నేడే రాములోరి శోభాయాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు

నేడే రాములోరి శోభాయాత్ర: ట్రాఫిక్ ఆంక్షలు

శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సిటీలోని పలు ప్రాంతాల్లో బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌‌ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే శోభాయాత్రకు సీతారాం బాగ్ నుంచి కోఠి వరకు 7 కిలోమీటర్ల పరిధిలో 2,500 మందిపోలీసులతో భద్రత, 192 సీసీ కెమెరాలతో నిఘాను పర్యవేక్షించనున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. అలాగే అంబేద్కర్‌‌ జయంతి వేడుకలు జరిగే లోయర్‌‌ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌‌ మళ్లింపులు ఉంటాయని అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ చెప్పారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు, ఆయా ప్రాంతాల్లో ప్రయాణించే వారు గమనించి సహకరించాలని కోరారు. బందోబస్తుపై సీపీ అంజనీకుమార్‌‌, ట్రాఫిక్ పై అదనపు సీపీ అనిల్ కుమార్ శనివారం అధికారులతో సమీక్షలు జరిపారు.

శ్రీరామ నవమి శోభయాత్రకు సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర జరిగే ఏడు కిలోమీటర్ల పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,500 మంది పోలీసుతో భద్రతా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర పొడవునా192 సీసీ కెమెరాలతో సెక్యూరిటీ పెట్టనున్నారు. సీసీ కెమెరాలతో పాటు ర్యాలీని 3 మౌంటెడ్ కెమెరాలతో పర్యవేక్షించేందుకు రంగం సిద్ధమైంది. సీతారాం బాగ్ నుంచి అఫ్జల్‌ గంజ్, గౌలిగూడ, సుల్తాన్ బజార్, హనుమాన్ వ్యాయామశాల దాకా కొనసాగే ప్రధాన శోభాయాత్రలో మఫ్టీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ తో ప్రత్యేక నిఘా పెట్టారు. సీతారాం బాగ్నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు ఉన్నసీసీ కెమెరాలను బషీర్ బాగ్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌కు కనెక్ట్ చేశారు. ఉదయం 10గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2గంటలదాకా బందోబస్త్​ ఉంటుంది. కమాండ్ కంట్రోల్ నుంచి శోభాయాత్రను పర్యవేక్షిస్తామని సీపీ అంజనీకుమార్ తెలిపారు.

నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామ నవమి శోభాయాత్ర, బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సీటిలో పోలీసులు ట్రాఫిక్ఆంక్షలు విధించారు. సాధారణ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు సీపీ ట్రాఫిక్, అనీల్ కుమార్ శనివారం అధికారులతో సమీక్షించారు. శోభాయాత్ర జరిగే సీతారాంభాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు, అంబేద్కర్ జయంతి నిర్వహించే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాహనాలదారి మళ్లింపుపై ఆదేశాలు జారీ చేశారు. సీతారాం భాగ్ రామాలయం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర బోయిగూడ కమాన్, మంగళ్ హాట్, జాలీ హనుమాన్, దూల్ పేట్, పురాణపూల్, గాంధీ విగ్రహం, జుమ్మేరాత్ బజార్, చుడీబజార్, బేగం బజార్ ఛత్రీ, సిద్ధిఅంబర్ బజార్, గౌలిగూడ చమాన్, గురుద్వార్, పుతిలీబౌలీ క్రాస్రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామ శాలకు చేరుకోనుంది. ఈ నేపథ్యం లో సీతారాం బాగ్ నుంచి కోఠి వరకు ఏడు కిలోమీటర్లు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

సీతారాం బాగ్ ఏరియాలో

1 ఆసిఫ్‌ నగర్ వైపు నుం చి వచ్చే ట్రాఫిక్ మల్లేపల్లి క్రాస్‌‌‌‌ రోడ్స్ నుంచి విజయనగర్ కాలనీ, మెహిదీపట్నం వైపు వెళ్లాలి.

2 బోయిగూడ కమాన్ నుంచి సీతారాం బాగ్ వైపు వచ్చే వాహనాలు ఆఘాపురా, హబీబ్‌ నగర్ వద్ద మళ్లింపు.

3 అఘాపురా, హబీబ్‌ నగర్ నుంచి సీతారాం బాగ్ మార్గంలో వచ్చే ట్రాఫిక్ దారుసలాం వద్ద మళ్లింపు.

4 బోయిగూడ కమాన్ నుంచి పురాణాపూల్ వెళ్లే వాటిని దారుస్సలాం వద్ద మళ్లించారు.

