గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

గజ్వేల్‌‌లో స్పౌజ్ టీచర్ల ఆవేదన సభ

గజ్వేల్, వెలుగు: ‘‘భర్త ఒక చోట.. భార్య మరొక చోట.. పిల్లలు, తల్లిదండ్రులు మరొక చోట.. ఐదు నెలలుగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నం. సారూ.. జర స్పందించండి. స్పౌజ్ బదిలీలు చేపట్టండి” అని టీచర్లు విజ్ఞప్తి చేశారు. ఇప్పటిదాకా వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయ స్పౌజ్ బాధితులు.. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గాన్ని ఈసారి వేదికగా చేసుకుని తమ ఆవేదనను వినిపించారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మిగిలిన 13 జిల్లాల్లో కూడా స్పౌజ్ బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గజ్వేల్‌‌లో స్టేట్ స్పౌజ్ ఫోరమ్ ఆధ్వర్యంలో ఆవేదన సభ నిర్వహించారు. స్పౌజ్ బదిలీలకు దరఖాస్తులు స్వీకరించినా సమస్యను పరిష్కరించట్లేదని, కొద్ది రోజుల్లో బడులు ప్రారంభం అవుతున్నాయని, తమ గోడును వినిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి టీచర్లు, వారి కుటుంబ సభ్యులు వచ్చారు.

తీవ్ర ఇబ్బందులు
ప్రభుత్వ జీవో 317 ప్రకారం ఉపాధ్యాయ స్పౌజ్ బదిలీలకు ఇటీవల దరఖాస్తులను స్వీకరించారు. హోల్డ్‌‌‌‌‌‌‌‌లో పెట్టిన 13 జిల్లాల నుంచి దాదాపు 2,500 మంది ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సర్కారు స్పష్టత ఇవ్వలేదు. స్కూళ్లు మొదలుకానున్నందున రాష్ట్రంలోని 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు నిలిచిపోవడం వల్ల టీచర్ల కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భర్త ఒక జిల్లాలో, భార్య మరో జిల్లాలో విధులు నిర్వహించాల్సి వస్తున్నది. భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేయడం కోసం రోజూ 100 నుంచి 300 కి.మీ. వరకు ప్రయాణం చేసి విధులకు హాజరు కావాల్సి వస్తున్నది. దీంతో పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులను చూసుకోవడం కష్టంగా మారింది. దూర ప్రయాణాలు చేసి డ్యూటీకి వెళ్తుండటం వల్ల బోధనపైనా తీవ్ర ప్రభావం పడుతోందని టీచర్లు చెబుతున్నారు.

మంత్రుల చుట్టూ తిరుగుతున్నా..
స్టౌజ్ బదిలీలకు ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇస్తుందో తెలియక టీచర్లు 5 నెలలుగా గందరగోళానికి గురవుతున్నారు. ఈ వేసవి సెలవులు ముగిసేలోగా సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. కానీ సర్కారు వైపు నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళన బాట పట్టారు. మరోవైపు ప్రజా ప్రతినిధులు, మంత్రుల చుట్టూ సమస్య పరిష్కారం కోసం తిరుగుతున్నా ఫలితం మాత్రం రావడం లేదు. దీంతో తమ సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం కోసం గజ్వేల్ వేదికగా ఆవేదన సభ నిర్వహించారు. స్టేట్ స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు ఖాదర్, త్రివేణి, అర్చన, మమత, గడ్డం కృష్ణ, బాలస్వామి, మహేశ్, నరేశ్, ప్రవీణ్, మల్లికార్జున్, చంద్రశేఖర్, దామోదర్, ప్రభాకర్ ఇందులో పాల్గొన్నారు.

రోజూ 120 కిలోమీటర్లు పోతున్న
అంతర్ జిల్లా బదిలీల్లో సర్వీస్ పోగొట్టు కోవడం వల్ల సీనియర్ అయినా కూడా వేరే జిల్లాకు మారిన తర్వాత జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నేను ఉంటున్న ప్రాంతం నుంచి పనిచేసే ప్రదేశానికి రోజు 120 కిలోమీటర్లు ప్రయాణించి డ్యూటీకి హాజరైతున్న. 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలను హోల్డ్‌‌‌‌‌‌‌‌లో పెట్టడం వల్ల నాలాంటి అనేక మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు.
- ప్రేమ్ కుమార్, టీచర్, పెద్దశంకరం పేట

సరిగ్గా నిర్ణయం తీసుకోలే
317 జీవో వల్ల నర్సాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదిలీ అయ్యాను. డ్యూటీకి అంత దూరం వెళ్లి వస్తుండటంతో పిల్లలను చూసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నయ్. స్పౌజ్ బదిలీల విషయంలో అధికారులు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల వందల కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నాయి. స్పౌజ్ బదిలీలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీస్కోవాలె. 
- రమాదేవి, టీచర్, మెదక్ జిల్లా