చంద్రగ్రహణం చూడాలనుకుంటున్నారా..? ఇండియాలో ఈ నాలుగు ప్రాంతాల్లో క్లియర్‎గా చూడొచ్చు..!

చంద్రగ్రహణం చూడాలనుకుంటున్నారా..? ఇండియాలో ఈ నాలుగు ప్రాంతాల్లో క్లియర్‎గా చూడొచ్చు..!

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా 2025, సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌‌‌‌లో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అలాగే ఇండియాలో కూడా ఈ చంద్ర గ్రహణం ప్రజలకు దర్శనమిస్తుందని తెలిపారు సైంటిస్టులు. 

అయితే.. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో కాకుండా ముఖ్యంగా నాలుగు ప్రదేశాల్లో చంద్ర గ్రహణం చాలా క్లియర్‎గా కనిపిస్తుందని చెప్పారు ఖగోళ శాస్త్రవేత్తలు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో చంద్ర గ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడించారు సైంటిస్టులు. ఈ ప్రదేశాలతో పాటు అహ్మదాబాద్, పూణే, లక్నో  వంటి భారతీయ నగరాలు కూడా అద్భుతమైన వ్యూ పాయింట్‌లను అందిస్తాయని తెలిపారు. 

ఆదివారం (సెప్టెంబర్ 7) అర్ధరాత్రి సమయంలో గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఆ సమయంలో స్పష్టమైన ఆకాశం, తక్కువ కాంతి కాలుష్యం ఉండటం వల్ల ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని స్పష్టంగా వీక్షించవచ్చు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ దశాబ్దంలోనే అత్యంత పెద్దదైన (టైమ్ ప్రకారం),  అత్యంత స్పష్టంగా కనిపించే ఖగోళ దృశ్యాల్లో ఒకటని పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. ఈ చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి అద్దాలు అవసరం లేదని చెప్పారు సైంటిస్టులు.

చంద్ర గ్రహణం ఏర్పడే, ముగిసే వివరాలు:

ఆదివారం (సెప్టెంబర్ 7) రాత్రి 8:58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 12:22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం (సెప్టెంబర్ 8)  తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్రగ్రహణం ముగియనుంది.