
ఎన్ని రాళ్లు వెనకేసుకున్నా.. కడుపుకు నాలుగు గింజలు లేకుంటే ఏం ఫాయిదా! ఇప్పుడు శ్రీలంక అట్లాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. రావణుడేలిన ఆనాటి బంగారు రాజ్యం.. ఆకలి రాజ్యమైంది. ఆహార సంక్షోభంలో చిక్కుకుపోయి.. ‘‘అన్నమో రావణా” అంటూ అరిగోస తీస్తున్నది. పైసల్లేక ఖాయిలా పడిపోయి ఎమర్జెన్సీని నమ్ముకుంది. జనం తిండికి కట్టుబాట్లు పెట్టింది గవర్నమెంట్. ఈ కష్టం నుంచి బయటపడేసే ‘‘సంజీవని” కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నది. అంత పెద్ద తక్లీఫ్కు ఒక్కటి కాదు.. చేతి వేళ్ల మీద లెక్కపెట్టలేనన్ని కారణాలున్నాయి.
కొలంబో రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ప్రజలు గుమిగూడారు. ఏ కిరాణా షాపు ముందు చూసినా వాళ్లే. సూపర్ మార్కెట్ల ముందు పెద్ద పెద్ద క్యూలు కట్టారు. ఏంటా అని చూస్తే వాళ్లంతా సరుకులు కొనడానికి వచ్చారు. క్యూలో అయితే ఉన్నారు కానీ, కొనడం అంటే మాటలా! ధరలు అందనంత ఎత్తుకు పోయాయి. కిలో చక్కెర 230 శ్రీలంక రుపీలకు అమ్ముతున్నారు.కందిపప్పు ధర 300 రుపీలకు పైమాటే. అయినా కొనక తప్పదని, ఇకపై సరుకులు దొరకవేమో అని.. పొదుపు చేసుకున్న డబ్బులన్నీ ఖర్చు చేసి, ఉన్నదంతా ఊడ్చేసి సరుకులు కొనుక్కొని దాచుకుంటున్నారు. కొన్ని నిత్యావసర సరుకుల ధరలు రెండింతలయ్యాయి. కొన్ని చోట్ల రెండింతలు పెట్టి కొనేందుకు రెడీగా ఉన్నా సరుకులు దొరకట్లేదు. నో స్టాక్ బోర్డ్‌లు కనిపిస్తున్నాయి.
శ్రీలంకలో కొన్నాళ్ల నుంచి ఫుడ్ క్రైసిస్ ఉంది. ఎకనమికల్‌గా బాగా వీక్ అయ్యింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు అడుగంటిపోయాయి. ఆహారం నిల్వలు తగ్గిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఈ ఏడాది ఆగస్టు చివరన ఆ దేశ ప్రెసిడెంట్ గోటబయ రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తూ పార్లమెంట్లో ‘‘ఎమర్జెన్సీ రెగ్యులేషన్స్ ఫర్ ద సప్లై ఆఫ్ ఎసెన్షియల్ ఫుడ్స్” చట్టాన్ని పాస్ చేశారు. అయితే, ఈ చట్టాన్ని ఏదో ఆదరాబాదరాగా అప్పటికప్పుడేం ప్రవేశపెట్టలేదు. రెండేండ్ల నుంచే ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిందని అక్కడి ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. విదేశీ నిల్వలు కరిగిపోవడం, రైతులు ఆర్గానిక్ పంటల సాగుకు మళ్లడం, అప్పులు ఎక్కువైపోవడం, పన్నులు తగ్గించడం, దిగుమతులను బంద్ పెట్టడం వంటి కారణాలన్నీ ఆ దేశ ఆహార సంక్షోభానికి దారితీశాయి.
