నయనానందకరం.. నారసింహుడి కల్యాణం

నయనానందకరం.. నారసింహుడి కల్యాణం
  • పాల్గొన్న మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, విప్ బీర్ల... ప్రభుత్వం తరఫున పట్టుబట్టలు పెట్టిన ఎండోమెంట్ కమిషనర్  

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం నయనానందకరంగా జరిగింది. ప్రధానాలయ ఉత్తరం వైపున కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మండపంలో స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేసి కల్యాణ తంతు నిర్వహించారు. మొదట గజవాహనంపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో ఊరేగి దర్శనమిచ్చారు.

ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల అర్చకత్వంలో కల్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. రాత్రి 8:45 గంటలకు మొదలైన కల్యాణం దాదాపుగా రెండు గంటల పాటు నేత్రపర్వంగా సాగింది. తులా లగ్న ముహూర్తాన స్వామివారు అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే తంతును కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణంలో ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారి వారి కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

లోక్​సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సాధారణ భక్తుల లెక్కనే మంత్రులు తిరుకల్యాణం తిలకించారు. కోడ్ దృష్ట్యా మంత్రులకు బదులు ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారికి పట్టువస్త్రాలు, అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణాన్ని స్పష్టంగా వీక్షించడానికి ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. యాదగిరి కొండకు ఏర్పాటు చేసిన లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొండ నలువైపులా స్పెషల్ లేజర్ లైటింగ్, స్పాట్ లైటింగ్ ఏర్పాటు చేయడంతో.. యాదగిరి కొండకు సరికొత్త శోభ సంతరించుకుంది. ఈవో భాస్కర్ రావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ పాల్గొన్నారు.