తెలంగాణ బంద్ ప్రశాంతం.. రోడ్డెక్కిన బస్సులు.. JBS నుంచి మొదలైన ప్రయాణాలు

తెలంగాణ బంద్ ప్రశాంతం.. రోడ్డెక్కిన బస్సులు.. JBS నుంచి మొదలైన ప్రయాణాలు

హైదరాబాద్: స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే ప్రధాన డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ కారణంగా ఉదయం నుంచి ఆర్టీసీ డిపోలకే పరిమితమైన బస్సులు సాయంత్రం 5 గంటల నుంచి రోడ్డెక్కాయి. హైదరాబాద్ జేబీఎస్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, బోధన్, మెదక్, వేములవాడ, యాదగిరిగుట్ట, బాన్సువాడ, సిద్ధిపేట, గజ్వేల్.. ఇలా తెలంగాణలోని ప్రధాన ప్రాంతాలకు బస్సులు బయల్దేరాయి. 'బంద్ ఫర్ జస్టిస్' పేరుతో శనివారం తెలంగాణ బంద్ జరిగింది.

బీసీ సంఘాల జేఏసీ విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సీపీఎం, సీపీఐ లాంటి లెఫ్ట్ పార్టీలు, ప్రజా, స్టూడెంట్ యూనియన్లు మద్దతు ప్రకటించి, స్వయంగా పాల్గొన్నాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు కూడా నడపొద్దని పిలుపునివ్వడంతో బస్సులు రోడ్డెక్కలేదు. రాజ్యాంగ సవరణ ద్వారానే 42శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లభిస్తుందని, ఇందుకోసం బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తామని, కాంగ్రెస్పై కూడా పోరాడు తామని జేఏసీ నేతలు స్పష్టంచేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం జీవో అమలుపై స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హైకోర్టులోనే తేల్చుకోవాలని తేల్చి చెప్పింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మరింత పీటముడి బిగుసుకున్నది.

ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాల తీర్పుల పట్ల బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిని, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. జీవో 9పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ పిటిషన్ను పక్కన పెట్టడంతో.. బీసీ సంఘాలు తమ పోరాటాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఏకతాటి పైకి వచ్చిన బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి శనివారం రాష్ట్ర బంద్ నిర్వహించాయి.