అప్పుల ముల్లె
అభివృద్ధి చెందిన అమెరికా లాంటి మహా సామ్రాజ్యమైనా అప్పులు చేయాల్సిందే. అయితే, దానికీ ఓ హద్దంటూ ఉంటుంది. కానీ, శ్రీలంక విషయంలో మాత్రం తీర్చలేనంత భారంగా మారిపోయాయి అప్పులు. దేశ జీడీపీలో 101 శాతం అప్పులున్నాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022 నాటికి అది 108 శాతానికి పెరిగే ప్రమాదమూ ఉందంటున్నారు అక్కడి ఎకానమీ ఎక్స్‌పర్ట్స్. అంటే ఆ దేశం నడవాలంటే పూర్తిగా అప్పులే చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికే 2,900 కోట్ల డాలర్ల అప్పుల్లో కూరుకుపోయింది. 2022–2025 మధ్య విదేశీ బాకీలను తీర్చేందుకే ఏటా 400 కోట్ల డాలర్ల నుంచి 500 కోట్ల డాలర్లు కట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. దానివల్ల దేశ సంపద మొత్తం బయటి దేశాలకే తరలిపోతోందని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. 2019లో 750 కోట్ల డాలర్లున్న విదేశీ కరెన్సీ నిల్వలు 280 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ ఏడాది జులైలో అప్పులకే ఆ దేశం 100 కోట్ల డాలర్లను చెల్లించింది. దానికి తోడు శ్రీలంక రుపీతో డాలర్ మారకం విలువ భారీగా పెరగడమూ.. దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడానికి కారణమైంది. ఈ ఏడాది శ్రీలంక రుపీ విలువ డాలర్‌తో పోలిస్తే 10 శాతం దాకా పెరిగింది. ప్రస్తుతం ఒక డాలర్ దాదాపు 200 శ్రీలంక రుపీల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఒకప్పుడు డబ్బులు తక్కువపడితే బాండ్లను జారీ చేసేది. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉండడంతో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి కూడా అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు. అప్పుడప్పుడు చైనా, బంగ్లాదేశ్‌లతో కరెన్సీ స్వాపింగ్ చేసుకుని గట్టెక్కేది. అయితే దానికీ దేశం ఎక్కువే చెల్లించుకునేది. తక్కువ రీపేమెంట్ టైం, ఎక్కువ వడ్డీలతో చాలా నష్టపోయేది. కిందటేడాది మన దేశంతో వంద కోట్ల డాలర్ల మేర కరెన్సీ స్వాపింగ్ చేసుకుంది.
ఐఎంఎఫ్ కొంత ఆదుకున్నా..
కొవిడ్ లాక్డౌన్ల తర్వాత తిరిగి పుంజుకునేందుకు చాలా దేశాలకు ఐఎంఎఫ్ సాయం చేసింది. ఆ క్రమంలోనే శ్రీలంకకూ చేదోడుగా నిలిచింది. అందులో భాగంగా 78.7 కోట్ల డాలర్లను అందించింది. ఇటు దేశ సెంట్రల్ బ్యాంక్ కూడా కరెన్సీ స్వాప్ ద్వారా అంతో ఇంతో సర్దుబాటు చేయడంతో డాలర్ నిల్వ 350 కోట్ల డాలర్లకు పెరిగినా.. కొద్దిరోజులకే అవీ తగ్గిపోయాయి. ఆ మొత్తం కూడా కేవలం రెండు నెలల దిగుమతులకు కూడా సరిపోవు. ఇక ఇటు రుపీ విలువను పెంచాలన్న ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు.. రుపీ విలువను మరింత దిగజార్చాయి. ఫలితంగా డాలర్ నిల్వలు తరిగిపోయాయి. డాలర్ ఒత్తిళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో స్టాట్యుటరీ రిజర్వ్ రేషియో (బ్యాంకుల వద్ద కచ్చితంగా ఉండాల్సిన డబ్బు నిల్వ), వడ్డీ రేట్లను పెంచింది.
