రాముడి కళ్యాణానికి సిద్ధమవుతున్న తలంబ్రాలు

రాముడి కళ్యాణానికి సిద్ధమవుతున్న తలంబ్రాలు

భద్రాద్రి ఆలయంలో ఏటా సీతారాముల కల్యాణం కమనీయంగా జరుగుతుంది. ఈ వేడుకకు ఉపయోగించే తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. గోటితో కోటి అక్షింతలను తీస్తారు. ఈసారి కూడా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఆ పని జరుగుతోంది. ప్రతి యేటా భద్రాచలంతోపాటు ఒంటిమిట్ట రామాలయానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందిస్తారు. ఇందుకోసం స్వయంగా రామ పంటను పండిస్తుంటారు. 3 నెలలు కష్టపడి పంట పండిస్తారు. 8 వందల కేజీలు బియ్యాన్ని గోటితో వలుస్తారు శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు. అలా కోటి తలంబ్రాలను తయారు చేస్తున్నారు. వీటి తయారీలో 60 గ్రామాల్లోని రామభక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.

వేరే రాష్ట్రాల్లో ఉంటున్న కొందరు రామ భక్తులు కూడా తలంబ్రాలు వలిచే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. 2 వందల గ్రాముల ప్యాకెట్ల రూపంలో వడ్లను వారికి పంపిస్తున్నారు. ఈ ఏడాది కూడా కోటి తలంబ్రాల కార్యక్రమం ప్రారంభం కావడంతో సీతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాచలం సీతారామ కళ్యాణానికి 11 ఏళ్లుగా కోటి తలంబ్రాలు అందిస్తున్నారు శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు. గత 6 ఏళ్ల నుంచి ఒంటిమిట్ట శ్రీరామనవమికీ కూడా కోటి తలంబ్రాలను అందిస్తున్నట్టు చెప్పారు.