం కోసం తమ్ముడిని .. అన్న చంపడం.. అఘాయిత్యాలు వంటి రాజుల కాలంలో కూడా జరిగాయి. అయితే అప్పుడున్న మహా మంత్రులు అలాంటి వారిని ముందే పసిగట్టేవారు. ఒకానొకప్పుడు ఉజ్జయినీ నగరంలో జరిగిన తార్కాణం నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. అయితే మహా మంత్రులకు ఉన్న తెలివి తేటలు పరిఙ్ఞానంతో నేరస్థులను గుర్తించేవారు. కౌశాంబీ దేశాన్ని పరిపాలించే సామంత రాజును అతని తమ్ముడు మామిడి పండులో పామును పెట్టి హత్య చేయించిన ఉదంతాన్ని మహామంత్రి నరవాహన బొట్టు ఎలా గుర్తించాడో తెలుసుకుందాం. . .
ఉజ్జయినీ నగరం, రాచవీధిలో ఉన్న మహామంత్రి నరవాహన భట్టు భవనంలోని సభామందిరంలో ఇరవైమంది వ్యక్తులు భయంగా మహామంత్రి వైపు చూస్తున్నారు. మహామంత్రి వాళ్ళ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు. మీలో ఎవరు దొంగతనం చేశారో చెప్పండి? ఆ ఇరవైమంది వ్యక్తులూ మౌనం వహించారు. దాదాపు రెండు గంటల నుంచి వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు నరవాహన భట్టు. తాము నేరస్తులం కాదనీ, తమకూ, మహారాజుగారి మందిరంలో దొంగిలింపబడిన అత్యంత ఖరీదైన వజ్రాల హారానికీ ఏమాత్రం సంబంధం లేదనీ వాళ్ళు చెబుతున్నారు.
కౌశాంబీ దేశాన్ని పరిపాలించే సామంత రాజు మలయవర్మ.. వెలకట్టలేని ఆ వజ్రాల హారాన్ని ఉజ్జయినీ మహారాజు చండమహాసేనుడికి బహుమతిగా ఇచ్చాడు. విలువైన ఆ వజ్రాల హారాన్ని ఎవరో దొంగి లించారు. అనుమానితులైన ఇరవైమంది వ్యక్తులను ప్రశ్నిస్తున్నాడు నరవాహన భట్టు. ఆ ఇరవైమందీ మహారాజావారి కోటలో పనిచేస్తున్నారు. ఎంతసేపు ప్రశ్నించినా తమకు తెలియదని చెపుతున్నారు.
ALSO READ | ఆధ్యాత్మికం: యోగం అంటే ఏమిటి.. శ్రీకృష్ణుడు చెప్పిన అర్ధం ఇదే..!
చివరి ప్రయత్నంగా తనపక్కనే నిలబడి ఉన్న తన అంగరక్షకుడి వైపు చూసి, మంత్రించిన బియ్యాన్ని సిద్ధం చేయించు!" అని చెప్పాడు. మహామంత్రి. ఐదు నిమిషాల తర్వాత.. ఉజ్జయినీ నగరంలోని మహాకాళికా దేవాలయంలో ప్రధాన పూజారిగా పనిచేస్తున్న రుద్రభైరవ భట్టు అక్కడకు మంత్రించిన బియ్యాన్ని పట్టుకొచ్చాడు.
అప్పుడు మంత్రి ఆ ఇరవైమంది వైపు చూస్తూ, "ఇపుడు ఈ మంత్రించిన బియ్యాన్ని మీరు తినాలి. ఈ బియ్యం ప్రభావంతో దొంగిలించిన వ్యక్తి కడుపు ఉబ్బిపోతుం ది. అతడు పొట్ట పగిలి మరణిస్తాడు. కాని దొంగతనం చేయని నిరపరాధులకు మాత్రం ఎటువంటి హాని జరగదు" అన్నాడు. నిజానికి ఆ బియ్యంలో ఎలాంటి మహత్యమూ లేదు. కేవలం అనుమానితులను భయపెట్టి నిజం రాబట్టడానికే ఈ ఉపాయాన్ని పన్నాడు.
