వీఐపీ దర్శనాలకు స్పెషల్​ టైమింగ్స్​

వీఐపీ దర్శనాలకు స్పెషల్​ టైమింగ్స్​
  • ఆఫీసర్ల చర్యలతో సాధారణ భక్తులకు తప్పనున్న ఇక్కట్లు
  • ఈసారి వీఐపీ దర్శనాలకు స్పెషల్​ టైమింగ్స్​ 
  • గవర్నర్, సెంట్రల్​ మినిస్టర్లు, సీఎం తప్ప  మిగతా వారంతా పాటించాల్సిందే
  • పాస్​లు ఇవ్వనున్న ఆఫీసర్లు 

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: మేడారం మహాజాతర సమయంలో సమ్మక్క, సారక్కలను దర్శించుకునేందుకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర వీఐపీలకు సెపరేట్​టైమింగ్స్​ కేటాయించాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే దేవాదాయ, గిరిజనాభివృద్ధి శాఖ మినిస్టర్లతో చర్చించారు. ప్రత్యేక టైమింగ్స్​ కేటాయించడం వల్ల సాధారణ భక్తులు కేవలం రెండు గంటల్లోనే అమ్మవార్లను దర్శించుకుని బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు.  

16 నుంచి19 వరకు జాతర
మేడారం మహాజాతర ఫిబ్రవరి16 నుంచి 19వ తేదీవరకు జరగనుంది. దీనికి దేశ విదేశాల నుంచి సుమారు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని సర్కారు భావిస్తోంది. భక్తుల సౌలతుల కోసం రూ.75 కోట్లతో డెవలప్​మెంట్​పనులు చేస్తోంది. అయితే ఎన్ని కోట్లు ఖర్చుచేసినా సాధారణ భక్తుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రతిసారి అమ్మవార్ల దర్శనానికి సుమారు నాలుగు గంటలకు పైగా టైం పడుతోంది. పిల్లలు, ముసలివాళ్లతో కలిసి అంతసేపు క్యూలైన్లలో వెయిట్​ చేయడం కష్టమవుతోంది. క్యూలైన్లలో ఉండేవారికి టాయిలెట్స్, లాట్రిన్స్​ అందుబాటులో ఉండవు. మధ్యమధ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర వీవీఐపీల దర్శనాల వల్ల మరింత ఆలస్యమవుతోంది. ఒక్కోసారి గంట, రెండు గంటల పాటు క్యూలైన్లను ఆపేస్తుంటారు. గద్దెలపైకి భక్తులు బెల్లం, కొబ్బరికాయలు విసిరితే వీవీఐపీలకు తగిలే ప్రమాదం ఉందని  భక్తులను లోపలికే రానివ్వకుండా ఆపేస్తారు. ఈ నేపథ్యంలో అన్ని గంటల పాటు లైన్లలో ఉండకుండా చూడాలని ఆఫీసర్లు ప్లాన్​ చేస్తున్నారు. 

వీఐపీల దర్శనానికి టైమింగ్స్​ 
జాతర జరిగే రోజుల్లో 9 వేల మంది వరకు వీఐపీలు, 3 వేల మంది వరకు వీవీఐపీలు వస్తుంటారు. సారలమ్మ, సమ్మక్క తల్లులు గద్దెకు చేరిన రోజుల్లో వీరి తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో వీఐపీలందరికీ స్పెషల్​టైమింగ్స్​ కేటాయిస్తూ దర్శనం పాస్‌‌లతో పాటు వెహికిల్స్‌‌ పాస్‌‌లు ఇవ్వనున్నారు. ఇందులో డేట్​, టైమ్ ​మెన్షన్ ​చేస్తారు. సీఎం కేసీఆర్‌‌, గవర్నర్‌‌, ఇతర సెంట్రల్‌‌ మినిస్టర్లు తప్ప మిగిలిన వీఐపీలు ఎవరొచ్చినా  ఆఫీసర్లు నిర్ణయించిన టైమ్‌‌లోనే అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని ఇటీవల జరిగిన సమీక్షలో దేవాదాయ, గిరిజనాభివృద్ధి శాఖ మినిస్టర్లు ఇంద్రకరణ్‌‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌‌ ఆదేశించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చెప్పిన టైమ్​కు వచ్చేవారికే పర్మిషన్‌‌ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో జిల్లా ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

నెల ముందే పాస్​లు ఇస్తాం
మేడారం వచ్చే వీవీఐపీ, వీఐపీలకు నెల రోజుల ముందే వెహికిల్‌‌, దర్శనం పాసులు ఇస్తాం.  పాస్‌‌ల తయారీ, పంపిణీ బాధ్యతలను అడిషనల్‌‌ కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠికి అప్పగించాం. సంక్రాంతి తర్వాత పాస్‌‌లు ఇస్తాం. మహాజాతర జరిగేప్పుడు సాధారణ భక్తులు కేవలం రెండు గంటల్లోనే అమ్మవార్లను దర్శించుకొని తిరిగి వెళ్లిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 
– కృష్ణ ఆదిత్య, ములుగు జిల్లా కలెక్టర్‌‌