
- రాష్ట్రంలో బలహీనమైన నైరుతి రుతుపవనాలు
- వాయువ్య గాలులతో వేడి రేపట్నుంచి హీట్ వేవ్స్ మరింత పెరిగే అవకాశం
- పొద్దున ఎండలు.. సాయంత్రం నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షా కాలంలో ఎండలు మండుతున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీన పడ్డాయని, దీంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సూర్యుడి వేడి పెరిగి రేడియేషన్ ఎక్కువ కావడం, వాయువ్య గాలుల ప్రభావంతో వేడి గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించి గాలిలోని తేమను హరించివేయడం వంటి కారణాలతో ఎండ తీవ్రత, ఉక్కపోత పెరుగుతున్నదని అంటున్నారు. ఈ పరిస్థితి మంగళవారం నుంచి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ (హకీంపేట), ఖమ్మం, మెదక్, రామగుండం, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డ్ అయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. సాధారణం కన్నా 3 డిగ్రీలు ఎక్కువగా రికార్డయింది. ఖమ్మంలో 34.2 డిగ్రీలు నమోదుకాగా.. సాధారణం కన్నా 2 డిగ్రీలు ఎక్కువ టెంపరేచర్ నమోదైంది. రామగుండంలో 33, మెదక్‌లో 32, హనుమకొండ, హకీంపేటలలో 32 డిగ్రీల చొప్పున ఉష్టోగ్రతలు రికార్డయ్యాయి.
4 రోజులు ఎల్లో అలర్ట్..
వరంగల్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షాలు పడ్డాయి. గంటలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ప్రభావం హనుమకొండ, ములుగు జిల్లాల్లోనూ కనిపించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఆదివారం వర్షం కురిసింది. వరంగల్ జిల్లా పైడిపల్లిలో 7.1 సెంటీమీటర్లు, హనుమకొండ జిల్లా దామెరలో 6.5, వరంగల్ జిల్లా ఉర్సులో 5.6, సంగెంలో 4.2, కాశీబుగ్గలో 4.2, గీసుగొండలో 4, గొర్రెకుంటలో 3.8, ములుగు జిల్లా వెంకటాపరంలో 2.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 2.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
కాగా, రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని చెప్పింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్ సిటీలో మబ్బు పట్టి ఉండి ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని తెలిపింది. రాత్రిపూట పొగమంచు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్తాన్‌లో కొనసాగుతున్న వాయుగుండం.. తూర్పు మధ్యబంగాళాఖాతం వరకు కొనసాగుతున్నట్టు ఐఎండీ పేర్కొంది. అంతేగాకుండా.. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని వెల్లడించింది.
భారీ వర్షాలు పడే అవకాశం..
రాష్ట్రంలో సోమవారం ఎండ వేడి, ఉక్కపోత కారణంగా ఆకస్మికంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. అదేవిధంగా మంగళవారం నుంచి హైదరాబాద్ సిటీ సహా రాష్ట్రమంతటా అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, మధ్యాహ్నం 3 గంటల తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ నెలంతా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు.