
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుండగా.. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పాక్షిక గ్రహణం ఏర్పడనుంది. ఇండియాలో కూడా చంద్రగ్రహణం మొదలైంది. భారత్‌లో ఢిల్లీ, ముంబై, బెంగుళూర్, కోల్ కతా వంటి నగరాల్లో చంద్రగ్రహణం స్పష్టంగా చూడొచ్చని చెప్పారు ఖగోళ శాస్త్రవేత్తలు. రాత్రి 11 గంటల నుంచి 12.22 నిమిషాల వరకు అంటే 82 నిమిషాల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది.
ఈ 82 నిమిషాల పాటు చంద్రుడు భూమి నీడలోనే ఉండనున్నాడు. అనంతరం క్రమంగా చంద్రగ్రహణం వీడి.. సోమవారం (సెప్టెంబర్ 8) అర్ధరాత్రి 2.25 గంటలకు గ్రహణం పూర్తిగా ముగియనుంది. చంద్రగ్రహణ ప్రభావంతో దేశవ్యాప్తంగా దాదాపు ఆలయాలన్నీ మూతపడ్డాయి. తిరుమల, అరుణాచలం, కాశీ విశ్వనాథ ఆలయం, అయోధ్య రామాలయం, వైష్ణోదేవి ఆలయం వంటి ప్రముఖ దేవాలయలన్నీ క్లోజ్ చేశారు. మరోవైపు చంద్రగ్రహణం ఎఫెక్ట్‌తో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం చంద్రగ్రహణాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. టెలిస్కోపుల్లో ఖగోళ అద్భుత దృశ్యాన్ని వీక్షిస్తున్నారు.
చంద్రగ్రహణం టైమింగ్స్:
ఆదివారం (సెప్టెంబర్ 7) రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం (సెప్టెంబర్ 8) తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడనుంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం (సెప్టెంబర్ 8) సంప్రోక్షణ అనంతరం తిరిగి దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకోనున్నాయి.