రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ

రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ
  • ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా పేరు  
  • హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం పరిశీలన 
  • కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీ తరహాలో ఏర్పాటుకు సర్కార్ యోచన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ అని పేరు పెట్టనున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ (ఫోర్త్ సిటీ)లో నిర్మించే స్పోర్ట్స్ హబ్​కు సపోర్ట్​గా స్పోర్ట్స్​యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. ఈ మేరకు సీఎం కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. 

యూనివర్సిటీ ఏర్పాటుకు హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌‌‌‌ను పరిశీలిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే క్యాంపస్​లో ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో సౌలతులు కల్పించాలని నిర్ణయించారు. కాగా, ఫోర్త్ సిటీలో నిర్మించే స్పోర్ట్స్ హబ్​లో 12 క్రీడలకు సంబంధించి అకాడమీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటిలో అంతర్జాతీయ స్థాయిలో సౌలతులు కల్పిస్తారు. అలాగే స్పోర్ట్స్ సైన్స్ సెంటర్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నారు.   

సౌత్ కొరియా సహకారంతో..

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సౌత్ కొరియాలో పర్యటించారు. అక్కడ కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు. ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇటీవల పారిస్​లో జరిగిన ఒలింపిక్స్‌‌‌‌లో సౌత్ కొరియా మొత్తం 32 పతకాలు గెలుచుకోగా, అందులో 16 పతకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే ఉన్నాయి. ఈ వర్సిటీలో శిక్షణ పొంది, పారిస్ ఒలింపిక్స్‌‌‌‌లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించిన అథ్లెట్ లిమ్ సి-హైయోన్‌‌‌‌ను సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభినందించారు. భవిష్యత్ ఒలింపిక్స్​ చాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.