రుద్రభైరవభట్టు మంత్రించిన బియ్యాన్ని అనుమానితులకు ఇవ్వసాగాడు. వాళ్లలో ఒక వ్యక్తి భయంతో వణకసాగాడు. అతడి శరీరం చెమటలు పట్టింది. రుద్రభైరవభట్టు తన దగ్గరకు రాగానే ఆ వ్యక్తి చటుక్కున మహామంత్రి కాళ్ళమీద పడిపోయాడు. "ఆ హారాన్ని నేనే దొంగిలించినాను. మన్నించండి" అంటూ వేడుకున్నాడు. ఆ వ్యక్తి రాజమందిరంలో వంటవాడిగా పనిచేస్తున్నాడు. అదను చూసి ఆ వజ్రాలహారాన్ని దొంగిలించాడు.
దేవీ నవరాత్రి ఉత్సవాలు మరో వారం రోజుల్లో రాబోతున్నాయి. అమ్మవారిని ఆ వజ్రాలహారంతో అలంకరించి పూజించడం సంప్రదాయం. ప్రస్తుతం మహారాజు చండమహాసేనుడు రాచనగరంలో లేడు. రాచనగరానికి యాభై క్రోసుల దూరంలో ఉన్న ఆవంతీనగరంలోని చలువరాతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దొంగిలించిన వ్యక్తి నుంచి మహామంత్రి హారాన్ని తీసుకున్నాడు. మహారాజావారు తిరిగి వచ్చిన తరువాత దొంగకు ఏ శిక్ష విధిస్తారో నిర్ణయిస్తారనీ అప్పటివరకు ఆ వ్యక్తిని ఖైదు చేయమనీ భటులకు చెప్పాడు. దొంగను భటులు తీసుకువెడు తుండగా అక్కడకు వచ్చాడు వార్తాహరుడు. అతడి ముఖం విచారంతో.. దుఃఖంతో పాలిపోయి ఉంది. అతడు మహామంత్రికి నమస్కరించి, "మహారాజావారు మరణించారు" అని చెప్పాడు.
అవంతీ నగరంలోని చలువరాతి విశ్రాంతి భవనంలో విశాలమైన శయన మందిరంలో హంసతూలికా తల్పం మీద విగత జీవిగా పడివున్నా డు మహారాజు చండమహాసేనుడు. అప్పటికే ఆయన శరీరం నీలంగా మారి వుంది. నోట్లోంచి తెల్లటి నురగ వచ్చి ఉంది. శరీరం చల్లబడి బిగుసుకుపోయి ఉంది. మహారాజు మీద విషప్రయోగం జరిగిందని అర్థమయింది మహామంత్రికి ఆరుగురు ఆస్థాన వైద్యులు ఓ పక్కగా నిలబడి ఉన్నారు. వారికి నాయకత్వం వహిస్తున్న ప్రధాన వైద్యుడు చెప్పాడు. "మహామంత్రీ! మహారాజావారు పాముకాటుతో మరణించారు".
"పాము కాటుతో మరణించారా? లేక ఎవరైనా విషప్రయోగం చేశారా?" "లేదు మహామంత్రీ! కచ్చితంగా మహారాజావారు పాముకాటుతోనే మరణించారు. అత్యంత విషపూరితమైన త్రాచుపాము కాటువేసి ఉంటుందని మా అనుమానం. రాజావారి కుడిచేతి మణికట్టుమీద పాము కాటు వేసిన గుర్తులున్నాయి. విష సర్పం కాటువేస్తే రెండు గాయపు గుర్తులు ఏర్పడతాయి. అంటే రెండు కోరలకు రెండు గుర్తులు పడతాయి. విషం లేని సర్పాలు కాటువేస్తే రెండు కన్నా ఎక్కువ గాయాలు ఏర్పడతాయి. మహారాజా వారిని కాటువేసింది త్రాచుపామే. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే కాటు వేసిన చోట శరీరం ఎర్రగా వాచింది" ప్రధాన వైద్యుడు చెప్పడం ముగించాడు.
వైద్య బృందాన్ని ఇక వెళ్ళవచ్చు అన్నట్టు సైగ చేశాడు మహామంత్రి, ఇరవై సంవత్సరాల ప్రాయంలో రాజుగారి ఆస్థానంలో గూఢచారిగా జీవితం ప్రారంభించి మహామంత్రిగా ఎదిగాడు నర వాహన భట్టు. నేర పరిశోధనలో అతనికి మంచి ప్రావీణ్యం ఉంది. ఎంతోమంది కాపలాకాస్తున్న వారిని దాటుకుని, మహారాజావారి పడకగదిలోకి సర్పం ప్రవేశించటం నమ్మశక్యంగా లేదు. కానీ కొన్ని సంఘ టసలు నమ్మటం తప్పనిసరి అనుకుంటూ ఉండగా ఆయన మనసులో ఏదో అనుమానం మొలకెత్తింది.
