
ఎంఎస్ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటి నుంచి పలువురు క్రికెటర్లు స్పందిస్తూనే ఉన్నారు. ధోనీతో తమకున్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటున్నారు. మహీ ఎంత గొప్ప వ్యక్తో చెబుతున్నారు. ఇదే తరహాలో ఇండియా స్పిన్నర్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్ ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. మాజీ కెప్టెన్ తో తనకున్న అనుబంధాన్ని వీడియోలో చెప్పిన అశ్విన్. . మహీ టెస్టులకు వీడ్కోలు చెప్పినప్పుడు ఏం జరిగిందో తెలిపాడు. లాంగ్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజు రాత్రంతా మహీ తన జెర్సీని తీయలేదని, కన్నీరు కూడా పెట్టుకున్నాడని చెప్పాడు. ‘2014లో ధోనీ టెస్టులకు గుడ్బై చెప్పడం నాకింకా గుర్తుంది. ఆస్ట్రేలియాతో మెల్ బోర్న్ లో జరిగిన ఆ మ్యాచ్ ను కాపాడుకునేందుకు నేను, ధోనీ కలిసి క్రీజులో చాలాసేపు పోరాడాం. కానీ చివరికి మ్యాచ్ కోల్పోయాం. ఫలితం తేలిన వెంటనే స్టంప్ తీసుకుని డ్రెస్సింగ్ రూమ్కు వచ్చిన ధోనీ.. తానిక టెస్టులు ఆడానని చెప్పాడు. ఆ సమయంలో చాలా ఎమోషనల్గా ఉన్నాడు. నేను, రైనా, ఇషాంత్ ఆ రోజు సాయంత్రం అతని రూమ్లోనే ఉన్నాం. ఆ రాత్రంతా ధోనీ తన జెర్సీని విప్పలేదు. కన్నీళ్లు పెట్టుకోవడం కూడా చూశా’ అని అశ్విన్ వెల్లడించాడు.
ఆ సలహా ఇప్పటికీ పాటిస్తున్నా
ధోనీ కెప్టెన్సీలో సీఎస్కేకు ఆడినప్పుడే అతనిలోని తిరుగులేని నాయకుడిని గుర్తించానని అశ్విన్ తెలిపాడు.‘చాంపియన్స్ లీగ్ సందర్భంగా మహీ ఇచ్చిన సలహాని ఇప్పటికీ పాటిస్తున్నా. 2010 చాంపియన్స్ లీగ్లో బుష్రేంజర్స్ తో జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లింది. ఆ ఓవర్ నేనే వేశా. మా జట్టు మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఓవర్ వేయడానికి ముందు ధోనీ నాకు చెప్పిన మాట ఎప్పటికీ మరచిపోలేను. ఇంత ఒత్తిడిలో నువ్వు నీ బెస్ట్ డెలివరీ వెయ్యలేవు. అందువల్ల నీ బలమైన క్యారమ్ బాల్నే నమ్ముకో అని సూచించాడు. దాంతో అతనిపై ఉన్న గౌరవం పెరిగింది. అంతేకాక నాలో చాలా నైపుణ్యం ఉందని దానికి ఎప్పటికప్పుడు పదును పెట్టుకోమని చెప్పాడు. ఈ సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా’ అని అశ్విన్ చెప్పాడు.
For More News..