తిరగబడిన మానిటరీ పాలసీ
ఆర్థిక సంక్షోభం మరింత ముదరకుండా ఉండేందుకు ‘కొత్త మానిటరీ పాలసీని’ అమలు చేయాలనుకుంది ప్రభుత్వం. దానికి తగ్గట్టు డబ్బులు ప్రింట్ చేసుకుంటే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని అనుకుంది. కానీ, సీన్ రివర్స్ అయింది. 18 నెలల్లో 800 కోట్ల రుపీలను ముద్రించింది. దానికితోడు సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలతో డబ్బు చెలామణీ (లిక్విడిటీ) అవసరానికి మించి పెరిగింది. దీంతో శ్రీలంక రుపీ విలువ పతనమైంది. ద్రవ్యోల్బణానికి దారి తీసింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం 6 శాతంగా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతంగా ఉంది. దీంతో తిండి గింజల రేట్లు పెరిగాయి. డాలర్ మారకపు విలువను పెంచేసింది. ఇదిలాగే కొనసాగితే రుపీ విలువ మరింత పడిపోయి.. హైపర్ ఇన్ఫ్లేషన్కు దారి తీస్తుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
పన్నులు ఎత్తేసింది
ఎన్నికల్లో గెలిచిన వెంటనే శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స.. పన్నుల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు కూడా దేశ ఆర్థిక లోటుకు కారణమయ్యాయి. అధికారంలోకి వచ్చీరాంగానే ‘పే యాజ్ యూ ఎర్న్ (సంపాదనలో కొంత భాగం)’ ట్యాక్సులను ఎత్తేశారు. కార్పొరేట్ పన్నులు, విలువ ఆధారిత సేవా పన్నులు (వీఏఎస్టీ) వంటి వాటిని తగ్గించారు. దాంతో ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం 56,000 కోట్ల శ్రీలంక రుపీలు తగ్గిపోయింది. గత ఏడాది దేశ బడ్జెట్లో ఆర్థిక లోటు 1.6 లక్షల కోట్ల రుపీలు. అది దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ లోటు అని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
ప్రభుత్వ ఖర్చులు పెరిగినయ్
అన్ని మార్గాల్లోనూ వచ్చే ఆమ్దానీ తగ్గిపోవడం, మారకపు రేట్లు పెరగడంతో పాటు ఇటు ప్రభుత్వ ఖర్చులూ పెరగడం అగ్గికి ఆజ్యం తోడై.. మరింత మంటపెట్టినట్టయింది. ఏటా లక్ష ఉద్యోగాలను ఇస్తున్న ప్రభుత్వం.. ఆమ్దానీలో 58 శాతం వారి జీతాల కోసమే ఖర్చు పెడుతోంది. ప్రభుత్వ అధికారుల పింఛన్లనూ కలిపితే అది 80 శాతం అవుతుంది. మిగిలిన మొత్తంలో అప్పులు కట్టడం, ప్రజా సంక్షేమం పథకాల కోసం ఖర్చు పెడుతున్నది. ఆ మిగిలిన మొత్తం సరిపోక అప్పులు చేయాల్సి వస్తోంది.
