తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. చరిత్రలో తొలిసారిగా జూలై నెలలోనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 34 గేట్లను ఎత్తివేశారు. ఈ ప్రాజెక్టు కట్టి ఏడు దశాబ్దాలు దాటుతోంది. వాస్తవానికి భారీ వర్షాలు కురిస్తే..ఆగస్టు, సెప్టంబర్ మాసాల్లో గేట్లను ఎత్తుతుంటారు. ఇన్ ఫ్లో 2 లక్షల 45 వేలుగా ఉంది. దీని నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74 టీఎంసీల నీరు ఉంది. గేట్లను ఎత్తివేయడంతో నీరు ఎస్సారెస్పీ (SRSP) ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో ఈ ప్రాజెక్టుకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వరదనీటి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.
ఎస్సారెస్పీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అంతేగాకుండా ఘటనవాగు నుంచి, మంజీరా నుంచి వస్తున్న నీరు శ్రీరాంసాగర్ కు వచ్చి చేరుతోంది. మరోవైపు.. మంజీరా నది కూడా ఉగ్రరూపం దాలుస్తోంది. నాసిక్ లోని త్రయాంబిక్ వద్ద వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాగే పరిస్థితి కంటిన్యూ అవుతే.. గైక్వాడ్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ఇది నిండితే గేట్లు ఎత్తే పరిస్థితి ఉత్పన్నమౌతోంది. ఈ నీరు శ్రీరాంసాగర్ కు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ధర్మపురం పట్టణంలో గోదావరి ఉరకలెత్తుతోంది. పట్టణంలోకి నీరు ప్రవేశించడంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ధర్మపురి పరిసర ప్రాంతాల్లోని పంటలు నీట మునిగిపోయాయి.
