టీజీవోతో శ్రీనివాస్​గౌడ్​కు ఎలాంటి సంబంధం లేదు : ఏలూరు శ్రీనివాస్​రావు

టీజీవోతో శ్రీనివాస్​గౌడ్​కు ఎలాంటి సంబంధం లేదు : ఏలూరు శ్రీనివాస్​రావు

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు  తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం(టీజీవో)తో ఎలాంటి సంబంధం లేదని టీజీవో ఫౌండర్ ​జనరల్ ​సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్​రావు స్పష్టం చేశారు. గత 9 ఏండ్ల నుంచి సంఘాన్ని శ్రీనివాస్​ గౌడ్​ తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఉద్యోగుల సమస్యలపై సర్కారును ప్రశ్నించనీయకుండా అణచివేశారని మండిపడ్డారు.

ఈ మేరకు 9 ఏండ్ల నుంచి ఉద్యోగుల డీఏలు, పీఆర్సీలు, 317 జీవో, సీపీఎస్ రద్దు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్​పై బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 50 మందితో ఏలూరు శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి అసోసియేషన్​లో మెంబర్ షిప్ చేయకుండా, ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకొని తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. “టీజీవోతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్​కు ఎలాంటి సంబంధం లేదు. 2014 ఎన్నికలకు ముందు తన ఉద్యోగానికి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేశారు. 

తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్ అధికారులకు అసోసియేషన్ ఉండాలని ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర ఉద్యమ నేతలతో చర్చించి టీజీవోను నేనే రిజిస్టర్ చేయించిన. తెలంగాణ ఏర్పాటు తర్వాత శ్రీనివాస్​గౌడ్ ​సంఘాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించనీయలేదు. ఆర్టీఐ కింద టీజీవో సమాచారం అడిగితే కేసులు పెట్టించారు. నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు.18 క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 

నాది ఖమ్మం జిల్లా అయితే మహబూబ్​నగర్​లోని చివరి ప్రాంతాలకు బదిలీ చేశారు. నా ఇల్లు కూలగొట్టించిండ్రు. నా బిడ్డల పెళ్లి టైమ్​లో ఇబ్బందులు పెట్టారు. ఎన్నో సార్లు నన్ను బదిలీ చేయించారు. ఖమ్మం జిల్లాలో అక్కడి మంత్రి, శ్రీనివాస్ గౌడ్ కలిసి యూనియన్ నేతలను తొలగించి వాళ్లకు నచ్చిన వ్యక్తులను నియమించారు. మంత్రిగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి అసోసియేషన్ ​బైలాస్​రూల్స్ మార్చారు. ఇటీవల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఓ హోటల్​లో మీటింగ్ ఏర్పాటు చేసి నేనే గౌరవ అధ్యక్షుడిగా ఉంటానని అసోసియేషన్ నేతలను బెదిరించాడు” అని శ్రీనివాస్​ ఆవేదన వ్యక్తం చేశారు.

అక్రమాలపై విచారణ జరపాలి

రాష్ట్ర ఆవిర్భావం నుంచి టీజీవోలో ఎన్నో అక్రమాలు జరిగాయని, అన్నింటిపైనా రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని ఏలూరు శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. నాంపల్లి టీజీవో ఆఫీస్ ను హౌసింగ్ బోర్డు నుంచి 33 ఏండ్లకు నామమాత్రపు రేటుకు లీజుకు తీసుకున్నారని, రెంట్ కూడా సరిగా కట్టడం లేదన్నారు. అందులో ఉన్న ఫర్నీచర్ కూడా ప్రభుత్వానిదేనని ఆయన గుర్తుచేశారు. ఈ ఆఫీస్​ను సీజ్ చేపిస్తామని ఆయన స్పష్టం చేశారు. టీజీవోలో ఉన్న నేతలకు మూడు, నాలుగు సొసైటీల్లో సభ్యత్వం ఉందని, బిల్డింగులు, విల్లాలు నిర్మించుకున్నారని వీటిపై విచారణ జరిపించాలన్నారు. 

అసోసియేషన్​కు ఉన్న మ్యాగ జైన్​లో శ్రీనివాస్ గౌడ్, మమతల ఫొటోలు తప్ప, ఉద్యోగుల సమస్యలపై వార్తలు ఉండవని, ఐఅండ్​పీఆర్ నుంచి ఎన్నో యాడ్స్ పొం దారని, బిల్లులు, లెక్కలు, పత్రాలు, ఆడిట్ ఏం లేవ ని శ్రీనివాసరావు ఆరోపించారు. అసోసియేషన్ ఏ పార్టీకి అనుకూలం కాదని, ప్రభుత్వ స్కీమ్​లను ప్రజ ల్లోకి తీసుకెళతామని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రజా పాలన స్కీమ్ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత సభ్యత్వం చేపట్టి, జిల్లాల్లో ఎన్నికలు నిర్వహించి, కేంద్ర సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. గత 9 ఏండ్లుగా తెలంగాణలో ఉద్యోగులు, అధికారులు కనీసం నార్మల్ ఫోన్​కాల్స్​మాట్లాడలేదని, అందరూ వాట్సాప్ కాల్స్ మాట్లాడారని ఆయన గుర్తుచేశారు.