దిగుమతులు బంద్
డాలర్ విలువ పెరగడం, విదేశీ పైసలు కరిగిపోతుండడంతో దిగుమతులపై శ్రీలంక నిషేధం విధించింది. ఒకటి కాదు..రెండు కాదు 600 వస్తువులను దిగుమతి చేసుకోకుండా ఆపేసింది. పప్పులు, పిండిపదార్థాలు, పాల పొడులు, చక్కెర, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, మసాలా దినుసులు, నూనెలు, చీజ్, బటర్, చాక్లెట్లు, యాపిల్స్, సంత్రాలు, ద్రాక్ష, బీర్లు, వైన్స్, పురుగుమందులు వంటి వాటి దిగుమతిపై నిషేధం విధించింది. ఈ నిర్ణయంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది. 2019లో 33.21 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులు జరగ్గా.. ఇప్పుడది 22.86 కోట్ల డాలర్లకు తగ్గిపోయింది. ఇటు దేశంలోనూ పంటల దిగుబడి తగ్గిపోవడంతో ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. 120 శ్రీలంక రుపీలున్న కిలో ఉన్న చక్కెర ధర 190కి పెరిగింది. కొన్నిచోట్లయితే 230కి కూడా అమ్ముతున్నారు. కందిపప్పు రేటు డబుల్ అయింది కిలో కందిపప్పు 167 శ్రీలంక రుపీలుంటే.. 310 చేసి అమ్ముతున్నారు. పరిస్థితి ఎంతదాకా దారి తీసిందంటే.. సూపర్ మార్కెట్ల ముందు జనం లైన్లు కట్టాల్సి వచ్చింది. చివరి వ్యక్తికి సరుకులు దొరుకుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. అదే అదునుగా చాలామంది వ్యాపారులు సరుకులు దాచేసి కొరత సృష్టించారు. దీంతో రోజువారీ తిండి వస్తువులను బ్లాక్ చేయకుండా అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఆర్మీని దించారు. సరుకులపై రేషన్ పెట్టారు. ఒక్కొక్కరికి అరకిలోకు మించి ఇవ్వలేదు. చాలా చోట్ల ముసలివాళ్లకు, పిల్లలకు ఇబ్బందులు తప్పలేదు.
కొంపముంచిన సేంద్రియ సాగు
ఒకప్పుడంటే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లు. పాడిపశువుల పెంటను ఎరువులుగా వాడేవాళ్లు. పంటకు ఎరువుగా పచ్చిరొట్టను సాగు చేసేవాళ్లు. కంపోస్ట్ ఎరువులను ఎక్కువగా వేసేవాళ్లు. కానీ, మనం అడ్వాన్స్ అయ్యే కొద్దీ అవన్నీ పోయాయ్. పురుగుమందులు జీవితంలోకి ఎంటరయ్యాయి. పంటను చీడ నుంచి కాపాడేందుకు తీసుకొచ్చిన ఆ పురుగుమందులే ఇప్పుడు మనకు చీడలా తయారయ్యాయి. అయితే, ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ తొవ్వలనే శ్రీలంక నడిచింది. ఆర్గానిక్ సాగు చేయాలని రైతులను ఆదేశించింది. పురుగుమందులతో కాడ్మియం వంటి విషపదార్థాలు నీళ్లలో కలవడం, వాటిని జనాలు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు ఎదురవుతున్నాయి. పైగా రసాయనాలను పంటలపై స్ప్రే చేస్తూ ఏటా వందలాది రైతులు చనిపోతున్నారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతింటున్నది. వాటన్నింటినీ ఆపడానికి ఆర్గానిక్ సాగువైపు మళ్లాలని నిర్ణయించారు. అయితే తీసుకున్న నిర్ణయం మంచిదే అయినా.. ఉన్నట్టుండి ప్రకటించడం, ఒకేసారి ఆర్గానిక్ సాగు అనడం, ప్లాన్ బి పెట్టుకోకపోవడంతో అది బెడిసికొట్టింది. మొత్తం ఒకేసారి సేంద్రియ సాగువైపు మళ్లితే భవిష్యత్‌ల తక్లీఫ్ తప్పదని, దిగుబడులు దారుణంగా దెబ్బతింటాయని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరించినా సర్కార్ పట్టించుకోలేదు. అసలు ఎరువులు, మందులు లేకపోతే రైతులంతా తప్పనిసరిగా ఆర్గానిక్ పంటల వైపు మళ్లుతారని అర్థంలేని ఆలోచన చేసి, ఈ ఏడాది మేలో పురుగుమందులు, రసాయన ఎరువుల దిగుమతులను బ్యాన్ చేసింది. దీంతో 2019లో 3.22 కోట్ల డాలర్లున్న వాటి దిగుమతులు.. ఇప్పుడు 82 లక్షల డాలర్లకు తగ్గాయి.