5 పురాణాపూల్ నుంచి గాంధీ విగ్రహం వైపు వచ్చే వాహనాలను, పేట్లబుర్జు, కార్వాన్, కుల్సుం పురా వైపు మళ్లించారు.

6 ఎంజే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను జుమ్మెరాత్ బజార్ వైపు, సిటీ కాలేజీ, అఫ్జల్‌ గంజ్ వైపుకు మళ్లించారు.

7 మాలకుంట నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వాహనాలను అలస్క నుంచి దారుస్సలాం వైపు మళ్లించారు.

8 అఫ్జల్‌ గంజ్ నుంచి సిద్ధి అంబర్‌‌‌‌బజార్ రూట్ లో వచ్చే వాహనాలను సాలార్జంగ్ బ్రిడ్జి వద్ద మళ్లించారు.

9 రంగ్‌‌‌‌మహల్, కోఠి నుంచి గౌలిగూడ చమాన్ వైపు వెళ్లే వాహనాలను జాంబాగ్, ఎంజే మార్కెట్ వద్ద మళ్లించారు.

10 అఫ్జల్‌ గంజ్ నుంచి ఎంజే బ్రిడ్జి వైపు వచ్చే వాహనాలను మదీన, సిటీ కాలేజ్ వైపు మళ్లించారు.


ఆర్టీసీ బస్సుల కోసం

1 నిరంకారి భవన్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి లిబర్టీ వచ్చే బస్సులు ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, పీసీఆర్-బషీర్ భాగ్ వైపు మళ్లిస్తారు.

2 రాణిగంజ్, కర్బాల మైదాన్ నుంచి లిబర్టీ, బషీర్ బాగ్ వైపు వచ్చే బస్సులు, చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, ధోబీ ఘాట్,  కట్టమైసమ్మ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఇందిరాపార్క్ మీదుగా మళ్లింపు

అఫ్జల్ గంజ్, కోఠి ఏరియాల్లో

1 అఫ్జల్ గంజ్ నుంచి కోఠి వచ్చే వాహనాలు సెం ట్రల్ లైబ్రరీ, సాలార్జింగ్ మ్యూజియం వైపు మళ్లించారు.

2 రంగ్ మహల్ నుం చి వచ్చే ట్రాఫిక్ ను సీబీఎస్ వైపు మళ్లించారు.

3 రంగ్ మహల్, ఆంధ్రా బ్యాంక్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను జాంబాగ్ వైపు మళ్లించారు.

4 బ్యాంక్ స్ట్రీట్ నుంచి పుతిలీబౌలి వైపు ట్రాఫిక్ అనుమతించరు.

5 బ్యాంక్ స్ట్రీట్ నుంచి వచ్చే ట్రాఫిక్ ర్యాలీ ముగిసే వరకు డీఎంహెచ్ఎస్ వైపు మళ్లించారు.

6 ఛాదర్ ఘట్ బ్రిడ్జి, సాయిబాబా టెంపుల్ నుంచి వచ్చే ట్రాఫిక్ నింబోలి అడ్డా వైపు మళ్లించారు.

7 నారాయణగూడ, కాచిగూడ నుంచి వచ్చే వాహనాలు కాచిగూడ స్టేషన్ రోడ్ మీదుగా మళ్లింపు.

8 చర్మాస్ నుంచి వచ్చే వాహనాలు ఎంజే మార్కెట్, నాంపల్లి స్టేషన్ రోడ్ లో మళ్లింపు.

9 అబిడ్స్ జీపీవో నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వాహనాలకు అనుమతి లేదు.

10 తిలక్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ను రామ్ కోటి వైపు మళ్లించారు.

అంబేద్కర్ జయంతి ట్రాఫిక్ ఆంక్షలు

1 కట్టమైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్ తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపు మళ్లిస్తారు.

2 చిల్డ్రన్స్ పార్కు నుంచి వచ్చే ట్రాఫిక్ డీబీఆర్ మిల్స్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లిస్తారు.

3 లిబర్టీ నుంచి వచ్చే ట్రాఫిక్ బీఆర్ కే భవన్, ఐటీ ఆఫీస్, అప్పర్ ట్యాంక్ బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు

4 ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్ లిబర్టీ నుంచి వచ్చే వాహనాలు తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఐటీ ఆఫీస్, క్రిస్టల్ హోటల్

వద్ద ఎడమ వైపుకు మళ్లింపు