
న్యూఢిల్లీ: 2025, సెప్టెంబర్ 7న ఆదివారం రాత్రి ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కనువిందు చేయనున్న ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో బ్లడ్ మూన్ స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అలాగే ఇండియాలో కూడా ఈ చంద్ర గ్రహణం స్పష్టంగా ప్రజలకు దర్శనమిస్తుందని తెలిపారు సైంటిస్టులు.
అయితే, చాలా మందిలో సూర్య, చంద్ర గ్రహణాలపై అపోహలు ఉంటాయి. కొందరు గ్రహణం అనగానే భయంతో వణికిపోతారు. గ్రహణ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దు, గ్రహణ సమయంలో ఆహారం తినొద్దు అనే మూడ నమ్మకాలను నమ్ముతారు. గ్రహణ సమయంలో ఆలయాలు మూసివేస్తారు. మరికొందరు గ్రహణాన్ని చూడొద్దు అంటుంటారు. నిజంగా అసలు గ్రహణాన్ని నేరుగా చూడొచ్చా..? లేదా..? అనే దానిపై చాలా మందిలో అపోహలు ఉంటాయి.
ఈ క్రమంలో గ్రహణాన్ని కండ్లతో నేరుగా చూడొచ్చా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఖగోళ శాస్త్రవేత్తలు. గ్రహణాలను కండ్లతో డైరెక్ట్‌గా చూడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. సాధారణంగా గ్రహణాలు వంటి ఖగోళంలో జరిగే అద్భుత దృశ్యాలను ప్రపంచవ్యాప్తంగా అనేక అబ్జర్వేటరీలు పర్యవేక్షిస్తాయి. గ్రహణాలను కళ్లతో నేరుగా కూడా చూడొచ్చు. అయితే.. సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం హానికరం అంటున్నారు సైంటిస్టులు.
ఎందుకంటే సూర్య గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి సాధారణ సమయం కంటే ఎక్కువ శక్తివంతమైన కిరణాలు విడుదల అవుతాయంటా. కాబట్టి సూర్య గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడొద్దంటా. సూర్య గ్రహణాన్ని టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ల ద్వారా చూడటం బెటర్. కానీ చంద్రగ్రహణాన్ని డైరెక్ట్ కళ్లతో వీక్షించవచ్చని చెబుతున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఎందుకంటే.. చంద్రకాంతి అంత ప్రకాశవంతంగా ఉండదు కాబట్టి కళ్లతో చంద్రగ్రహణాన్ని చూడటంలో ఎలాంటి ప్రమాదం లేదంట. మీ దగ్గర బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్ ఉంటే వాటిని ఉపయోగించి చూడటం ఇంకా బెస్ట్ అంటున్నారు సైంటిస్టులు.
చంద్రగ్రహణం వివరాలు:
ఆదివారం (సెప్టెంబర్ 7) రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం (సెప్టెంబర్ 8) తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం వీడనుంది. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత సోమవారం (సెప్టెంబర్ 8) సంప్రోక్షణ అనంతరం తిరిగి దేశవ్యాప్తంగా దేవాలయాలు తెరుచుకోనున్నాయి.