దిగుబడులు దిగజారినయ్
దేశంలోని 90 శాతం మంది రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల మీదే ఆధారపడి సాగు చేసేవాళ్లు. వరి, తేయాకు, రబ్బర్ తోటలకు ఎక్కువగా రసాయనాలనే వాడేటోళ్లు. శ్రీలంకకు ఎగుమతుల ఆమ్దానీలో 10 శాతం వాటా టీ పౌడర్ దే. అయితే, సేంద్రియ సాగుతో వడ్లు, టీ దిగుబడులు సగానికి సగం పడిపోయాయి. మామూలుగా అయితే, సంప్రదాయ సాగును సేంద్రియ సాగువైపు మళ్లించాలంటే కనీసం మూడేండ్లయినా పడుతుందని జర్మనీలోని ఓన్హామ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రొఫెసర్ సబీనా జికేలి అంటున్నారు. అలాంటిది ఎలాంటి సమయం తీసుకోకుండానే సేంద్రియ సాగువైపు మళ్లడం వల్లే దిగుబడులు భారీగా పడిపోయాయని చెప్తున్నారు. దీంతో ధరలూ పెరిగాయని అంటున్నారు. మొత్తంగా దేశంలోని భూభాగంలో 41.63 శాతం భూముల్లో సాగు జరుగుతోంది. అందులో 23.45 శాతం వరి, ఇతర పంటలను పండిస్తున్నారు. 10.32 శాతం భూముల్లో తేయాకు, రబ్బర్, పామాయిల్, పండ్ల తోటలను పెంచుతున్నారు. ఉన్నట్టుండి అందర్నీ బలవంతంగా సేంద్రియ సాగుకు మళ్లించారు. అయితే, మొత్తం రైతుల్లో సేంద్రియ సాగు మీద అవగాహన ఉన్నోళ్లు కనీసం 20 శాతం మంది కూడా లేరు. ఇంకేముంది! 44 శాతం మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మున్ముందు 85 శాతం రైతుల సాగు దిగుబడుల్లో కోత పడే ప్రమాదముంది. నిజానికి దేశంలో రోజూ 3,500 టన్నుల మున్సిపాలిటీ చెత్త ఉత్పత్తి అవుతుందని వాటి నుంచి ఏటా కేవలం 20 లక్షల నుంచి 30 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు మాత్రమే తయారు చేయొచ్చని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. అయితే, ఒక్కో హెక్టార్ (దాదాపు రెండున్నర ఎకరాలు) వరి పంటకు ఏటా 5 టన్నులనుకున్నా 40 లక్షల టన్నుల సేంద్రియ ఎరువులు అవసరమవుతాయని చెబుతున్నారు. తేయాకు తోటలకు మరో 30 లక్షల టన్నులు కావాలంటున్నారు. మొత్తంగా దేశంలో ఆర్గానిక్ సాగుతో ఆహార దిగుబడులు 19 నుంచి 25 శాతం వరకు తగ్గిపోయాయని ఎక్స్‌పర్ట్స్ లెక్క తేల్చారు. దీనికితోడు సేంద్రియ సాగును పెంచితే పంట భూములు కూడా పెరుగుతాయని, దాని వల్ల అడవులను కొట్టేయాల్సిన పరిస్థితి వస్తుందని పర్యావరణ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
టూరిజానికి టెర్రర్ వైరస్
కరోనా మహమ్మారి అన్ని రంగాలకు సోకినట్టైంది. టూరిజాన్ని నమ్ముకున్న చాలా దేశాలను చాలా దెబ్బ తీసింది. శ్రీలంకది అదే పరిస్థితి. ఫారిన్ టూరిస్టులతో ఆ దేశానికి 300 కోట్ల డాలర్ల నుంచి 500 కోట్ల డాలర్ల దాకా ఆమ్దానీ వచ్చేది. కానీ, మహమ్మారితో ఆ పైసలు రావడంలేదు. ఇటు 2019 ఏప్రిల్ 21లో జరిగిన ఈస్టర్ బాంబు పేలుళ్లతోనూ ఆ దేశ ఎకానమీ కుదేలైపోయింది. దేశ రాజధాని కొలంబోలోని మూడు చర్చిలు (సెయిట్ ఆంటోనీ ష్రైన్, సెయింట్ సెబాస్టియన్ చర్చ్, జియాన్ చర్చ్), మూడు లగ్జరీ హోటళ్లలో ఐఎస్ టెర్రరిస్టులు బాంబులు పేల్చారు. 