కొలంబో: శ్రీలంకలో పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి తిండి లేదు.. వండుకుందామంటే గ్యాస్‌లేదు. ఎట్లయినా గ్యాస్ దొరికిందనుకుంటే.. సామాన్లు కొందామంటే డబ్బుల్లేవు.. గ్రాసరీ ధరలు కూడా మస్తు పెరిగినయ్.. దీంతో జనాలు అక్కడ ఉండలేకపోతున్నారు. చాలా మంది శ్రీలంకన్లు ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ హెడ్‌క్వార్టర్, ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాస్‌పోర్టు దొరికితే ఏ దేశానికైనా వెళ్లి బతుకుదామని చూస్తున్నారు. పని చేద్దామంటే ఇచ్చేవాళ్లు దిక్కులేకపాయె. పని దొరికినా ఒక పూట కడుపు నింపుకునే కూలి పైసలు కూడా ఇస్తలేరని చెబుతున్నారు. ఇక్కడుండి ఏం చేయలేం అని డిసైడ్అయ్యారు. చాలా మంది శ్రీలంక వదిలి వెళ్లిపోయేందుకు నిర్ణయించుకున్నారు. లేబర్లు, షాప్ఓనర్లు, రైతులు, పబ్లిక్ సర్వెంట్లు, హౌస్ వైఫ్స్ఇలా చాలా మంది పాస్‌పోర్టుల కోసం రోజుల కొద్దీ క్యూలైన్లో నిల్చుని ఎదురుచూస్తున్నారు. 70 ఏండ్ల కాలంలో ఇలాంటి గోస పడలేదని, ఇగ ఇక్కడ బతకడం కష్టమని, వేరే దేశానికి వెళ్లిపోతున్నామని బాధతో చెబుతున్నారు. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 2,88,645 పాస్‌పోర్టులు జారీ చేయగా.. గతేడాది ఇదే కాలంలో 91,331 పాస్‌పోర్టులే ఇచ్చినట్టు సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. దేశ వ్యాప్తంగా 22 మిలియన్ల ప్రజలు ఫుడ్, కుకింగ్ గ్యాస్, ఫ్యూయెల్, మెడిసిన్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది మైగ్రెంట్స్‌గా వెళ్లిపోతున్నారు. కట్టుబట్టలతో ఇండ్లు వదిలేసి వలస పోతున్నారు. ఇక పాస్‌పోర్టు ఆఫీసుల్లోని సిబ్బందికి పని ఎక్కువైంది. రాత్రిళ్లు కూడా ఆఫీస్‌లోనే ఉండి పని చేస్తున్నారు. రోజుకు 3,000 మంది పాస్‌పోర్టుల కోసం అప్లికేషన్లు ఇస్తున్నారు. అయితే, ఇంకొన్ని నెలలు ఫుడ్ క్రైసిస్ ఉంటుందని ప్రధాని విక్రమ సింఘే చేసిన ప్రకటనతో వలసలు మరిన్ని పెరిగాయని అధికారులు చెబుతున్నారు.
