ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు చేసుకోవాలి: ఏపీ ప్రభుత్వం

ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు చేసుకోవాలి: ఏపీ ప్రభుత్వం

కరోనాను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ దేవాలయాలు, పుణ్యక్షేత్రాలపైనా పడింది. ఏప్రిల్ 2న శ్రీరామనవమి పండుగ కావడంతో…దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  మార్గదర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఆలయాల్లోకి భక్తులను అనుమతించబోరని, అందుకే రాష్ట్రంలోని ప్రధాన వైష్ణవ ఆలయాల్లో ఏప్రిల్ 2న శ్రీరామనవమి రోజు అర్చకులు మాత్రమే పూజలు, వేడుకలు నిర్వహిస్తారని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తుండటంతో… భక్తులు స్వచ్ఛందంగా దేవాలయ దర్శనాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పండుగ రోజు ఇంట్లోనే శ్రీరామనవమి పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. సామాజిక దూరం పాటిద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ప్రధాన దేవాలయాల్లో స్వామివార్లకు, అమ్మవార్లకు నిత్యం జరిగే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతున్నాయని తెలిపారు.