8 వరుస పేలుళ్లతో 300 మందికిపైగా చనిపోయారు. అందులో 45 మంది ఫారినర్స్ ఉన్నారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ టెర్రర్ వైరస్‌కు కరోనా వైరస్ తోడు కావడంతో టూరిజం దారుణంగా దెబ్బతింది. ఆ ఏడాది దాదాపు 150 కోట్ల డాలర్ల మేర నష్టపోయినట్టు హోటళ్ల అసోసియేషన్ ప్రకటించింది. 39 దేశాల నుంచి వచ్చేటోళ్లకు వీసా ఆన్ అరైవల్ సిస్టమ్‌ను శ్రీలంక రద్దు చేసింది. సెంట్రల్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఆ ఏడాది పరోక్ష పన్నుల రూపంలో వచ్చే 2,600 కోట్ల రుపీల ఆదాయం పోయింది. ఏటా 23 లక్షల మంది టూరిస్టులు ఆ దేశాన్ని చూసేందుకు వస్తే.. ఈ ఏడాది కేవలం 19,300 మందే వచ్చారు. దీంతో ఆదాయం తగ్గి ఆర్థిక లోటు బాగా పెరిగింది.
అవినీతి
దేశంలో విపరీతంగా పెరిగిపోయిన అవినీతి కూడా పరిస్థితి దిగజారిపోవడానికి కారణమైంది. అధికార వర్గాల నుంచి పైస్థాయి రాజకీయ నాయకుల దాకా అవినీతి అనే రోగం చీడలా పట్టుకుంది. ఏది చేయాలన్నా చేతులు తడపాల్సిన పరిస్థితులున్నాయి. టెంపరరీ నిర్ణయాలు, రాత్రికిరాత్రే తీసుకున్న నిర్ణయాలతో చేయి దాటిపోయింది. దేశ ఎకానమీ నిలకడగా ఉండాలని కోరుకునే పెట్టుబడిదారులకు అవి ఏ మాత్రం మింగుడు పడట్లేదు. ప్రభుత్వంలో ఒకరితో ఒకరికి సరైన కమ్యూనికేషన్ లేకపోవడమూ పరిస్థితికి అద్దం పడుతుంది. ఎక్స్‌పర్ట్స్ ఏది చెప్పినా పెడచెవిన పెట్టి.. తమకు నచ్చిందే చేసుకుపోవడమూ ముప్పును తెచ్చిపెట్టింది.
కొత్తేం కాదు
నిజానికి విదేశాల మీద ఆధారపడడం అనే కాన్సెప్ట్‌కు శ్రీలంక మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంది. 50 ఏండ్ల కిందట్నే అంటే 1970ల్లో నాటి ప్రధాని సిరిమావో బండారానాయికే దాని మీద గొంతెత్తారు. దేశంలోనే ఉత్పత్తులను పెంచుకునేందుకు నడుంకట్టారు. ‘ప్రొడ్యూస్ ఆర్ పెరిష్ (పండించండి లేదంటే బాధపడండి)’ అంటూ సొంత కాళ్లపై నిలబడడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే అభివృద్ధికి శ్రీకారమన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చిన చమురు సంక్షోభం, కొరియా యుద్ధం తర్వాత ఉన్న రబ్బర్ సంక్షోభాన్ని గుర్తు చేసుకుంటూ స్వయంగా ఎదగాలనుకున్నారు. దిగుమతులపై నిషేధం విధించారు. ప్రజలు ఏం తినాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేసే స్థాయికి వచ్చారు. సరుకులకు కొరత ఏర్పడింది. ఫలితంగా సరుకుల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. షాపుల ముందు జనం లైన్లు కట్టారు. ఆకలికి అలమటించారు. దీంతో ధరలను తగ్గించేందుకు ప్రధాని చర్యలు చేపట్టారు. ఎమర్జెన్సీని విధించారు. ఆందోళనకారులను సైనిక చర్యలతో చెదరగొట్టారు. ఎల్టీటీఈతో ఎంతో కాలం సాగిన యుద్ధం, 2018లో ముస్లిం వ్యతిరేక అల్లర్ల వంటివి కూడా నష్టాలనే మూటగట్టాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే వచ్చాయి. అప్పుడు సిరిమావో తీసుకున్నట్టే.. ఇప్పుడు రాజపక్స నిర్ణయాలు తీసుకుంటున్నారు. సొంతంగా ఎదగడాని కోసం 20 లక్షల హోం గార్డెన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు.
