గేట్‌‌ ఆఫ్‌‌ ది సన్‌‌

గేట్‌‌ ఆఫ్‌‌ ది సన్‌‌

ఒక పురాతన నగరం తివానాకు. పూర్వం అక్కడ ఎన్నో కట్టడాలు ఉండేవట. వాటిలో ఇప్పుడు మిగిలింది మాత్రం ఈ ‘‘సన్‌‌ గేట్‌‌” మాత్రమే. ఇది ఒక నాగరికతకు పురావస్తు ఆధారం. దీనిపై ఎన్నో రీసెర్చ్‌‌లు చేశారు. అయినా... పూర్తి వివరాలు తెలుసుకోలేకపోయారు. ఈ గేట్‌‌ నుంచి గ్రహాంతరవాసులు భూమ్మీదికి వచ్చేవాళ్లని ఇప్పటికీ చాలామంది నమ్ముతున్నారు. కానీ.. కొందరు మాత్రం ఇక్కడి ప్రజలు తయారుచేసుకున్న క్యాలెండర్‌‌‌‌ అది అంటున్నారు.  

ఈ పురాతన నాగరికత బొలీవియాలోని ‘ప్యూర్టా డెల్ సోల్‌‌’ సిటీలో ఉంది. ఈ సిటీని ‘తివనాకు’ అని కూడా పిలుస్తుంటారు. ఈ నాగరికత ప్రజల గురించి ఆధారాలు ఎక్కువగా దొరక్కపోవడం వల్ల వివరాలు పెద్దగా తెలుసుకోలేకపోయారు. ఇక్కడి ప్రజలది ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఈ నాగరికత ‘టిటికాక’ సరస్సు ఒడ్డున క్రీస్తు పూర్వం 14 వేల ఏండ్ల నుంచి క్రీస్తు శకం 900  ఏండ్ల మధ్య డెవలప్ అయిందనేది ఒక అంచనా. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ నాగరికత కచ్చితమైన వయసును ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. వీళ్ల కాలంలోనే ఇక్కడ కొన్ని కట్టడాలు కట్టారు. కానీ.. వాటిలో ఇప్పటి వరకు ఉన్నది గేట్‌‌ ఆఫ్‌‌ ది సన్ మాత్రమే. ఒక పెద్ద రాయిని చెక్కి, ఈ సన్‌‌ గేట్‌‌ని తయారుచేశారు. ఆ తర్వాత దానిపై కొన్ని వివరాలు చెక్కారు. దీని ఎత్తు 13 అడుగులు. వెడల్పు 9.8 అడుగులు. బరువు దాదాపు10 టన్నులకు పైనే ఉంటుంది. దీన్ని ఎందుకు నిర్మించారు? దాని మీద ఉన్న రాతలకు అర్థం ఏంటనేది ఇప్పటికీ మిస్టరీనే.

క్యాలెండర్‌‌‌‌

కొంతమంది ఆర్కియాలజిస్ట్‌‌లు ఈ గేట్‌‌పై ఉన్నది తివనాకు క్యాలెండర్‌‌ అని చెప్తున్నారు. కాకపోతే వాళ్ల లెక్క ప్రకారం ఏడాదికి 365 రోజులకు బదులు 290 రోజులు ఉన్నాయి. ఒక ఏడాదిని పన్నెండు చక్రాలుగా డివైడ్‌‌ చేశారు. అంటే పన్నెండు నెలలు అన్నమాట. ఒక్కో నెలకు 24 రోజులు ఉంటాయి. కానీ.. ఈ వాదనను చాలామంది ఆర్కియాలజిస్ట్‌‌లు కొట్టిపారేస్తున్నారు. 

గ్రహాంతరవాసుల కోసం

ఒకప్పటి వ్యోమగాములు చెప్పిన సిద్ధాంతం ప్రకారం.. అప్పటి ప్రజలు గ్రహాంతరవాసులు ఉన్నారని, వాళ్లు అప్పడప్పుడు భూమ్మీదకు వస్తారని నమ్మేవాళ్లు. అయితే.. వేరు వేరు గ్రహాల నుంచి వచ్చేవాళ్లు భూమ్మీద వేరు వేరు ప్రాంతాల్లో దిగుతారు. అందుకే వాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక గేట్‌‌ని ఏర్పాటు చేశారు. అదే ఈ సన్‌‌ గేట్‌‌. తర్వాత ఏ గ్రహం నుంచి ఏలియన్స్ వచ్చినా ఈ గేట్‌‌ నుంచే భూమ్మీద కాలు పెడతాయని అప్పటి ప్రజలు నమ్మారు.  