మహారాజావారికి శత్రువులు ఎక్కువగాఉన్నారు. ఏ క్షణమైనా మహారాజావారికి అపాయం కలగవచ్చు. అందుకనే ప్రతి క్షణమూ మహారాజావారిని మహామంత్రి కంటికి రెప్పలా కాపాడుతున్నా డు. కాని మహామంత్రి వజ్రాలహారం కోసం రాజధాని ఉజ్జయినీ నగరానికి వెళ్ళిన సమయంలో మహారాజావారు పాము కాటుతో మరణించారు. మహారాజా వారిని హత్య చేయడానికే తనను దూరంగా పంపించారా? ఇందులో ఏదైనా కుట్ర ఉన్నదా? ఈ ఆలోచన వచ్చిన వెంటనే మహా మంత్రి నలుగురు భటులను పిలిపించి, రాజధాని ఉజ్జయిని నగరంలో వజ్రాలహారాన్ని దొంగిలించిన వ్యక్తిని వెంటనే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. తరువాత మహారాజావారి ఆంతరంగిక సేవకులను రప్పించి వాళ్ళను ప్రశ్నించాడు.
"మహారాజావారు మరణించినప్పుడు మొదట ఎవరు చూశారు? ఓ పరిచారిక చెప్పింది. "నేను చూశాను". "అసలు నువ్వు రాజావారి గదిలోకి ఎందుకు వెళ్లావు.."గది శుభ్రం చేయడానికి వెళ్ళాను. నేలమీద పడివున్న మామిడిపండు తొక్కలను మిగిలిపోయిన ఆహారపదార్థాలను దూరంగా తీసుకువెళ్ళి పారవేశాను. రాజావారు రాత్రంతా సారాయి తాగారు. తాగిన పాత్రలను శుభ్రం చేయడానికి ఆ పాత్రలను కూడా తీసుకువెళ్ళాను" "నువ్వు తీసుకువెళ్ళిన వాటిని నాకు చూపించు" పరిచారిక మహామంత్రికి వాటిని చూపించింది. సారాయి పాత్రలలో అనుమానించదగింది ఏమీ లేదు. ఓ మూలగా పారవేసిన మామిడిపండ్ల తొక్కలను పరిశీలించాడు.
మహామంత్రి వాటిలో ఒకటి చిక్కటి పసుపు వర్ణంతో మెరుస్తూ కనపడుతోంది. అనుమానంగా దాన్ని తీసుకుని చూశాడు. చేతికి గట్టిగా తగిలింది. అది మామిడిపండు తొక్క కాదు. దాన్నెవరో లక్కతో తయారుచేశారు. అచ్చం అసలయిన మామిడిపండులా కనపడేలా అత్యంత నైపుణ్యంగా లక్కతో తయారుచేయబడిన మామిడిపండు బొమ్మలోని ఒక భాగం అది. అలాంటివి అక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయేమోనని మహామంత్రి చూశాడు. కానీ అదొక్కటే అక్కడ పడి ఉంది. మిగిలిన ముక్కలను అక్కడ నుంచి తీసేసి ఉంటారు. పొరపాటున ఆ ముక్కను అక్కడే వదిలేశారు. తన చేతిలోని ముక్కను జాగ్రత్తగా పరిశీలించాడు మహామంత్రి. దానికి అక్కడక్కడ, లోపలికి గాలి ప్రవేశించడానికి అనువుగా కంటికి కని పించని అతి సన్నటి రంధ్రాలు ఉన్నాయి.
