
హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం సీతారంబాగ్ ఆకాశ్ పురి నుంచి మొదలైన శోభాయాత్ర..కోఠిలోని హనుమాన్ ఆలయం వరకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జైశ్రీరామ్ నినాదాలతో శోభాయాత్ర పరిసరాలు మార్మోగాయి. యాత్ర సాగే మార్గంలో నిర్వాహకులు ఆహార పొట్లాలు, మంచినీటి ప్యాకెట్లను అందించారు. నగరంలో ఎటు చూసినా శ్రీరామ భక్తులే కనిపించారు. ఈ శోభాయాత్రలో ఎక్కువ సంఖ్యలో యువత పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా శోభాయాత్రను నిర్వహించారు. ఎండను సైతం లెక్కచేయకుండా యువత ఈ శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో పాల్గొంది.
మధ్యాహ్నం సీతారామ్‌బాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర..సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది. మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ ఆలయానికి యాత్ర చేరుకుంది. మొత్తం 6.5 కిలో మీటర్ల మేర శోభాయాత్ర నిర్వహించారు. శోభయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. శోభాయాత్రకు పోలీసు అధికారులు నిశితంగా పరిశీలించారు. సీవీ ఆనంద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి గమనించారు. శోభాయాత్ర జరిగే దారిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి శోభాయాత్రను పరిశీలించారు. శోభాయాత్ర నేపథ్యంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.