- యువతిపై అత్యాచారం కేసు విచారణలో కీలక పరిణామం
ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురం పరిధిలో ఉన్న బొమ్మరిల్లు కాంప్లెక్స్‌లోని శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్, హోటల్లోని13 రూమ్‌లను రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆదివారం సీజ్ చేశారు. ఇటీవల ఇదే హోటల్లో యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడడంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. పగలు, రాత్రి తేడా లేకుండా కస్టమర్లకు మద్యం అమ్ముతున్నారని, పైగా హోటల్ గదుల్లో వారు ఉండడానికి ఎలాంటి ధ్రువపత్రాలు తీసుకోకుండా అనుమతులు ఇస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
వనస్థలిపురం సీఐ విజ్ఞప్తితో రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ సూరజ్ కుమార్ ఆదేశాలతో శ్రీరస్తు బార్ అండ్ రెస్టారెంట్, హోటల్‌కు తాళాలు వేసి సీజ్ చేశారు. చట్టవ్యతిరేక వ్యతిరేక, అసాంఘీక కార్యకలాపాలను ప్రోత్సహించేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.