స్పోర్ట్స్ హబ్గా వరంగల్! జాతీయ స్థాయి క్రీడల పోటీలకు వేదికగా సిటీ

స్పోర్ట్స్ హబ్గా వరంగల్! జాతీయ స్థాయి క్రీడల పోటీలకు వేదికగా సిటీ
  • అథ్లెటిక్స్ తో పాటు వివిధ క్రీడాంశాల్లో ఆతిథ్యం 
  •     రేపటి నుంచి 58వ జాతీయస్థాయి ఖోఖో పోటీలు
  •     స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నిర్మిస్తే ఉమ్మడి జిల్లా క్రీడాకారుల కల సాకారం
  •     హామీ మేరకు స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతోన్న కాంగ్రెస్ ప్రభుత్వం 

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీ స్పోర్ట్స్ హబ్ గా మారుతోంది. జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే అథ్లెటిక్స్ తో పాటు వివిధ నేషనల్ లెవల్ గేమ్స్ జరిగాయి. మరో మెగా ఈవెంట్ కు రెడీ అవుతోంది. సోమవారం నుంచి కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ జాతీయస్థాయి ఖోఖో ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఓ వైపు జాతీయస్థాయి క్రీడలకు వేదికగా వరంగల్ సిటీ నిలుస్తుండగా, ఇప్పటికే మంజూరైన స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వస్తే స్పోర్ట్స్ హబ్ గానూ రూపుదిద్దుకోనుంది.  

జాతీయస్థాయి పోటీలకు వేదికగా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. పాతతరంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్స్ కోచ్ గా పనిచేసిన నాగపురి రమేశ్, అర్జున అవార్డు గ్రహీత జమ్మలమడక పిచ్చయ్య.. నేటితరంలో చెస్ దిగ్గజం అర్జున్ ఎరిగైసి, పారా అథ్లెట్ దీప్తి జీవాంజీ.. ఇలా మరెందరో క్రీడాకారులకు పుట్టినిల్లుగా ఉంది. హనుమకొండలో జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం మాత్రమే ఉండగా సరైన వసతులు లేవు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల ఈవెంట్లు హైదరాబాద్ లో జరిగేవి. ఓరుగల్లును స్పోర్ట్స్ హబ్ చేస్తామనే హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దృష్టిసారించింది. క్రీడలకు తగిన సదుపాయాలను కల్పిస్తోంది. దీంతో వరుసగా జాతీయ స్థాయి ఈవెంట్లకు ఓరుగల్లు వేదికవుతోంది. గతంలో 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ హనుమ కొండలోని జేఎన్ఎస్ లో జరిగింది. గతేడాది జనవరిలో34వ జాతీయస్థాయి సీనియర్ సెపక్ తక్రా ఛాంపియన్ షిప్, గత అక్టోబర్ లో నేషనల్ అండర్-– 23 అథ్లెటిక్స్ పోటీలు కూడా జరిగాయి.  

రేపటి నుంచి జాతీయస్థాయి ఖోఖో పోటీలు

ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో 58వ జాతీయస్థాయిలో ఖోఖో పోటీలు ఈనెల11 నుంచి 15వ తేదీ వరకు కాజీపేట రైల్వే స్టేడియంలో జరగనున్నాయి. రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలు, వివిధ విభాగాలకు చెందిన 79 జట్లు వస్తున్నాయి.  ఇందులో 40 పురుషులు, 39 మహిళల జట్లు ఉన్నాయి. అదేవిధంగా 2 వేల మంది వరకు క్రీడాకారులు, టెక్నికల్ స్టాఫ్, ఆఫీసర్లు రానున్నారు. పోటీలను పగలు, రాత్రి నిర్వహించేందుకు స్టేడియంలో 8 ప్రాంతాల్లో ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేశారు. 4 సింథటిక్, రెండు క్లే కోర్టులను సిద్ధం చేస్తున్నారు.

స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియంతో కల సాకారం

ఓరుగల్లును స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతామన్న కాంగ్రెస్ సర్కార్ హామీ మేరకు స్పోర్ట్స్ స్కూల్ తో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియాన్ని కూడా మంజూరు చేసింది. వరంగల్ రింగ్ రోడ్డు పక్కనే ఉనికిచెర్ల శివారులోని సర్వే నెం.325లోని 20 ఎకరాల్లో స్పోర్ట్స్ స్కూల్, మరో 30 ఎకరాల ప్రభుత్వ భూమిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి నిర్ణయించింది. ఇప్పటికే పర్మినెంట్ స్ట్రక్చర్ ఏర్పాటయ్యే వరకు స్పోర్ట్స్ స్కూల్ ను హనుమకొండలోని జేఎన్ఎస్ లో నిర్వహిస్తోంది. త్వరలోనే క్రికెట్ స్టేడియంతో పాటు స్కూల్ కు కూడా శాశ్వత బిల్డింగ్ నిర్మించనుంది. ఓరుగల్లు స్పోర్ట్స్ హబ్ గా రూపొందితే.. ఉమ్మడి జిల్లా క్రీడాకారుల కల నెరవేరుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.