
యోగం అంటే ఏమిటి? సరిగ్గా తెలిసినా.. తెలియకపోయినా అందరూ ఈ పదాన్ని తరచుగా వాడుతూ ఉంటారు. ఎన్నో సందర్భాలలో అర్థచాయతో ఈ పదాన్ని వింటూఉంటాం. ఆయనకి మహారాజ యోగం పట్టింది..... నాకు అంతటి యోగం ఎక్కడిది?.... మొదలైన మాటలే కాదు....విషాదాన్ని కూడా యోగం అనటం జరిగింది కదా భగవద్గీతలో.... ఇంతకీ ఈ పదానికి అసలైన అర్ధం ఏమిటి?
యోగం.. లేదా యోగః అన్న దానికి మూల ధాతువు...యుజ్.. అంటే.. జోడించు... జతచేయు... కలుపు అని అర్థం. ఈ అర్థంలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు. జత కలిపినప్పుడు రెండూ సమానంగా లేకపోతే ఏమవుతుంది? ఏది బరువు ఎక్కువగా ఉంటే అటువైపు వంగటం జరుగుతుంది.
పూర్వకాలంలో రెండెడ్ల బళ్ళు... ఎడ్లు కట్టిన నాగళ్ళు ఉండేవి . . రెండింటిని కలిపేదాన్ని ...కాడి.. అంటారు. కాడికి అటు ఇటు ఉన్న ఎడ్లు రెండూ సమానంగా ఉంటే.. బండి కాని, నాగలి కాని హాయిగా సాగుతాయి. అలాగే కావడి మోసే వారికి తెలుసు.. రెండు వైపులా బరువులు సమానంగా ఉంటేనే మొయ్యటం సులువు. తేడా ఉంటే బరువుగా ఉన్న వైపు ఒరిగిపోతుంది. ఇది బయటికి కనిపించే బరువుల విషయం అనుకుంటే పొరపాటే.
►ALSO READ | గంగా సప్తమి ( మే 3) : గంగమ్మ తల్లి భూమిపైకి వచ్చినరోజు.. ఆరోజు ఏం చేయాలంటే..
ఇది బరువులు మోసే మనసుకు కూడా వర్తిస్తుంది. మనసుకి బరువులేమిటి? దుఃఖభారం.... బాధతో మనసు బరువెక్కింది.... మొదలైన మాటలని వింటూనే ఉంటాంకదా..! అంటే ప్రతికూల భావనలు బరువుగా ఉంటాయి. మనసుని కుంగతీస్తాయని అర్థం. ఒక వైపుకి వంగిపోయి ఉంటే ఏది సమంగా ఉండదు కదా. కనక, మనసు సరిగ్గా... అంటే సూటిగా..సరళంగా పని చేయాలంటే ఎటువైపుకి ఎక్కువగా వంగకుండా ఉంచుకోవాలి.
బాధ బరువుగా ఉండటం వల్ల మాత్రమే కాదు. సంతోషం, ఆనందం మొదలైన భావాలు తేలికగా ఉండటం వల్ల ఒక వైపు పైకి లేచి పోతుంది. అదైనా సమానంగా ఉందనీయదు కదా. అందువల్ల బాధకి కుంగటం, సంతోషానికి పొంగటం రెండు సమానత్వాన్ని దెబ్బ తీస్తాయి.
మానవసహజమైన ఈ భావోద్వేగాలు లేకుండా ఉండటం సాధ్యమేనా? సాధ్యమే అంటాడు జగద్గురువు శ్రీకృష్ణపరమాత్మ. ఎట్లా అంటే... ఫలాసక్తి లేకుండా తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించటమే. అంటే ఫలితం ఏదైనా ఒక విధంగానే స్వీకరించగలగటం. ఈ విధంగా చేయటానికి వీలవుతుందా? వీలవుతుందని తెలియటానికి ఒక ఉదాహరణం సరిపోతుంది.
