
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్‌లో శ్రీరామనవమి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. అన్ని ఆలయాల్లో రాములోరి కల్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. దూల్‌పేట్ సీతారాంబాగ్‌లోని సీతారామ ఆలయం నుంచి ధూల్‌పేట, పురాణాపూల్, బేగంబజార్, పుత్లిబౌలి మీదుగా కోఠిలోని సుల్తాన్బజార్దాకా 7 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభాయాత్ర సాగింది. జైశ్రీరాం నినాదాల నడుమ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. యాత్రకు వెయ్యి మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆలయాలు, శోభాయాత్ర జరిగిన ప్రాంతాలన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి. సీతారాంబాగ్ ఆలయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.