ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనటం లేదు‎: కేటీఆర్

ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనటం లేదు‎: కేటీఆర్

హైదరాబాద్: 2025, సెప్టెంబర్ 9వ తేదీ జరగనున్న ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనటం లేదని.. ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రెండు పార్టీల అభ్యర్థులు మంచోళ్లే అని.. అంతకంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారాయన. ఉప రాష్ట్రపతి ఎన్నికలో నోటా ఉంటే నోటాకు ఓటేసేవాళ్లం అని స్పష్టం చేసిన కేటీఆర్.. నోటా లేకపోవడంతో ఓటింగ్‎కు దూరంగా ఉంటామన్నారు. 

యూరియా కొరత వల్ల తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని.. వాళ్ల సమస్య పరిష్కరించినోళ్లకే ఓటేస్తామని ముందుగానే చెప్పామంటూ వివరణ ఇచ్చారు కేటీఆర్. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేదని.. తెలంగాణ ప్రజల పక్షాన మేము ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు కేటీఆర్. తెల్లారితే ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న వేళ కేటీఆర్ క్లారిటీ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తుందని కేడర్‎లో నెలకొన్న గందరగోళం వీడింది. 

►ALSO READ | తెలంగాణలోని ఈ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు... హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే..?

జగదీప్ ధన్ ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. 2025, సెప్టెంబర్ 9న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా.. అధికార ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‎ను బరిలోకి దింపగా.. ఇండీ కూటమి తరుఫున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. 

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్‎కు రాజకీయ పోరు ఉండటంతో ఈ రెండింట్లో ఏ వర్గానికి మద్దతు ఇచ్చిన ఇరకాటంలో పడే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ మొత్తానికి ఓటింగ్ కే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. హైకమాండ్ నిర్ణయం మేరకు ఈ నలుగురు ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండనున్నారు.