చైనాతో అప్పులు కొండెక్కినయ్
మిగతా దేశాల నుంచి శ్రీలంక తీసుకుంటున్న అప్పులు ఒకెత్తయితే చైనా నుంచి తీసుకున్న అప్పులు ఇంకొక ఎత్తు. ఆ దేశం తీసుకుంటున్న అప్పుల్లో 15 శాతం చైనా నుంచే ఉంటున్నాయి. అయితే, ఆ అప్పులను చైనాకు కట్టలేక శ్రీలంక తిప్పలు పడుతోంది. ఫలితంగా 2017లో హిందూ మహా సముద్రంలో అత్యంత కీలకమైన హంబన్‌టోటా పోర్ట్‌ను శ్రీలంక పోగొట్టుకుంది. అప్పులకు బదులుగా ఆ పోర్ట్‌ను చైనా లాగేసుకుంది. 99 ఏండ్ల లీజుకు రాయించుకుంది. ఇటు విదేశీ అప్పులను తీర్చేందుకూ చైనాపైనే ఆ దేశం ఎక్కువగా ఆధారపడింది. అంతెందుకు ఈ ఏడాది చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి 130 కోట్ల డాలర్లు, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నుంచి 150 కోట్ల డాలర్ల విలువైన కరెన్సీ స్వాపింగ్‌కు శ్రీలంక ఒప్పందం చేసుకుంది. హిందూ మహాసముద్రంలోని కీలక ప్రాంతంలో ఉండడంతో శ్రీలంకలో 2006 నుంచి 2019 మధ్య డెవలప్‌మెంట్ పేరిట చైనా 1200 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ఈ ఏడాది మేలో చైనా అందించిన ఆర్థిక సాయంతో కొలంబో పోర్ట్ సిటీ ఎకనామిక్ కమిషన్ యాక్ట్‌ను శ్రీలంక పాస్ చేసింది. అందులో భాగంగా పోర్టు చుట్టూ స్పెషల్ ఎకనామిక్ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. అది చైనాకు బాగా లాభం చేసేదే. దాని వల్ల చైనా అక్కడ తిష్ట వేస్తే ఇండియాకు ముప్పు పొంచి ఉన్నట్టే. కొలంబో పోర్టు ద్వారానే శ్రీలంకకు మన దేశం నుంచి 60 శాతం ఎగుమతులు జరుగుతాయి. చైనాకు శ్రీలంక బాగా దగ్గరవ్వడం మనకు ఇబ్బందేనని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
55 దేశాల్లో తిండికి కటకటే
శ్రీలంక ఒక్కటే కాదు.. ప్రపంచంలోని 55 దేశాల్లో తిండికి కటకట ఏర్పడింది. 15.5 కోట్ల మంది తిండి లేక నకనకలాడే పరిస్థితులున్నాయి. కరోనా, యుద్ధ పరిస్థితులు, వాతావరణ మార్పులు ఆహార సంక్షోభానికి కారణమవుతున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం, యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన నివేదికలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బుర్కినఫాసో, సౌత్ సూడాన్, యెమన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అఫ్గానిస్థాన్, సిరియా, నార్తర్న్ అల్జీరియా, ఇథియోపియా, జింబాబ్వే, హైతీ వంటి దేశాల్లో తిండి దొరక్క పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. ఆకలి చావులు, పోషకాహార లోపం ఆ దేశాల్లోనే ఎక్కువగా ఉంది.
