కుట్రలో భాగంగా ఇరికించారు..బెయిలివ్వండి..హైకోర్టులో శ్రవణ్‌‌కుమార్‌‌ రావు పిటిషన్‌‌

కుట్రలో భాగంగా ఇరికించారు..బెయిలివ్వండి..హైకోర్టులో శ్రవణ్‌‌కుమార్‌‌ రావు పిటిషన్‌‌

హైదరాబాద్, వెలుగు: కుట్రలో భాగంగా వాణిజ్యపరమైన వివాదాన్ని క్రిమినల్‌‌ కేసుగా మార్చి తనను అక్రమంగా అరెస్ట్‌‌ చేశారని, బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో శ్రవణ్‌‌కుమార్‌‌రావు పిటిషన్‌‌ దాఖలు చేశారు. ఒక ప్రైవేటు సంస్థను మోసం చేశారనే ఆరోపణలతో ఫోన్‌‌ట్యాపింగ్‌‌ కేసులో నిందితుడైన శ్రవణ్‌‌రావును ఇటీవల పోలీసులు అరెస్ట్‌‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రవణ్‌‌కుమార్‌‌రావు హైకోర్టులో పిటిషన్‌‌ వేశారు. 

అఖండ ఇన్‌‌ఫ్రాటెక్‌‌ ఇండియా లిమిటెడ్‌‌కు, ఎకోర్‌‌ ఇండస్ట్రీస్‌‌ మధ్య జరిగిన లావాదేవీల్లో తన పాత్ర లేదని పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆ రెండు కంపెనీల మధ్య వాణిజ్య వివాదం పరిష్కారమైందన్నారు. దీంతోపాటు ఈ వివాదం సివిల్‌‌ కోర్టులో ఉందని, అక్కడ దాఖలు చేసిన పిటిషన్‌‌లో ఇక్కడ చేసిన ఆరోపణలను ప్రస్తావించలేదన్నారు. 

అంతేగాకుండా.. ఆరోపణల ప్రకారం ఏడేండ్లలోపే శిక్ష పడే నేరమని, దీని ప్రకారం ఆర్నేష్‌‌కుమార్‌‌ కేసులో సుప్రీం కోర్టు తీర్పు మేరకు బెయిల్ మంజూరు చేయాల్సి ఉందన్నారు. అయితే, కింది కోర్టు పట్టించుకోకుండా రిమాండ్‌‌కు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మరో క్రిమినల్‌‌ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులు సమర్పించడానికి పిలిపించి, ఈ కేసులో అరెస్ట్‌‌ చేశారన్నారు. కుట్రపూరితంగా నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేయాలని శ్రవణ్ కుమార్ హైకోర్టును తన పిటిషన్ ద్వారా కోరారు.