సరస్సు తీరంలో 

తివనాకులో ఓడరేవు కూడా ఉండేది. ఆ ఓడరేవుకి ఈ ‘సన్ గేట్’ ద్వారమని కొందరు నమ్ముతున్నారు. ఆర్కియాలజిస్ట్‌‌లు ఇక్కడి మట్టి, రాళ్లలో చారలు, గుర్తులను స్టడీ చేసి,  ఒకప్పటి వాతావరణ పరిస్థితులను అంచనా వేశారు. ఇప్పుడు సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తులో తివానాకు 12 మైళ్ల దూరంలో ఉన్న ‘‘టిటికాక” సరస్సు ఒకప్పుడు ఈ సిటీకి ఆనుకుని ఉండేది. ఇది ఒక ఓడరేవు నగరం. ఈ సరస్సు ఒకప్పుడు చాలా పెద్దది. కానీ.. వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు చిన్నగా మారిపోయింది. అయితే.. దీన్ని నౌకాశ్రయానికి ద్వారమని చెప్తున్న ఆర్కియాలజిస్ట్‌‌లు అందుకు తగ్గ ఆధారాన్ని ఒక్కటి కూడా చూపించలేకపోయారు. 

ఏముంది? 

సన్ గేట్ పైభాగంలో రాతితో చెక్కిన ఒక బొమ్మ ఉంది. దానికి పలకలాంటి ముఖం, బలమైన శరీరం, చేతులు ఉన్నాయి. చేతుల్లో రెండు నిలువు చెక్క ముక్కల్లాంటివి ఉన్నా అవి దేనితో తయారుచేశారనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఈ బొమ్మ ఎవరిదనేది ఆర్కియాలజిస్ట్‌‌లు సైంటిఫిక్‌‌గా చెప్పలేకపోయారు. కొందరు మాత్రం ‘ఇంకా’ నాగరికత సృష్టికర్త అయిన ‘వెలకోచా’ విగ్రహం అని చెప్పారు. పురాణాల ప్రకారం ఇంకా దేవుళ్ళలో వెలకోచా చాలా గొప్పవాడు. అతనే ‘ఇంకా’ ప్రజలు పూజించే ఇతర దేవుళ్ళందరినీ సృష్టించాడు. కానీ.. ఆ బొమ్మ తల చుట్టూ ఉన్న చారలను బట్టి అతను సూర్య భగవానుడు కావచ్చని మరికొందరు చెప్తున్నారు. ఆ చారలు సూర్యరశ్మి కావచ్చని అంచనా వేస్తున్నారు. మరికొందరేమో ‘‘అవి సూర్యకిరణాలు కావు. దేవుడు ఒకరకమైన ఇంటర్ డైమెన్షనల్ ప్యాసేజ్‌‌ ద్వారా మరో గ్రహంలోకి వెళ్లాడని చెప్పడానికి సూచనగా ఇలా చెక్కార’’ని చెప్పారు. కొందరేమో దీనికి ‘‘క్రైయింగ్ గాడ్” అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆ బొమ్మ ముఖం మీద కన్నీటి చారికలు ఉన్నాయి. 

ఒకే రాయి

ఈ గేట్‌‌ ఒక ఏకశిలా నిర్మాణం. ఇది ఆండియన్ రాయి. దీనికి ఒక్క అతుకు కూడా లేదు. కానీ.. అక్కడక్కడ పగుళ్లు వచ్చాయి. ఈ రకమైన రాయి ఆండీస్ పర్వతాల్లోని అగ్నిపర్వత శిలల వల్ల ఏర్పడుతుంది. దీని కాలానికి సంబంధించిన వివరాలు కూడా సరిగ్గా దొరకలేదు. దీన్ని16,000 ఏండ్ల కంటే ముందే చెక్కారనేది అంచనా. కొందరు మాత్రం ఇది 1,500 ఏండ్ల నాటిదని వాదిస్తారు. సరస్సు కింద నగర శిథిలాలు ఉన్నాయని.. ఆ నగరానికి ఇది ఎంట్రన్స్ అని మరికొందరు చెప్తున్నారు. ఇలా ఈ గేటు గురించి అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. కానీ.. వాటిలో నిజానిజాలను ఆర్కియాలజిస్ట్‌‌లు కూడా తేల్చలేకపోతున్నారు. అందుకే ఈ గేట్‌‌ చరిత్ర ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.