ఆరెంజ్ ఆర్మీ కేరింతలతో సోమవారం ఉప్పల్‌స్టేడియం దద్దరిల్లిపోయింది. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ ఫ్యాన్స్ కు సిసలైన ‘పైసా వసూల్’ వినోదాన్ని పంచింది. తొలుత బ్యాటింగ్‌లో హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులతో ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాదుతుంటే గ్యాలరీల్లో అభిమానులు గంతులేశారు. బౌలింగ్‌లో కొత్త సెన్సేషన్ ప్రఫుల్ హింజ్ తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి మ్యాజిక్ చేయడంతో స్టేడియం హోరెత్తిపోయింది. మొత్తానికి ఉప్పల్ గడ్డపై మనోళ్లు మళ్లీ పంజా విసరడంతో ఆరెంజ్ ఆర్మీ సంబరాలు అంబరాన్నంటాయి.
కొత్త ఎంట్రీ సిస్టం సక్సెస్
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణలో పోలీసు శాఖ, హెచ్‌సీఏ చేపట్టిన ఎంట్రీ సిస్టం సక్సెస్ అయ్యింది. ఈసారి ప్రవేశపెట్టిన డిజిటల్ టికెట్లు, క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం సూపర్ హిట్ అవ్వడంతో గతంలో నెలకొనే తోపులాటలు, గందరగోళానికి చెక్ పడింది. గేట్ల వద్ద వెయిటింగ్ లేకుండా ఫ్యాన్స్ ఈజీగా స్టేడియంలోకి ప్రవేశించారు.
ట్రాఫిక్ కష్టాలకు చెక్..
గత మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకొని ఓ మహిళా రోగి మృతి చెందిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఈసారి పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించారు. మ్యాచ్ కోసం భారీ భద్రతతో పాటు వ్యూహాత్మక ట్రాఫిక్ డైవర్షన్లు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం నుంచే భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించడంతో, స్టేడియం పరిసరాల్లో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా సాఫీగా వాహనాల రాకపోకలు సాగాయి.

