రాములోరి పెళ్లికి అంతా సిద్ధం

రాములోరి పెళ్లికి అంతా సిద్ధం

భద్రాద్రి క్షేత్రం రాములోరి పెళ్లికి సిద్ధమైంది. అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు ఆలయ అధికారులు. ఆలయప్రాంగణాన్ని.. మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారు. శ్రీ సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల పండుగగా జరిపేందుకు…ఆలయ పాలకమండలి, రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాముడి ఆలయాన్ని విద్యుత్  దీపాలతో అలంకరించారు. ఇవాళ ఎదుర్కోలు,  రేపు శ్రీ సీతారాముల కళ్యాణం, ఎల్లుండి మహా పట్టాభిషేకం కార్యక్రమాలు జరుగనున్నాయి.

రాములవారి పెళ్లికి భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. దీంతో ప్రతీ ఒక్కరూ కళ్యాణం చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. ప్రతీ సెక్టార్ కు ప్రత్యేకంగా టికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ తో పాటు ఆలయ ప్రాంగణంలోనూ టికెట్ కౌంటర్లు అందుబాటులో ఉండనున్నాయి. కళ్యాణం జరిగే ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు అధికారులు.

ఎండాకాలం కావడంతో భక్తులకు మంచినీళ్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లును కూడా పెంచుతున్నారు. వేడుకలకు ఇప్పటికే ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు…భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ ఈవోను ఆదేశించారు. వేడుకలకు 6 వందలకు పైగా ప్రత్యేక బస్సులను నడపనుంది ఆర్టీసీ.

ఓ వైపు నవమి వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుతుండగా… గోదావరిలో నీరు అడుగంటిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది పుణ్యస్నానాలకు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు భక్తులు.