శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆర్థిక, ఆహారం, ఇంధన సంక్షోభంలో చిక్కుకున్న లంకేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ దొరకక ప్రజలు అల్లాడి పోతున్నారు. కిరోసిన్, పెట్రోల్ కోసం రోజంతా క్యూలైన్లో వేచి చూసినా దొరకని పరిస్థితి ఏర్పడింది. విదేశీ మారక నిల్వలు అయిపోయాయని.. పెట్రోల్ కొనేందుకు డబ్బులు లేవని శ్రీలంక ప్రధాని పార్లమెంట్ లో ప్రకటించారు. ఉన్న కొద్ది పాటి చమురును అంబులెన్స్ సర్వీసుల కోసం వాడుతున్నామన్నారు. పెట్రోల్ కోసం బంకుల దగ్గరికి ఎవరూ రావొద్దని వేడుకున్నారు. మరో రెండు నెలలు ఓపిక పడితే... పరిస్థితులు చక్కబడుతాయని భరోసా ఇచ్చారు.
శ్రీలంకకు అప్పు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చింది. 160 మిలియన్ యూఎస్ డాలర్లు ఇచ్చిన ప్రపంచ బ్యాంక్ ..వాటితో చమురును కొనుగోలు చేయనున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ఇక వంట గ్యాస్ కోసం మహిళలు పెద్ద ఎత్తున ఆందోలనలు చేస్తున్నారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదని ప్రజలు వాపోతున్నారు. కనీసం వంట చేసుకోవడానికి గ్యాస్ సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని లంకమహిళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 30 శాతం ధరలు పెరగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