మన ఇంటిలో ఏదైనా పని మొదలు పెడుతూ కొట్టిన కొబ్బరికాయ కుళ్లిపోతే అనుకున్న పని అవదేమోనని భయపడతాం. అదే కార్యాలయంలో అయితే పెద్దగా పట్టించుకోం. పైగా దాన్ని పరిగణించాల్సిన పని లేదని కూడా చెప్పి కార్యక్రమం నడిపించేస్తాం అంటే, ఫలితం గురించి ఆశించకుండా ఉంటే మనసుకి ఒడిదుడుకులు ఉండవు. ఈ సందర్భంలో కూడా ఫలితం మంచో, చెడో ఉండకుండా ఉండదు కదా. అది ఎటువంటిదైనా మనసు మీద ప్రభావాన్ని చూపించదు. మనసు మీద ప్రభావం లేనప్పుడు పొంగిపోవటం ఉండదు. కుంగిపోవటం కూడా ఉండదు. రెండింటి పట్ల సమభావనయే ఉంటుంది. అన్నింటి పట్ల సమభావన కలిగి ఉండటం మనుషులకి చేతనవును. కాని తన విషయం...తన వారి విషయం వచ్చినప్పుడు కూడా సమభావనతో ఉండటం అభ్యాసం కాలేదు. అభ్యాసం చెయ్యాలి. అంతే... అదొక్కటే మార్గం. నాటకమో, చలనచిత్రమో చూస్తున్నప్పుడు... పాత్రలు సంతోషంగా ఉన్నా..... బాధపడుతున్నా అది చూసేవారి మీద ప్రభావాన్ని చూపించదు. ఏ భావం ప్రకటించినా చూసేవారికి ఆనందమే కలుగుతుంది. చలనచిత్రాన్ని చూసినట్టు తన జీవితంలో సంఘటనలని కూడా చూడగలిగితే అది సమత్వం.
సమత్వం అంటే జీవులన్నింటి పట్ల కూడా సమభావన ఉండటం. సాధారణంగా ఒక వృత్తిని చేపట్టినవారో, ఇంకొంచెం విశాలభావన ఉంటే మానవులందరూనో ఒకటే అని నినాదాలివ్వటం చూస్తాం. కాని సనాతన ధర్మం చెప్పేది సర్వజీవ సమానత్వం. ఆబ్రహ్మపి పీలికాది పర్యంతం అందరిలోనూ, అన్నిటిలోనూ ఉన్నది ఒకటే పరమాత్మ అనే విశ్వాసం. ఈ విశ్వాసం ఉన్నవారికి భేద బుద్ది ఉండదు. అంతటా పరమాత్మని దర్శించడం అలవాటు అవుతుంది. ఇంక హెచ్చు తగ్గుల ప్రసక్తి ఎక్కడ ఉంటుంది?
►ALSO READ | జ్యోతిష్యం : మీకు ఉద్యోగం, డబ్బు ఇచ్చేది శని దేవుడే.. మీ రాశిలో ఎక్కడ ఉన్నాడో చూసుకోండి..!
ఇదంతా ప్రవర్తనకి సంబంధించినది. ఇది భౌతిక స్థాయికి చెందినది. అసలు యోగము అంటే జీవాత్మ పరమాత్మలో కలిసిపోవటమే. అది ఎట్లా జరుగుతుంది? జరిగినా ఎట్లా తెలుస్తుంది? పైకి కనిపించదు కదా. అంటే- అటువంటివారి జీవన విధానం తెలియజేస్తుంది. యోగం అంటే ఫలితాల వెంట పరుగెత్తే మనసుని ఫలస్పర్శ లేని బుద్ధితో జతపరచి (ఇదే కలపటం) ఆ బుద్ధి చెప్పిన దారిలో నడుచుకోవటం. యోగసిద్ధులైనవారు మనసుని ఎప్పుడూ బుద్ధి నుండి వేరు చేయరు. బుద్ధి అంటే మంచి చెడులను నేర్పరచి విచక్షణతో చూడగల శక్తి. అది నిరంతరం చెపుతూనే ఉన్నా చంచలమైన మనసు వినటానికి ఇష్టపడదు. బుద్ధి నుండి మనసు విడివడకుండా చూడగలగటమే చేయవలసిన సాధన. అప్పుడు నా వారు... పై వారు అనే భేదబుద్ధి ఉండదు. అందరి పట్ల సమభావనయే ఉంటుంది. వ్యక్తుల పట్ల మాత్రమే కాదు.... వస్తువులు.. పరిసరాలు... ఫలితాలు అన్నింటి పట్ల ఒకే రకమైన భావన. అలాగని పనులు చెయ్యటం మాత్రం మానరు. ఆ పనులని యోగ స్థితిలో చేస్తారు.
"యోగస్థ: కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ
సిద్ధ సిద్ధ్యో: సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే".
-–వెలుగు,లైఫ్–