రాజావారి దగ్గర పనిచేసే మరో అంతరంగికుణ్ణి అడిగాడు మహామంత్రి, "అసలు రాజావారికి ఈ మామిడి పండ్లు ఎవరు అందజేశారు?” అని. "త్రిలింగదేశం నుంచి నాట్యం చేసేవాళ్ళు వచ్చి రాజావారి ఎదుటనాట్య ప్రదర్శన చేశారు. రాజావారికి మామిడిపండ్లను బహుమతిగా ఇచ్చారు. బదులుగా రాజావారు వారికి బంగారు హారం ఇచ్చారు" మహామంత్రికి కొంతవరకు అర్థ మయింది. వెంటనే ప్రదర్శన చేసిన కళాకారులను తీసుకురమ్మని ఆజ్ఞ జారీ చేశాడు. మరొక్క గంట తర్వాత నగర శివార్లలో గుడారాల్లో ఉంటున్న కళాకారులను భటులు తీసుకువ చ్చారు. వాళ్ళు మహామం త్రితో ఇలా చెప్పారు.
"మేము రాజావారి వద్ద నృత్యప్రదర్శన చేద్దాం అనుకున్నాం. ఆ ముందురోజు రాత్రి ఎవరో ముసుగు ధరించిన వ్యక్తి దొంగతనం చేయడానికి వచ్చాడు. మా దగ్గర విలువైన వస్తువులు ఏవీ లేవు. మేము మహారాజా వారికి బహుమతిగా ఇవ్వాలనుకున్న మామిడిపండ్ల బుట్టను తీసుకుని పారిపోయాడు. మేము వెంబడించాం. ఆ ముసుగు వ్యక్తి కొంతదూరం పరుగుతీసి ఆ బుట్టను చెట్ల పొదల పక్కన వదిలి పారిపోయాడు" మహామంత్రికి జరిగిన విషయం అర్థమైంది. ఆ ముసుగు మనిషికి దొంగతనం చేసే ఉద్దేశం లేదు. త్రాచుపాము ఉన్న మామిడిపండు బొమ్మను మహారాజు వద్దకు చేర్చేప్రయత్నంలో దొంగ అవతారం ఎత్తాడు. మహామంత్రి పరిశోధన అక్కడితో ఆగిపోయింది.
ఉజ్జయినీ నగరంలో వజ్రాలహారాన్ని దొంగిలిం చిన వ్యక్తిని తీసుకువచ్చిన తర్వాత అసలు నేరస్తుడు. బయటపడే అవకాశం ఉంది. భటులు ఆ మర్నాడు తెల్లవారుజామున హారాన్ని దొంగిలించిన వ్యక్తిని రథం మీద తీసుకువచ్చారు. అప్పటికి అతడు ప్రాణాపాయంలో ఎగశ్వాస పీలుస్తు న్నాడు. అతడి మీద కూడా విష ప్రయోగం జరిగింది. అతడు తిన్న ఆహారంలో ఎవరో విషం కలిపారు. హంతకులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారని మహా మంత్రికి అర్థం అయింది. చావుబతుకుల్లో ఉన్న వజ్రాలహారపు దొంగను ప్రశ్నించాడు మహామంత్రి. "హారాన్ని దొంగిలించమని నీతో ఎవరు చెప్పారు?" ఆ వ్యక్తి మౌనం వహించాడు. "నేను మన కులదైవం మహాకాళికామాత మీద ఒట్టు వేసి చెబుతున్నా. నువ్వు మరణించడం ఖాయం. నువ్వు చనిపోయిన తర్వాత నేను నీ కుటుంబానికి ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు మహామంత్రి. ఆ వ్యక్తి మహామంత్రి కళ్ళలోకి చూస్తూ, “మహా వర్మ" అంటూ చెప్పి మరణించాడు.
తన మందిరంలో పచార్లు చేస్తూ ఆలోచిస్తు న్నాడు మహామంత్రి. మహావర్మలు ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు విక్రమ మహావర్మ మరొకరు త్రివి క్రమ మహావర్మ. ఈ ఇద్దరూ మహారాజుకు తోడబుట్టిన తమ్ముళ్ళు. మహారాజు మరణిస్తే వీరిలో ఒకరు సింహాసనం ఎక్కుతారు. ఆలోచిస్తున్న మహామంత్రి ఆ ఇద్దర్నీ కలవాలని నిర్ణయించుకున్నాడు. ముందు త్రివిక్రమ వర్మను, ఆ తర్వాత విక్రమ వర్మను కలిసి మహారాజా వారి అంత్యక్రియల గురించి మాట్లాడాడు. వీరిద్దరిలో విక్రమవర్మ బాగా చదువుకున్నవాడు. తెలివితేటలున్నవాడు. ఎన్నో తెలివితేటలున్నవాడు. ఎన్నో గ్రంథాలను పఠించాడు.