మనకూ ముప్పే
అమెరికా, బ్రిటన్ తర్వాత శ్రీలంక నుంచి అత్యధికంగా ఎగుమతులు జరిగేది మన దేశానికే. మన దేశంతో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో (ఫ్రీ ట్రేడ్) 60 శాతం ఎగుమతులపై ఎలాంటి చార్జీలూ పడవు. అంతేకాకుండా శ్రీలంకలో ఇండియా పెట్టుబడులు కూడా ఎక్కువే. అయితే, శ్రీలంకతో ఇండియా పార్ట్నర్షిప్ ఎప్పుడూ డిమాండ్ మీదే ఆధారపడి ఉంది. చదువు, ఆరోగ్యం, ఇండ్లు, మంచినీళ్ల ప్రాజెక్ట్‌లు, శానిటేషన్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ వంటి వాటిలో ఇండియా పెట్టుబడులు పెడుతోంది. రైల్వే కనెక్టివిటీ, మౌలిక వసతులు, రక్షణ పరికరాలు, సెక్యూరిటీ, సోలార్ ప్రాజెక్టులు వంటి వాటి కోసం 200 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. 2005 నుంచి 2019 వరకు ఎఫ్డీఐల కింద మరో 170 కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. రిటైల్, పెట్రోలియం, హోటళ్లు, టూరిజం, రియల్ ఎస్టేట్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి వాటికి ఆ డబ్బును మళ్లించింది. అయితే, రాజపక్స అధికారంలోకి వచ్చాక ఇండియాతో శ్రీలంక సంబంధాలు తగ్గిపోయినట్టు చెబుతున్నారు. కొలంబో పోర్ట్‌లో కట్టాలనుకున్న ఈస్ట్ కంటెయినర్ టెర్మినల్ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఇండియా, జపాన్‌తో కలిసి ఆ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. కారణమేంటో తెలియకపోయినా మధ్యలోనే ఆ ప్రాజెక్టు నుంచి శ్రీలంక వెనకడుగు వేసింది. అయినా కూడా ఈ ఏడాది జులైలో సార్క్ కరెన్సీ స్వాప్ ఫ్రేమ్ వర్క్ 2019–2022లో భాగంగా 40 కోట్ల డాలర్లను శ్రీలంక సెంట్రల్ బ్యాంక్‌కు మన ఆర్బీఐ అందజేసింది. అయితే, వాటిని రెన్యువల్ చేసేందుకు మాత్రం మన దేశం ఒప్పుకోలేదు. ఫలితంగా రెండు దేశాల సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
బయటపడాలంటే..
ఇప్పుడున్న పరిస్థితి నుంచి శ్రీలంక బయటపడాలంటే ఎగుమతులపై దృష్టి పెట్టి.. దిగుమతులను తగ్గించడాన్ని మానుకోవాలి. టూరిజాన్ని డెవలప్ చేయడం మీద ఫోకస్ చెయ్యాలి. 80 శాతం వస్తువులకు దిగుమతుల మీదే ఆధారపడుతుండడం వల్ల.. వాటిపై నిషేధం పెట్టడం సరైన నిర్ణయం కాదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. సర్వీసెస్ సెక్టార్‌లో శ్రీలంక ఆమ్దానీని పెంచుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. విమాన ప్రయాణాలు, పోర్టులు, ఐటీ, కమ్యూనికేషన్ రంగాలపై ఫోకస్ చేస్తే శ్రీలంక మళ్లీ కోలుకునే అవకాశం ఉందని, అప్పులను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.
::: ప్రదీప్ ఏశాల