మహామంత్రి ఆయనను కలిసినప్పుడు కొన్ని తాళపత్ర గ్రంథాలు అక్కడ ఉన్నాయి. వాటివైపు చూస్తూ ఏదో చదువుతున్నట్లున్నారు?" అనడిగాడు. "అవును! మహాభారతం పఠిస్తున్నాను. ఈమధ్యనే ఆదిపర్వం ముగించాను" చెప్పాడు విక్రమవర్మ. ఆ సమాధానంతో అతడే హంత కుడనే విషయం మహామంత్రికి అర్ధం అయింది. మహామంత్రి ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఆస్థాన శిల్పాచార్యుడు. అతడు చెప్పాడు. "లక్కతో చేసిన మామిడిపండు బొమ్మలో సర్పాన్ని ప్రవేశ పెట్టడం సాధ్యమే. మీరు అందజేసిన మామిడిపండు బొమ్మకు చెందిన ముక్కను పరిశీలించాను. గాలి ప్రవేశించేందుకు వీలుగా దానికి సూక్ష్మ రంధ్రాలున్నా యి. లోపల ఉండే సర్పం ఊపిరి పీల్చుకునేందుకు ఆ సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడతాయి.
మూరెడు పొడవున్న విషసర్పం పట్టేంత మామిడి పండు బొమ్మను ఎవరో చాలా నైపుణ్యంగా తయారుచేశారు. ఆ మామిడిపండు బొమ్మను కత్తితో కోయడానికి ప్రయత్నించినపుడు ఆ బొమ్మ పగిలి అందులోని సర్పం బయటికి వస్తుంది" శిల్పాచార్యుడి పక్కనే పాములు పట్టే సర్పవేగుడు అనే వాడు నిలబడి ఉన్నాడు. "ఐదు రోజుల క్రితం మహారాజా వారి తమ్ముడు విక్రమవర్మ దగ్గర పనిచేసే ఆంతరంగిక అనుచరుడు దుర్జయుడు సన్ను కలిశాడు. అతడి ఆజ్ఞమీద నేను మూరెడు పొడవున్న త్రాచుపాము పిల్లను మామిడిపండు బొమ్మలో ప్రవేశపెట్టాను. ఆ బొమ్మకు తొడిమె ఉండే చోట చిన్న మూత వంటిది ఉన్నది. పామును ప్రవేశపెట్టిన తర్వాత మూత బిగించి, తిరిగి ఆ బొమ్మను దుర్జయుడికి ఇచ్చేశాను" అని చెప్పాడు.
మంత్రిమండలి, సేనాధిపతి, ఉప సేనాధిపతు లు. దండనాధుల సమక్షంలో విచారణ మొదలైంది. నేరస్థుడి స్థానంలో నిలబడి ఉన్న విక్రమవర్మతో అన్నాడు మహామంత్రి, "నిన్ను కలవడానికి వచ్చినప్పుడు ఆదిపర్వం చదవడం ముగించాను. అని చెప్పావు. మహాభారతం ఆదిపర్వంలో పరీక్షిత్తు మహారాజు ఒక పండు తినే సందర్భంలో, ఆ పండులో ఉన్న తక్షకుడు అనే సర్పం బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణిస్తాడు.
పరీక్షిత్తు మరణించిన అంశం నీకు ప్రేరణ ఇచ్చింది. అదే పద్ద తిలోనీ అన్నగారైన మహారాజావారిని హత్య చేశావు. ఆ సమయంలో ఆయన మద్యం ఎక్కువగా తాగిన మత్తులో ఉండడం వలన పాము కాటును సరిగా గ్రహించలేకపోయారు. కాటు వేసిన పాము ఎటో వెళ్ళిపోయింది. మహారాజా వారు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. ఐతే మామిడి పండు బొమ్మను ఎవరు తయారుచేశారో ఇంకా తేలవలసి ఉన్నది" ఇక తనకు అన్ని దారులూ మూసుకుపోయాయని గ్రహించిన విక్రమవర్మ నేరాన్ని అంగీకరించాడు. మంత్రిమండలి అతడికీ, అతడితోపాటు కుట్రలో సహకరించిన మిగిలినవాళ్ళకూ మరణశిక్ష విధించింది.